Title: అగ్నిగుండం
Author: Mahidhara Ramamohan Rao
Release date: April 28, 2012 [eBook #39561]
Language: Telugu
Credits: Produced by Volunteers at Pustakam.net
Produced by Volunteers at Pustakam.net
అగ్నిగుండం
మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
చంద్రం బిల్డింగ్స్, విజయవాడ-520004
ప్రచురణ సంఖ్య : 939
ప్రతుల సంఖ్య : 2000
ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి, 1980
వెల : రూ. 8/-
ముద్రణ:
స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్.
విజయవాడ-520004
పూజ్యమిత్రులు
శ్రీపాద లక్ష్మీనరసింహంగారి
స్మృతికి
జాగ్రత్త పడవలసిన ఘట్టం
ఒక పెద్ద పోలీసు అధికారి ఒక మేధావుల సభలో హైద్రాబాద్‌లో ప్రసంగిస్తూ ప్రజలలో హింసా ప్రవృత్తీ, దౌర్జన్య దృక్పథం పెరిగి పోయిందన్నారు. పోలీసు బలగానికికూడా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పినా, ప్రజలలో ఆ ప్రవృత్తి తీవ్రం కావడంచేతనే పోలీసులలోనూ దాన్ని ప్రతి క్రియారూపంలో చూస్తామనేది ఆయన వాదన సారాంశం.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ వర్గాలు, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న అవినీతి, ప్రజా వ్యతిరేకత, హింసా ప్రవృత్తికి ప్రతిక్రియగానే ప్రజలలో దౌర్జన్యకాండమీద మొగ్గుదల ప్రబలుతూంది. ఒక లారీనో బస్సునో తగలపెట్టేరన్నా, ఒక పోలీసు స్టేషను మీద రాళ్ళు విసిరేరన్నా, ఒక ఆఫీసరునో, కళాశాలాధికారినో చెయ్యి చేసుకున్నారన్నా, ప్రత్యర్ధిని ఒంటరిగా చిక్కించుకొని పొడిచేశారన్నా చివరికి నక్సలైట్ వుద్యమం చెలరేగిందన్నా ఇది సమాజంలో నోరుగలవాళ్ళూ, అధికారం గలవాళ్ళూ నిర్భయంగా సాగిస్తున్న అన్యాయాలూ, దురంతాల ప్రతిక్రియగా వస్తున్నదేగాని వేరుకాదు. నా 'రధచక్రాలలో' ఒక వాక్యం వుంది: "నిప్పు ముట్టించేవాళ్ళమూ మనమే, చెయ్యి కాలి ఏడ్చేవాళ్ళమూ మనమే"—నని. నిజానికి పాలకవర్గాలు చేస్తున్నదదే.
ఈ నవలలోని ఘటనలన్నీ నేనే అనుభవించినవో, స్వయంగా చూసినవోనే. వానికి నవల రూపం ఇవ్వడంలో వెనక ముందులూ, కొన్ని సర్దుబాట్లూ, తగు మాత్రపు సాగదీయడాలూ వున్నా ఇవన్నీ జరిగినవే. అయితే అవి జరిగినవి 12-13 ఏళ్ళ క్రితం. ఈనాడవి మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి. ఇటీవలి డాక్టర్లు, లెక్చరర్లు, బ్యాంకు ఉద్యోగులు మొదలయిన వారి సమ్మెలు ప్రభుత్వ, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి ప్రతిక్రియా రూపమేగాని వేరుకాదు. సాధ్యమైనంతవరకు ఒరగ దోసుకుపోయే స్వభావంగల మధ్యతరగతులలోకి కూడా ఈ ఆత్మరక్షణ భావం బలపడిందంటే సామాజిక పరిస్థితులు ఎంత క్షీణిస్తున్నాయో అర్థం చేసుకోగలం.
తెలుగు దేశం నాకో అగ్నిగుండంగా కనిపించింది. ఈవేళ ఆ స్థితి మరింత క్షీణించింది. హింసా, అన్యాయాలను ప్రభుత్వం తన విధానంగా మార్చుకొంది.
ఇదో జాగ్రత్త పడవలసిన ఘట్టం.
మహీధర రామమోహనరావు
1-2-1980
అమీర్‌పేట
ఒక మాట
1967 జూన్‌లో ప్రభుత్వపు రిట్రెంచిమెంటు పథకంతో తెనుగు దేశం అట్టుడికి నట్లున్నప్పుడు మిత్రులు కొసరాజు శేషయ్యగారూ నేనూ ఆనాటి పరిస్థితిని యితివృత్తంగా తీసుకొని నవలలు వ్రాయాలనుకున్నాం.
ఆ రోజు మొదలుకొని ఒకటి రెండు నెలలు నేను చూసినవి, వింటున్నవి, అనుభవిస్తున్నవి, చదువుతున్నవి కాగితం మీద పెట్టేను. అలవాటు పడిపోవడంచేత మనకు కనిపించని భయానకమైన సామాజిక విశీర్ణత-గతి వానిలో కనిపించింది.
ఆ ఘటనలకు ఒక కథా రూపం కల్పించి ఆనాడే కాగితం మీద పెట్టేను. కాని, ఆ కథకు ముగింపు ఎలాగో అర్థం కాలేదు. వానిని కట్టగట్టి పెట్టెలో పడేశా.
రెండేళ్ళ అనంతరం శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్లు జిల్లాలలో నక్సలైట్ పోరాటాలు, విద్యావంతులలో వ్యాపిస్తున్న నిహిలిస్టు ధోరణులు, ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక ధోరణులు, రాజకీయ పార్టీల విచ్ఛిన్న స్థితి, నిస్తబ్ధస్థితి నుంచి బయటపడటానికి కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న కృషి చూసేక, నా నవలకు ముగింపు అర్థం అయిందనిపించింది.
ఒకటి రెండు మార్పులూ, చేర్పులూ, చివరన రెండు మూడు ప్రకరణాల జోడింపుతో నవల పూర్తి అయింది.
అదే 'అగ్నిగుండం' అదో అగ్నిగుండం. మీ ముందుంది.
-రచయిత
24-12-71
మద్రాసు
ఒకటో ప్రకరణం
ఆంధ్రప్రభుత్వం తలపెట్టిన పొదుపు ప్రయత్నం ఊళ్ళంపట ఊరేగింపులు సాగిస్తున్న మంత్రుల ప్రయాణపు ఖర్చుల్ని గాక, తన బతుకు తెరువుకు ఏకైకాధారంగా వున్న ఆ రెండు వందల యాభై రూపాయల నెల జీతాన్నీ సమూలంగా కోసేస్తున్నదని తెలిసేవరకు రామారావు నిర్విణ్ణుడే అయాడు.
"ఇప్పటికే కొన్ని సబ్జక్ట్సుకి లెక్చరర్లు లేరు. ఉన్నవాళ్ళు చాలక కొన్ని క్లాసులు జరగడం లేదు. ఇంకా వున్నవాళ్ళని తగ్గించడం వలన చదువులు మరింత చెడతాయి…."
"వెరీ….వెరీ సారీ. నేను చెయ్యగల దేమీలేదు."—అని ప్రిన్సిపాలు మరోమారు ఇంగ్లీషులో తన బాధా, తెలుగులో తన అసమర్థతా కనబరిచేడు.
"మనది అసలే దరిద్రదేశం. ప్రక్కనున్న రాష్ట్రంతో పోలుస్తే మనకి చదువూ తక్కువే. అటువంటప్పుడు ఉన్నవాళ్ళచేత పకడ్బందీగా పని చేయించుకొని దేశాన్ని సుందరంగా, సౌభాగ్యవంతంగా…."
స్వాతంత్ర్యదినోత్సవపు ఉపన్యాసధోరణిలో పడిపోతున్నాననిపించి రామారావు మాట మధ్యలోనే ఆగిపోయేడు.
"డబ్బు లేనప్పుడు ప్రభుత్వం మాత్రం చెయ్యగలదేముంది? ప్రభుత్వమే చెయ్యి వెతకవేస్తే కాలేజీ కమిటీ ఏంచేస్తుంది?"—అంటూ ప్రిన్సిపాలు టీచర్లను తగ్గించవలసి రావడాన్ని సమర్ధించడానికి ప్రయత్నించేడు. కాని, ఆయన కంఠస్వరంలో ఆ విశ్వాసం వినబడలేదు.
"కమిటీ చెయ్యగల దేమీ లేదా?"
ప్రిన్సిపాల్ ఎటోచూస్తూ సమాధానం ఇవ్వలేదు. తన ప్రశ్నకు తానే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు, రామారావు.
"ఇప్పటికే కాలేజీలో టీచింగ్ స్టాఫ్ కన్నా నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎక్కువగా వుంది."
ప్రిన్సిపాల్ నిట్టూర్పు విడిచాడు.
"పనులు అల్లావున్నాయి…."
"ప్రిన్సిపాల్ గారూ! ప్రమాదం వచ్సినప్పుడేనా మొగమాటాలూ, భయాలూ వదలిపెట్టాలి. కాలేజీ నిర్వాహణ ఖర్చులో 80 శాతాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషను భరిస్తున్నప్పుడు టీచింగ్ స్టాఫ్ ని గట్టిపరుచుకోవాలి. కాని, మన కాలేజీ కమిటీ…."
"మన దనేదేమిటి? అన్నిచోట్లా జరుగుతున్న పనే ఇక్కడా చేశారు."—అని ప్రిన్సిపాల్ యథాశక్తి కాలేజీ పాలకకమిటీ అపరాధాన్ని తగ్గించేందుకు ప్రయత్నించేడు.
"అందరూచేస్తే దేశద్రోహం ఘరానాపని అవుతుందా సార్! కమిటీ సభ్యులు పోటాపోటీగా తమ అనుచరుల్నీ, బంధువుల్నీ, వారి సిఫారుసుల్నీ తీసుకొని, పని లేకపోయినా గుమాస్తాలుగా, అట్టెండర్లుగా, వేసేస్తూంటే పట్టనట్లు వూరుకున్నాం. ఈవేళ…."
"వాళ్ళని తరిమెయ్య మంటావు…." అన్నాడు ప్రిన్సిపాల్ అతని వాదం సమర్థనీయం కాదన్నట్లు.
"కాలేజీలు చదువుకోసమా, కాక సెక్రటరీగారి తమ్ముడు మామగారి మేనల్లుడికి అట్టెండరు వుద్యోగం ఏర్పాటు కోసమా—అన్నదానిని పట్టి వుంటుంది."
ప్రిన్సిపాల్ నిరుత్తరుడయ్యేడు. ఒక్క క్షణం వూరుకొని—"నా చేతుల్లో ఏమీలేదు, రామారావూ నా చేతుల్లో ఏమీలేదు అన్నాడు."
ఆయన బాధ ఎరిగిన రామారావు నిరుత్తరుడయ్యాడు. నిరుడు ఒక ఇంగ్లీషు లెక్చరరు అనవసరంగా ఒక విద్యార్థిని అవమానించేడు. కాలేజీ పిల్లలంతా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండుచేస్తూ సమ్మె చేశారు. ఆ లెక్చరరుకు కమిటీలో వెనకదన్ను వుంది. చాలా గొడవ జరిగింది. తెలివైన ఇద్దరు విద్యార్థులకు టి. సి. లిచ్చి పంపెయ్యవలసి వచ్చింది. ఆ లెక్చరరు ఇక్కడే వుండి రోజూ ఏవేవో సమస్యలు తెచ్చి పెడుతూనే వున్నాడు. ప్రిన్సిపాల్ ఏమీ చెయ్యలేక పోతున్నాడు. అదే ఒక్కమాటలో చెప్పేడు.
"నా చేతుల్లో పనా? నీ వెర్రిగాని…."
"కాలేజీ కమిటీని కలుసుకోమంటారా?"
ఆ అమాయకత్వానికి జాలి పడుతున్నట్లు ప్రిన్సిపాల్ ముఖం పెట్టేడు. అదేం లాభంలేదని ఆయన ఎరుగును. కనక ఉపశమన వాక్యాలతో సంతృప్తి పరచ దలిచేడు.
"కలుసుకోడంలో తప్పేమీ లేదు. కాని, వాళ్ళూ ఏం చెయ్యలేరు. అనవసరం. ఈ పాడు వుద్యోగం లేకపోతే బతకలేక పోతావట. గోల్డ్ మెడలిస్టువి. తెలివి ఉంది. చొరవ ఉంది. కుర్రవాడివి, బోలెడు జీవితం ముందున్న వాడివి…."
"అన్నీ వున్నాయికాని అంచుకు తొగరే లేద"ను కున్నాడు రామారావు. పైకిమాత్రం అవహేళనను మిళితం చేసి, తన బాధ తెలిపేడు.
"అదేనండి దుఃఖం. ఇంత బతుకు గడవాలే ఎల్లాగరా యనే…."
"ఠట్, ఠట్." కోప్పడుతున్నట్లు ధ్వనించేడు ప్రిన్సిపాలు.
రామారావు మరింత ఉక్రోషం కనబరిచేడు.
"యయాతి వంటి వాడెవరన్నా దొరికితే బాగుండును. ఓ ఏడాది బతికే దారి చూపుతే జీవితం అంతా ఇచ్చేద్దును."
ప్రిన్సిపాల్ కళ్ళలో హాసరేఖలు తోచేయి.
"మేథమెటిక్సు వాడివి. ఆర్టిలరీలోకి నీవంటివాళ్ళ అవసరం వుంటుంది. యయాతి ఆధునికావతారమే దేశభక్తి. పోయి సైన్యాలలో రిక్రూట్ కారాదూ?"
రామారావు తెల్లబోయేడు. ప్రిన్సిపాల్ లేచివచ్చి అతని భుజం తట్టేడు.
"ఒక్క చిన్న దెబ్బకే జీవితం అంతా కొల్లబోయినట్లే బాధ పడితే ఎల్లాగయ్యా! జీవితం అంటే ఏమిటనుకొన్నావు? జీవించేందుకు నిరంతరం సాగించే ఘర్షణే జీవితం అంటే."
"ఇది చిన్న దెబ్బా? ప్రిన్సిపాల్ గారూ! రామారావు బతుకు దృష్ట్యా చూసినా ఇది చిన్న దెబ్బేం కాదు. దేశం దృష్ట్యా చూసినా కాదు. ఈవేళ వుద్యోగంనుంచి తీసేస్తున్నది నన్నొక్కడినే అనుకోను."
"కాదు…."
"రిట్రెంచిమెంటు ఆలోచనను ఎన్నికలకోసం వెనక్కి పెట్టేరు. ఏరు దాటడం అయిపోయింది. కనక తెప్పలకి ఇప్పుడు నిప్పు ముట్టిస్తున్నారు. దేశంలో చదువు కనీస ప్రమాణానికి కూడా చేరలేదు. పరిశ్రమలు లేవు. ప్రాజెక్టులు లేవు. హాస్పిటళ్ళు లేవు. పదివేలమందికో డాక్టరన్నా లేడు. ఉన్నవాళ్ళని కూడా మాకొద్దు పొమ్మంటున్నారు. దేశం ఏమవాలి? దేశంలోని జనం ఏమవాలి? ఇరవయ్యేళ్ళ స్వాతంత్ర్యం దేశానికీ, మనకీ, తెచ్చిందీ, ఇచ్చిందీ ఈ దుఃఖమూ, ఈ నిర్వేదమూ మాత్రమేనా? దీనినేనా మీరు చిన్నదెబ్బ అనేది?"
ఆ ఆవేశం చూసి ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. ఏం చెప్పడానికీ తోచలేదు. టేబిలుమీది కాగితాలు సర్ది, పేపర్ వెయిట్ లు మార్చడం మొదలు పెట్టేడు.
రామారావు ఒక్క నిముషం ఆగి, తన అభిప్రాయం స్పష్టం చేసేడు.
"మనుష్యుల్ని తోసెయ్యగల వాళ్ళకి దేశం కాబట్టదు. దేశాన్ని గౌరవించలేనివాడు మనుష్యుల్నీ మన్నించలేడు."
ప్రిన్సిపాల్ పరధ్యాన్నంగానే అనేసేడు—"అంతేలే, అంతేలే…."
"సెలవిప్పించండి."
"వెళ్ళిరా. ఆందోళన పడకు, అన్నీ సర్దుకొంటాయి."
ప్రిన్సిపాల్ అనునయం, ఓదార్పు అతని చెవి చొరడంలేదు. దేశభక్తి గురించి ఆయన చేసిన వ్యాఖ్య మనస్సులో మెరుగుతూంది. వెనక్కి తిరిగిన వాడే మళ్ళీ ఆగేడు.
"దేశభక్తిని అంత చులకనగా తీసుకోలేనండి. దేశ రక్షణ కోసం ఆయుధాలు తీసుకోడం, సైన్యాలతో చేరడం తప్పు కాదు. కాని, కిరాయి కోసం, తిండిలేక సైన్యంతో చేరవలసిన స్థితి మనిషికీ, దేశానికీ కూడ ఆరోగ్యం కాదు."
ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. కనుబొమ్మలు ముడిచేడు. అంతలో నవ్వేడు.
"ఇదిగో, చూడు. నా వయస్సేమిటి? సూపర్ ఆన్యుయేషన్ కూడా ముగుస్తూంది. ఇంకో నాలుగు నెలలు, ఈ వయస్సువాడి నుంచి ఆక్రోశం, అనుతాపం తప్ప ఆశించి లాభం లేదు."
ఈ మారు తెల్లబోవడంవంతు రామారావుది. పడుచువాళ్ళు ఆక్రోశపడీ, ఆవేశపడీ లాభంలేదని చెప్తున్నాడా అనిపించింది. వయస్సులో వున్నావు. అమీ, తుమీ తేల్చుకో. దేశం అంటే వున్న అభిమానాన్ని క్రియతో చూపమనడమా, ఆ మాటకు అర్థం?
అంతలో సర్దుకొన్నాడు. ఆ దూరాన్వయమూ, కవ్వింపు ఆలోచనా ఆయనకు వుండవనిపించింది. అంతలో ఆయనే అన్నాడు.
"ధైర్యంగా వుండు. నే చెప్పగలదంతే. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని వస్తూండు. సబార్డినేట్ ననే సంకోచం కూడా ఇంక అక్కర్లేదు."
"చిత్తం. సెలవు."
రెండో ప్రకరణం
"ఏమిటిహ."
—అన్నాడు, వెనకనుంచి హడావిడిగా వచ్చి, కాలేజీ గేటులో అందుకున్న సహభాగి రామలింగేశ్వరరావు. పరధ్యానంగా, ఏదో ఆలోచించుకుంటూ పోతున్న రామారావు వెనక్కి తిరిగేడు.
"నువ్వా."
"ఇంక పనేముంది మరి."
అంత మానసిక వ్యధలోకూడ అతనిని చూడగానే కలిగిన తేలిక భావాన్ని రామారావు దాచుకోలేక పోయేడు. ఆ రోజున తనతోపాటు ఉద్యోగంనుంచి తీసివేయబడిన వారిలో అతనూ వున్నాడని తెలుసు. అయినా, అడిగేడు.
"ఏం? నీకూనా?"
రామలింగేశ్వరరావు ముందు తలాడించేడు. అంతలో ఆ మాటలో ఏదో హేళన భావం ధ్వనించినట్లు తోచింది.
"నీకూనా, అంటే?"
"ఎన్నికల్లో అంత చాకిరీ చేసేవు. నెగ్గించేవు. విజయోత్సవంతో బొంగురుపోయిన గొంతుక స్వాధీనం కావడానికి పదిరోజులు పట్టింది. అంతల్లా నినాదాలు ఇచ్చేవు. ఆయనమీద అన్ని ఆశలు పెట్టుకున్నావే—అని."
రామలింగేశ్వరరావుకి కోపం బదులు విచారం కలిగింది.
"వారం క్రితంకూడా అదే అన్నాడోయి—మనమాట మాటే. నీ వుద్యోగానికి ఏం ఢోకాలేదు. వెళ్లిరా—అన్నాడు. చివరకి ముంచేసేడు."
"ఆయన మాటల్లో తఖావతు ఏమీలేదు. నిజమే చెప్పేడు. ఆ వుద్యోగానికి ఢోకా ఏం వుంది? అదల్లాగే వుంటుంది. వాళ్ళవాడెవడో వచ్చేదాకా వుంటుంది. మధ్యన పొయ్యేది నువ్వు…."
"అంతేనంటావా?"
"చూస్తాంగా." అన్నాడు, రామారావు తేలికగా. కాని, రామలింగేశ్వరరావు అంత తేలికగా తీసుకోలేకపోయేడు.
"నీకేం బ్రహ్మచారిగాడివి, ఒంటరిగాడివి. ఏ ట్యూషన్లు చెప్పుకున్నా నీ పొట్ట నిండుతుంది. నేనేం చేసేది? పెళ్ళాం, ఓ పిల్లవాడూ నాకు తోడు. వాళ్లనేం చెయ్యను?"
"బ్రహ్మచారిగాడివి నీకేం—" అన్నమాటకు రామారావుకు నవ్వొచ్చింది. "రేపెల్లాగరా" అని తాను బాధ పడుతున్నాడు.
అతని నవ్వు చూస్తే రామలింగేశ్వరరావుకి అభిమానం అనిపించింది.
"ఈ లం….జా….కొడుకుల్ని వురితీసినా పాపం లేదు."
"ఎన్నుకొని పంపింది, వురితియ్యడానికా, పాపం!"—రామారావు కృత్రిమమైన జాలి నభినయించేడు.
"నేను దేశానికి నిజంగా ద్రోహం చేసేననే అనిపిస్తూంది."
రామారావు అతని ముఖంవంక చూసేడే తప్ప ఏమీ అనలేదు.
"ఏమంటావు?"
"రిట్రెంచిమెంటు ఆలోచనలు జరుగుతున్నాయని ఎన్నికలకు ముందే అందరూ ఎరుగుదురు. ఎన్నికలైన మర్నాడే ఖజానా ఖాళీ అయిపోయిందని తెలుసుకొన్నారనుకోకు."
"ఊ."
"నీ కానాడు అనిపించలేదు."
"వాళ్ళ మాటలు నమ్మేను."
"నీ దాకా వచ్చి వుండకపోతే ఇప్పుడూ ఆ నమ్మకం చెదిరి వుండేది కాదు."
ఆ ఆరోపణలో నిజం లేకపోలేదని రామలింగేశ్వరరావు ఎరుగును. ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఇద్దరూ ఒకరి ప్రక్కనొకరు నడుస్తూ బస్సు స్టాపువేపు వెడుతున్నారు.
కొంతదూరం వెళ్ళేక రామారావే అన్నాడు.
"ఈ రావులూ, రెడ్లూ నిజాయితీ లేనివాళ్ళు అనను. అయితే వాళ్ళ మినహాయింపులూ, పరిధులూ, పరిమితులూ వేరు."
రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
"వాళ్ళు తను ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్నారనే అంటావేమిటి, కొంపతీసి."
"చిన్న పిల్లాడల్లే మాట్లాడకు"—అని రామారావు గదిమేడు—"ఒక మనిషేమిటి? పార్టీయే అనే దేమిటి? వాళ్ళ నిజాయితీ తెలుసుకోడానికీ, కొలవడానికీ మాటలు కాదు, చూడవలసింది. చేతలూ వాటి ఫలితాలూను."
"ఔను." అన్నాడు రామలింగేశ్వరరావు. కాని, ఆ మాటలో విశ్వాసం వినిపించలేదు.
"ఏమిటి నీ సందేహం?"
"కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళ తరవాత దేశం 1947లో వున్నట్లుగానే లేదు."
"ఉందని ఎవరన్నారు?"
"చదువులు….పరిశ్రమలు….ప్రాజెక్టులు….దేశం మొత్తం మీద చూడు."
"ఔను."
"అందుచేతనే మోసపోయాను. వానిని చూపించే మోసపుచ్చేరు."
రామారావు నవ్వేడు.
"ఇంకా అల్లాగే మోసపోతుండడానికి ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏమిటి?"
తనదాకా వచ్చిందనే తప్ప, రామలింగేశ్వరరావుకి మరో కారణం కనబడలేదు. అయితే ఆ మాట ఒప్పుకోలేదు. తప్పించుకున్నాడు. "నువ్వే చెప్పు"
రామారావు చెప్పేడు. దేశం మొత్తం మీద పెట్టుబడిదారీ – ధనిక భూస్వామ్య వ్యవస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ఎల్లా తోడ్పడుతున్నాయో చెప్పేడు.
"కనకనే పెట్టుబడిదారీ విధానంతో పాటుగా దాని వెనువెంబడి వుండే పీడలన్నీ మనకూ అనుభూతం అవుతున్నాయి."
రామలింగేశ్వరరావు నవ్వేడు.
"ఎలక్షన్ వుపన్యాసం యిచ్చేవు."
రామారావుకు అభిమానం అనిపించింది. తన మాటల్ని అంత తేలిగ్గా తోసెయ్యడమా?
"ఉత్పత్తి ఒక మూల పెరిగింది. రెండో మూల ధరలూ పెరిగేయి. నిజానికవి తగ్గాలి, కాని, అలా జరగడంలేదు."
ఆలోచనకు వ్యవధినిస్తూ, రామారావు ఒక్క క్షణం ఆగేడు. కాని, రామలింగేశ్వరరావు ఆలోచనకు నిరాకరించేడు.
"నేను ఎకనమిక్స్ వాడిని కాదు."
"అక్కర్లేదు. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలకే అది ముడిపడ్డం లేదులే."
"మరి?"
"ఉత్పత్తికీ, పంపిణీకీ సంబంధం లేదు. ఎవరి వాయిద్యాలు వారివి. తీర్ధానికి తీర్ధం, ప్రసాదానికి ప్రసాదంగా వున్న ఈ పరిస్థితి మారాలి."
"అంటే కమ్యూనిజం రావాలి." అన్నాడు. రామలింగేశ్వరరావు ఎకసక్కెంగా.
రామారావు నవ్వేడు.
"పేర్లమీద అంత ఎలర్జీ పెంచుకోకూడదు. అది అట్టే ఆరోగ్యకరమయిన లక్షణం కాదు. పోనీ సోషలిజం పేరు నచ్చితే అల్లాగే పోనిద్దాం."
"ఆ మాట కాంగ్రెసే అంటూంది కదా."
"ఇంకనేం. దాని ఫలితాల గురించి విచారం ఎందుకు?"
"దాని అర్ధం ఒక్కటే. సోషలిజం సంఘంలోని బాధలకు విరుగుడు కాదు."
"సోషలిజం అనే మాటను గబ్బు పట్టించడమే కాంగ్రెసు వారి వ్యూహమనీ, అంతవరకూ ప్రజలలో సోషలిజం యెడవున్న అభిమానాన్ని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం దాని ఎత్తుగడ అనీ అంటే ఓ మాటు నా మీద పడిపోయావు గుర్తుందా?"
రామలింగేశ్వరరావు వూరుకున్నాడు.
"ఇప్పుడేమంటావు?"
"నీ అభిప్రాయం తప్పంటా."
"అన్నీ తెలిసి ఆత్మహత్య చేసుకోదలిచినవాడిని ఆపడం కష్టం. అసంభవం."
"దొంగ వర్తకుల్ని ఉరి తియ్యాలని నెహ్రూ అన్నట్లు మీరు తరుచు జ్ఞాపకం చేస్తుంటారు, సరిగ్గా అదే మందు. వాగ్దానాలను అమలు జరపని వాళ్ళని ఓ అరడజను మందిని ఉరితీసేస్తే సంఘంలో సమస్యలన్నీ సర్దుకుపోతాయి." అంటూ రామలింగేశ్వరరావు సగర్వంగా చూసేడు.
రామారావు నవ్వేడు.
"మందు మంచిదే. ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? ఎప్పుడు మొదలెడతావు?"
మూడో ప్రకరణం
ఎటూ కానివేళ కాలేజీ నుంచి తిరిగి వస్తున్న వాళ్ళిద్దర్నీ చూసి కిళ్లీ బడ్డి రత్తమ్మ చిరునవ్వుతో పలకరించింది.
"ఏం బాబులూ! అప్పిడే ఎలిపోతుండారు. ఎండగావుంది. దయి సేయిండి. ఓ సోడా తాగి పోదురుగాని…."
వారి సమాధానం కోసం ఎదురు చూడకుండానే రత్తమ్మ కిందనున్న నీళ్ళ తొట్టెలోంచి రెండు సోడాకాయలు తీసింది. రెండు గ్లాసులు తొలిచి సిద్ధం చేసింది. నిమ్మ చెక్కలు తీస్తూంది. రెండో వేపున మాటలు చెప్పుకు పోతూంది.
"రామారావు బాబూ! మావోడికి ఎక్కడన్నా కుసింత పని సూపించలేవా బాబూ! వూరకే తిరిగి సెడిపోతున్నాడు. ఏదన్నా పనిలో వుంటే నన్ను డబ్బులకి పీక్కు తినడవేనా తగ్గుతుంది. నువ్వెరగవేంటి? ఈ కొట్టు మీదున్నదే గంద నా ఆస్తి. పెద్దదాన్నయిపోనా. నే తిన్నా, ఆడికెట్టినా దీని మీదే గంద. రోజూ పై కరుసుకి కూడా "తేముండా" అంటే ఎక్కడ సచ్చేది బాబూ!"
ఆమె అభ్యర్ధన విని రామలింగేశ్వరరావు మందహాసం చేసేడు.
"అడుగుతూ, అడుగుతూ మంచివాళ్ళనడిగేవు, మామ్మా!"
రత్తమ్మ చాల నొచ్చుకుంది.
"సదువుకున్నోళ్ళు, మీరే అల్లాగంటే."
"రేపు ఈ కాలేజీ వేపు రావలసిన పని మాకే లేదు. ఈ క్షణం నుంచి మేమూ నీ మనమడూ…."
రత్తమ్మకి ఆ మాట అర్ధం కాలేదు.
"టురాన్స్‌పర్ గీనా? ఎక్కడికి? ఏ వూరెల్తుండారు?"
"ఎక్కడకుంది?—ఇంటికే."
"రత్తమ్మ తెల్లబోయింది. అసలు విషయం చెప్పకుండా అల్లా నలిపి చంపడం రామారావుకి నచ్చలేదు.
"మమ్మల్ని వుద్యోగాలనుంచి తీసేశారు. డబ్బివ్వలేం. పొమ్మన్నారు."
"డబ్బుల్లేవూ?"
"వాళ్ళన్నారు. ఇచ్చీది వాళ్ళు కదా." అన్నాడు రామలింగేశ్వరరావు.
"ఉట్టిది బాబూ! దొంగ నాయాళ్ళు కితం వోరమే గందా, కర్రిపద్దాలు కొడుక్కి కాలేజీలో బంట్రోతు పనేసిండ్రు. అల్లాగే మావోడికీ ఇత్తారేమోననుకుంటే మిమ్మల్ని తీసేశారూ."
"మళ్ళీ కనిపిస్తుంటాంలే మామ్మా. ఇక మీద తీరుబడేగా." అంటూ రామారావు ముందడుగేసేడు. ఓ నిముషం అక్కడ నిలబడదామనీ, కిళ్ళీబడ్డీ రత్తమ్మ సానుభూతి వాక్యాలు వినాలనీ వున్నా, మిత్రుడు నడుస్తుండడం చేత రామలింగేశ్వరరావూ కదలవలసి వచ్చింది.
"ఎల్లి రాండి బాబూ! నోట్లో ముక్కున్నోళ్ళు. ఇంత దేశంలో బతకనేక పోతారంట." అంటూ రత్తమ్మ ధైర్యం చెప్తూంటే "అంతేలే, అంతేలే" అని సాచేసేరు.
పత్రికల్లో నిరుద్యోగం గురించి వస్తున్న వార్తలకు సాక్ష్యంగా రత్తమ్మ పక్క కొట్లవాళ్ళకి తమరిద్దరినీ చూపి చెప్పడం వెనుకనుంచి వినిపిస్తూంటే ఆ ఇద్దరూ ఆమెను గురించే ఆలోచిస్తున్నారు.
ఆమెలాగ కిళ్ళీ కొట్టేనా పెట్టుకుని బతకగలమా అని రామారావు ఆలోచన.
రామలింగేశ్వరరావు ఆలోచనలో కొంచెం తేడా వుంది.
"ఈ ముండకి మనమడుగా పుట్టినా సుఖపడుదుం. ఈ ముండా వుద్యోగాలు వుండడం, పోవడం ఏడుపు లేకుండా వున్నన్ని రోజులూ జల్సాగా…."
"మళ్ళీ మనమడుగా ఎందుకు? ఆ ముండగా పుడితే మంచి మనస్సేనా వుంటుంది కదా." అంటూ, రామారావు మిత్రుని ఆలోచనకు చికాకు పడ్డాడు.
"మనస్సు మంచిదైతే అన్నం వుంటుందంటావా? లేదు సోదరా! కాదు, వట్టి భ్రమ. ఎంతమంది నెత్తిన చెయ్యి పెట్టగలుగుతే అంత అన్నం ఇది ఈ ప్రపంచ సూత్రం. సిద్ధాంతాలనేవి వట్టి హంబగ్."—రామలింగేశ్వరరావు మాటమీద మాటగా ఆవేశంతో అరిచేస్తున్నాడు.
రామారావుకి ఆశ్చర్యం కలిగింది.
"ఏమిటీ వుప్పెన."
తాము నడిరోడ్డు మీద వున్నామనీ, ఆ అరుపుల అవసరం ఏమీ లేదనీ, అప్పుడే దారినపోతున్న వారొకరిద్దరు నిలబడిపోయి, ఆశ్చర్యంగా తమరిని చూస్తున్నారనీ గమనించి రామలింగేశ్వరరావు గమ్మునైపోయాడు.
అంతలో బస్సు రావడంతో ఇద్దరూ కంగారు కంగారుగా దానిలో ఎక్కేసేరు.
నాలుగో ప్రకరణం
ఏలూరు రోడ్డు సెంటరులో బస్సు దిగుతూనే రామారావు ఎదురుగా వున్న హోటలు కేసి దారి తీసేడు.
"రా. ఓ అర కప్పు కాఫీ తాగితే, ఓపిగ్గా దుఃఖ పడొచ్చు."
అతడు దారి తీసిన హోటల్లో ప్రవేశించడం రామలింగేశ్వరరావుకి ఇష్టం లేదు.
"ఆనాడు ధరలు పెంచేసి గంద్రగోళం తెచ్చిన ప్రబుద్ధులలో వీడొకడు. ఈ వేళ మళ్ళీ పాల వాళ్ళతో పేచీలు తెచ్చేడని తెలిసింది. వీళ్ళని అభిమానించడం ద్రోహం."
"అమ్మన్న అమ్మకి మొగుడు. విస్సన్న తల్లికి మొగుడూను. ఇందులో తక్కువ తిన్నవాడెవడూ కాదు. సరే నడు. నీ మాటెందుకు కాదనాలి."
ఇద్దరూ హోటలులో అడుగుపెట్టేరు. లోపల మబ్బు మబ్బుగా వుంది. గోలగా వుంది. సెర్వరొకడు ఖాళీగా ఉన్న టేబులు చూపేడు.
టేబిలు మీద పరచిన మొజాయిక్ స్లాబు బీటలువారీ, పెచ్చులూడీ వుంది. అంతక్రితం తినిపోయినవారి ఎంగిలిపాత్రల స్థానాల్ని గుర్తు చేస్తున్నట్లు ఈగలు పోగులు పోగులుగా ముసిరి పచార్లు చేస్తున్నాయి. వచ్చే పోయే వారితో హోటలు బిలబిలలాడుతూంది. చిత చిత, నీళ్ళు, ఎంగిలి పళ్ళేలు, సెర్వర్ల వెర్రికేకలతో ఆ ప్రదేశం ఎప్పుడూ తోచనంత అసహ్యంగా వుంది.
వారు సెర్వరు చూపిన టేబిలు వద్దకు వెళ్ళడానికి సందేహిస్తూ, శుభ్రంగావున్న మరో చోటు కోసం చూస్తూండడం కౌంటరులో వున్న యజమాని పద్మనాభయ్య గమనించేడు.
"ఒక్క క్షణం ఆగండం"టూ లేచి వచ్చేడు. ఓ కుర్రవాడిని పిలిచి, దగ్గరుండి టేబులు శుభ్రం చేయించేడు.
"ఇల్లా దయ చెయ్యండి."
వారిద్దరినీ కూర్చోబెట్టేక, సెర్వర్ని కోప్పడ్డాడు.
"మనుష్యుల్ని చూసుకోవద్దూ. ఏం కావాలో జాగ్రత్తగా ఇయ్యి." అని పురమాయించి వెళ్ళి తన స్థానం అలంకరించేడు.
పద్మనాభయ్య వెనక తిరిగేక సెర్వరు అతడిని తినేసేలా చూసేడు. కాని, ఏమీ అనలేదు. లోపలి కెళ్ళి రెండు గ్లాసుల నీళ్ళు తెచ్చి బల్ల మీద టప్పున పెట్టేడు. అతని వేళ్ళనున్న జిడ్డు సంక్రమించిందో, గ్లాసులనే జిడ్డు వుందో, అసలు నీళ్ళే మురికివో గ్లాసులోని నీటిమీద జిడ్డు పొర మిలమిల లాడుతూంది. ఇద్దరూ ఆ నీరు ముట్టుకోలేక పోయేరు.
"ఒక కాఫీ, ఒక టీ."
సెర్వరు వెళ్ళిపోయేడు.
"నీ అభిమానాలూ, అహంకారాలూ చాలా ఎలిమెంటల్ సుమా."
ఆ వ్యాఖ్య ఏమిటో, ఎందుకో అర్ధంగాక రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
"హోటలు రేట్లు మొదట పెంచినది ఇతడు కాదనేదొక్కటే నీకు తృప్తి. కాని, ఈ హోటలు వున్న తీరు నీ బుర్రకి తట్టలేదు…."
మరుక్షణంలో సెర్వరు రెండు గ్లాసులలో పొగలు చిమ్ముతున్న ద్రవపదార్ధాన్ని వారిముందు పెట్టేడు. ఒక గ్లాసులోది వొడుపుగా బార ఎత్తునుంచి, ఒక్క చుక్క చిందకుండా, ధారగా చల్లారబోసి రామలింగేశ్వరరావు ముందుంచేడు. తాను బిల్లు వ్రాయడానికి చెవి వెనక నుంచి పెన్సిలు తీస్తున్నాడు.
"పనిలో పని నా కాఫీ కూడా సాగతీసి పెట్టు" అన్నాడు రామారావు గంభీరంగా.
సెర్వరు ముఖాన చిరునవ్వు.
"అవసరం వుండదు. చూసుకోండి."
రెండు గ్లాసులలో వున్న ద్రవ పదార్ధం ఒకే రంగులో వుండడం చూసి, రామలింగేశ్వరరావుకి అనుమానం కలిగింది.
"నా గ్లాసులో పదార్ధం ఏ జాతిదయ్యా."
"తమరడిగిందే తెచ్చా, సార్" అన్నాడు సెర్వర్, అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.
"అతన్నడగాలా….? చప్పరించి చూడు. కిరోసిన్ వాసన వున్న వేడి శబరి నీళ్ళు కాఫీ. వాటికే కించిత్తు తారు వాసనుంటే టీ. అంతేనా?" అన్నాడు రామారావు సెర్వరును ధ్రువపరచమన్నట్లు.
హోటలులో సరుకుల మంచి చెడ్డల బాధ్యత తనదెంత మాత్రమూ కాదన్నట్లు ముఖంపెట్టి సెర్వరు అంతక్రితం కనబడిన చిరునవ్వు చెరిపేసుకొన్నాడు. మాట్లాడకుండా, ఇద్దరి మధ్యా, బల్ల మీద వున్న నీటి మడుగులో బిల్లు అద్ది, వెళ్లిపోయేడు.
అయిదో ప్రకరణం
కౌంటరులో ఉన్న పద్మనాభయ్యకు వారి సంభాషణ వినబడే అవకాశం లేదు. కాని, అతని కళ్ళకి అసాధారణ గ్రహణ శక్తి వుంది. ధుమధుమలాడుతున్న మొహాలతో వేర్వేరు బల్లల వద్ద కూర్చున్న వారందరికీ ఓదార్పుగా "బజారంతా మండిపోతూంది." అని తానే ఏడ్పు మొహం పెట్టేడు.
ఇడ్లీ మీద వూది అది గాలిలో చక్రంలా లేవగలదేమో పరీక్షిస్తున్న యువకుడికది ఓదార్పు.
గారెలోకి సాంబారు కావాలంటే మరో అయిదు పైసలవుతుందంటున్న సెర్వరు కది సమర్ధన.
మినపట్టులోకి కొబ్బరి పచ్చడి తెమ్మంటున్న గ్రామీణుడికి అది అసాధ్యమని చెప్పడం.
కాఫీ, టీలు అసహ్యంగా వున్నాయన్న తమ వ్యాఖ్యకు అది సమాధానంగా తీసుకున్నాడు, రామారావు.
కోపం వచ్చింది. కాని, కోపం వచ్చి ఏం చెయ్యడం? అసలు కోపగించవలసినది ఎవరి మీదనో కూడ అర్ధం కావడం లేదు. దానిని ఎల్లాగ ప్రకటించాలి? అదీ తెలియలేదు కనక వెక్కిరింత, అపహాస్యం ఆసరా చేసుకున్నాడు.
"ఆ మంటలమీద వెచ్చబెట్టేరా ఏం, కాఫీకి పొగ వాసనొచ్చింది?"
ఆ మాటకు హాలంతా తలెత్తి చూసింది. ఎవరో కోపంగా ఖాళీ గ్లాసు చప్పుడయ్యేలాగ బల్ల మీద దప్పున పెట్టేరు.
"ఈ ముండా వేడి నీళ్ళకి ఇరవై పైసలుట"
రామారావు వెక్కిరింతకే మనస్సు లోలోపల కుతకుతలాడుతున్న పద్మనాభయ్య యీమారు ఆగ్ బబూలా అయిపోయేడు. గ్లాసు చేసిన చప్పుడును బట్టి ఆయనెవరో ఆ "ముండా వేడి నీళ్ళ"ని ఖర్చు చేసినట్లే గ్రహించేడు. ఇచ్చింది తాగేసి పైగా వ్యాఖ్యలా? సమాధానం అనేక పాఠాంతరాలలో మనస్సుకు వచ్చింది. ఎదటి మనిషికి సంఘంలో ఉండగల బలం, హోటలులో తన వాళ్ళ వత్తాసుపట్టి ఇదివరలో ఇటువంటి సమయాలలో అనేకమార్లు వుపయోగించినవే. ఒక్కొక్కప్పుడు చెయ్యి చేసుకోడం దాకా వెళ్ళిన ఘట్టాలూ వున్నాయి.
కాని, అతనికిప్పుడా కోపం చూపగల ధైర్యం లేదు. ఏడెనిమిది నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళన కాలంలో జనసమూహం రవీస్ కాలవ ఒడ్డునున్న పోలీసు స్టేషను, ఏలూరు కాలవ లాకుల వద్దనున్న సంజీవరెడ్డి విగ్రహంతో పాటు మూడు నాలుగు హోటళ్ళని కూడా ధ్వంసం చేసిన విషయాన్ని అతడు మరవలేదు.
తినే పదార్ధాల ధరలు పెంచేరనీ, నాణ్యం తగ్గించేరనీ కొన్ని రోజులు గలభా జరిగేక, ఆ రోజున జనం తమ కసి తీర్చుకున్నారు.
తన హోటలుకి ఎదురుగా ఓ నూరు గజాలలో పోలీసులు జనం మీద కాల్పులు జరిపి ఇద్దరిని చంపేసేరు. కొందరికి గాయాలు తగిలేయి. ఆనాడు పోలీసులు పెట్టిన కేసుల్లో కొందరు యీనాటికీ అవస్థలు పడుతున్నారు. ….జనం వెనక్కి తగ్గేరు. కాని, వాళ్ళ గుండెల మంట చల్లారలేదు. పొగలు చిమ్ముతూంది. మొగాలలో ధుమ ధుమ అల్లాగే వుంది.
అందుచేతనే పద్మనాభయ్య తన కోపాన్ని ఏ రూపంలోనూ కనబరచడానికి ధైర్యం చెయ్యలేకపోతున్నాడు. బల్లల వద్ద నడుస్తున్న వ్యాఖ్యలు విన్నప్పుడూ, టిఫిన్ తిని డబ్బులిచ్చేటప్పుడు వారి చూపులు గమనిస్తుంటేనూ అతనికి వెన్నుపూసలోంచి వణుకు పుట్టుకొస్తూంది. 1966 అక్టోబరు 1 వ తేదీని మళ్ళీ చూడాలనే ఉత్సాహం అతనికి ఏ కోశానా లేదు. కనక అంత కోపం చల్లార్చుకొని మాటల ప్రవాహంలో ఆత్మరక్షణకు పూనుకొన్నాడు.
"ఏప్రిల్ నెలలో పంటలు నాలుగు మూలలా అందివచ్చినప్పుడు ఏటికి అవతలా, ఇవతలా గ్రామాలలో అపరాల పంటనంతనూ ప్రాణధారిమల్ కోనేసేడు. క్వింటాలుకి డెబ్భై నుంచి నూట పాతిక వరకూ ధర పెట్టేసేడు. అతడికి కావలసిన పెట్టుబడినంతనూ బేంకులిచ్చేయి. పంటంతా చేతబట్టుకొని నిలవ పోసేక ఇక నా పరుగందుకోండి అన్నాడు. ఒక్క వారంలో కందుల ధర క్వింటాలుకి రెండువందల యాభైకి పెంచేసేడు. ఇదేమి అన్యాయమని అడిగే నాధుడు లేడు. ముండా గవర్నమెంటు."
తానిస్తున్న నీళ్ళ కాఫీకీ, హెచ్చు ధరలకీ, రుచీ పచీ లేని తినుబండారాలకీ, హోటలు అపరిశుభ్రతకీ కీలకం ఎక్కడుందనుకోవాలో పెద్ద గొంతుకతో వినిపించేడు. ఆ సమాచారం తక్షణ ఫలితం ఇచ్చింది. జనం నోరు విడింది.
"వీళ్ళమ్మా! అంతా తోడి దొంగలు."
"లం….జా….కొడుకులు."
ఎన్నికైన పదసాహిత్యం హాలు నలుమూలల నుంచీ వినిపిస్తూంది. ఆ బూతులూ, తిట్లలో తనకూ వాటా వున్నా, పద్మనాభయ్య పట్టించుకోలేదు. తన ప్రయత్నం విజయవంతం అయింది. అంతేచాలు. ఆ ధోరణి వదలకూడదు.
"ఈ మధ్యనే మార్వాడీవాడు కొట్టు కట్టించేడు. దానిలో అన్ని దుకాణాలతోపాటు మంగలి దుకాణం పెట్టిస్తున్నాడు. ఆ దుకాణం తెరవడానికై రావలసిందిగా మొరార్జీ దేశాయిని అడగటానికి ప్రాణధారిమల్ మొన్న ఆదివారం నాడు స్వయంగా డిల్లీ వెళ్ళేడు…."
అటువంటి వార్త అసంభవం కాకపోవడమే, అందరూ దానిని నమ్మడానికి కారణం.
పైగా ఆ మాటల్ని జనం నమ్ముతారా అన్నది ముఖ్యం కానే కాదు. వారి మనస్సులకి ఏదో పని కల్పిస్తూ, మాటలు దొర్లించడం ముఖ్యం. ప్రభుత్వం, బ్యాంకులు, మార్వాడీలు….వాళ్ళు చేస్తున్నదే ఇదంతా. తాను ఆ ప్రవాహంలో ఒక పూచికపుల్ల మాత్రమేనని జనానికి నచ్చచెప్పగలుగుతే మంచిది. అదో అదనపు లాభం.
"దొంగలూ, దొంగలూ వూళ్ళు పంచుకొంటున్నారు."
"గాడిద కొడుకులు."
"తల్లివేపునుంచా, తండ్రివేపునుంచా"—అంటూ ఒకరు తిట్లతో చమత్కారం ఒప్పించడానికి ప్రయత్నించేరు. ఆ మాటకి పద్మనాభయ్య పెద్దగా నవ్వేడు. అతడాశించినట్లు ఎవ్వరూ ఆ నవ్వు నందుకోలేదు.
"వాళ్లకి సిగ్గూ, శరం లేదు. జనం తిడుతున్నారన్న బాధలేదు. ఎవరెన్ని తిడితేనేం? వాళ్ళపని జరిగిపోతూంది. తిట్ల వలన శరీరం మీద గాయాలేం కావు."—అంటూ పద్మనాభయ్య బాధితులలో తానూ ఒకడినన్నట్లు సాయించేడు.
హాలులోంచి ఒకరు అందించేరు.
"రాష్ట్రానికి ఒక నక్సల్‌బరీ అంటుకుంటే తప్ప ఈ రోగానికి మందు లేదు."
చమత్కారాలనుంచి భయానక రసానికి దారితీసిన తన వాగ్ధోరణికి తానే హడలిపోయాడు, పద్మనాభయ్య. చటుక్కున మాటలు నిలిపి గల్లా డ్రాయర్ మూసేసేడు, దాని మీద దాడి జరుగుతుందేమో నన్నట్లు.
ఆ ప్రిస్క్రిప్షన్ వినవచ్చిన వేపు తిరిగి చూసేడు, రామారావు. తాను పనిచేసిన కాలేజీలో చదువుతున్న కుర్రాడే. అతనిపక్క మరో పడుచువాడు. అదీ ఎరిగిన ముఖమే అనిపించింది. కాని, గుర్తు రాలేదు.
"నక్సల్‌బరీలో వుద్యమం ప్రారంభమయ్యాక అక్కడ ఇడ్డెన్లు పెద్దవి చేసి, మంచి కాఫీ ఇస్తున్నారా యేమయ్యా!"—అని రామారావు హాస్యమాడేడు.
బల్లల దగ్గరున్న వాళ్ళు ఫక్కున నవ్వేరు. ఆ యువకుడు తిరగబడి చూసి, తల తిప్పుకొన్నాడు. అతడెవరో తన్ను గుర్తు పట్టేడని రామారావు గ్రహించేడు అతనెవరు?
"నక్సల్‌బరీ ఈ వేళ ఫేషనయిపోయింది" అని రామలింగేశ్వరరావు విచారం వెలిబుచ్చేడు.
జనం దృష్టి తన హోటలు మీదినుంచి మళ్ళిందని పద్మనాభయ్య ప్రాణం కుదుట పడింది. ఇద్దరు విద్యావంతులు తనకు ఆసరాగా వున్నారనే ధీమా ఏర్పడింది. ఆ అవకాశం పోనీదలుచుకోలేదు.
"ఇంతింత కుర్రాళ్ళుకూడా రాజకీయవేత్తలూ, దేశ నాయకులూ అయిపోతున్నారు. అందుకే దేశం ఈకాడికి వచ్చింది. కాకపోతే మన దేశంలో పెద్దవాళ్ళంటే ఎంత భయం, ఎంత భక్తి? మర్యాదా, మప్పితం లేకుండా మసలడం ఎప్పుడేనా ఎరుగుదుమా?"
మాటల ఆవేశంలో పద్మనాభయ్య రేడియో వాల్యూం బాగా పెంచేసేడు. ఎనౌన్సరు మాటలు కొట్టవచ్చినట్లు వినిపించేయి. మధ్యాహ్నం రెండుగంటలవేళ వెంకటేశ్వర స్వామికి ఎవరో మేలుకొలుపులు పాడుతున్నారు.
మేలుకోవయ్య -మ మ్మేలుకోవయ్య.
గూబ మీద కొట్టినట్లయి రామారావు గమ్మున లేచేడు.
"ప్రస్తుతానికి మేలుకొనే వున్నాం. లేచిపోతున్నాం కూడా. కాస్త ఆ గోల ఆపవయ్యా స్వామీ."
ఆ కుర్రవాని మాటను ఎగతాళి చెయ్యడం పద్మనాభయ్యకు అలుసు ఇచ్చిందని మనస్సు కలక వేస్తూంటే ఈ గోల ఒకటి.
"లేస్తావా, రామలింగం! లేక వెంకటేశ్వరుడిలాగా నువ్వూ మొద్దు నిద్దర్లోనే వున్నావా?"
వారిద్దరూ వెళ్ళిపోతే తనకు మాట ఆసరా వుండదన్నంత భయంతో పద్మనాభయ్య అంత వేగంగానూ రేడియో వాల్యూం తగ్గించేసేడు.
"కూర్చోండి. కూర్చోండి. తగ్గుతోనే పెడతా. అసలెందుకులెండి. తీసేస్తా."
పద్మనాభయ్య రేడియో గొంతుక నొక్కేసినా వారు కూర్చోలేదు.
నక్సలైట్ల ప్రసంగం తెచ్చిన కాలేజీ స్టూడెంటూ, అతనితోవున్న యువకుడూ కౌంటరు వద్ద బిల్లు చెల్లిస్తున్నారు.
"నీ పేరు వెంకట్రావు కదూ!"—అడిగేడు రామారావు.
"ఔనండి." అంటూ అతడు సిగ్గుపడి వెనక్కి తగ్గేడు.
"చూడు. నీ నక్సల్‌బరీ వుద్యమం ఏదో ఈ హోటలునుంచే ప్రారంభం చెయ్యకూడదూ. బెజవాడ ఆరోగ్యమేనా బాగుపడుతుంది."
"అబ్బే అదేం లేదండి."
"నీ వెనకాల మేమంతా వుంటాంలే"
ఆ మాటల్లో పద్మనాభయ్యకు పిసరంత కూడా హాస్యం కనబడలేదు. చటుక్కున డ్రాయరు మూసేసి, తాళం కూడా తిప్పేసేడు. మొగాన కత్తివాటు వేసినా, నెత్తురు చుక్క లేదు. పెదవులు అదురుతున్నాయి.
ఆ ముఖం చూసేక రామారావుకి తృప్తి కలిగింది. క్షణం క్రితం వున్న చింత, కలక తీరింది.
వెంకట్రావుతో వున్న మిత్రుడికి ఆ ఎగతాళి నచ్చలేదు.
"అన్‌సంగ్, అన్‌వెప్ట్ జట్టులో పడిపోకుండా మేస్టారికి నీపేరు తెలిసింది. ఇంక ఫర్వాలేదు" అన్నాడు.
ఆ మాట వెనక నున్న పొడుపు అర్థమయి రామారావుకి కోపం వచ్చింది. 'ఇది యు.జి. వెలుగు కాబోలు' ననుకొన్నాడు.
"వెంకట్రావూ! నీపేరు తెలియకుండా రహస్యంగా వుంచుతున్నావనుకోలేదు సుమా. కాలేజీకి వస్తూపోతూ వుంటే మా అందరిలాగే వుంటున్నావనుకొన్నా. అల్లా చెప్పు."
ఆ హేళనకు వెంకట్రావు కంగారుపడ్డాడు. "అదేం లేదండి"
రామారావు మెట్లు దిగుతూ రెండోవాని వేపు చూసి "సెలవు మేస్టారూ!" అన్నాడు.
రోడ్డు మీదికి వచ్చేక రామలింగేశ్వరరావు అడిగేడు.
"ఆ రెండో అతడెవరు, మన కాలేజీ స్టూడెంటేనా?"
"అల్లాంటి అనవసరపు ఆసక్తి చూపవద్దనే అతని సలహా. ఎవరైతేనేం, అంజనా సుతుడు"
వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ కిల్లీలు బిగించి సిగరెట్లు తీసుకొంటున్నారు. నిలుచున్న తీరు చూసేక అతడెవ్వరో చటుక్కున గుర్తువచ్చింది.
ఆరో ప్రకరణం
1966 అక్టోబరు 1 సాయంకాలం నాలుగు-అయిదుగంటల మధ్య.
ఏడెనిమిది నెలల క్రితం—ఇదే రోడ్డుమీద—ఆ ఫోటో స్టూడియో. మేడమీద చూసిన మొహమే.
ఆనాటి ఘటనలన్నీ మెదడులో సుళ్ళు తిరుగుతూంటే రామారావు ఆ యువకుని వేపే చూస్తూ నిలబడిపోయేడు. అతడు ఎందుకు ఆగినదీ అర్థంగాక రామలింగేశ్వరరావు ఆదుర్దా చూపుతున్నాడు.
"రోడ్డు మీద అల్లా నిలబడిపోయాడేమిటి? ఆత్మహత్య చేసుకోవాలనుందా? మనం నడుస్తున్నది బెజవాడ రోడ్డుమీద అని మరిచిపోకు."
రామారావు అతనికే సమాధానం ఇచ్చేలోపునే వెంకట్రావూ, అతని మిత్రుడూ దగ్గరకొచ్చేసేరు.
"నేనెవరో తెలుసుకోవాలని ఇందాకటినుంచి మీరు మహా యిదైపోతున్నారు." అనేశాడు వెంకట్రావు మిత్రుడు.
ఆ మాటలలోని కటుత్వాన్నికూడా అర్థం చేసుకోలేనంత ఆనందం కలిగింది రామారావుకి.
"గాయాలు పూర్తిగా మానిపోయేయా? మేస్టారూ! సంతోషం. గుర్తుపట్టలేదు, మొదట. చాల సంతోషం!"
రామారావు ముఖంలోనూ, మాటలలోనూ కనిపిస్తున్న, వినిపిస్తున్న సంతోషాన్నీ, ఆప్యాయతనూ ఆ యువకుడు లెక్క చేయలేదు.
"ఆ మాటే చెప్దామని వచ్చా. మీరు రివిజనిస్టులయి వుంటారు. లేకపోతే అంత తెలివిగా, మాకుపకారం చేస్తున్నట్లు నటిస్తూ, పోలీసాళ్ళకి వప్పచెప్పడం మరొకరివల్ల జరగదు."
గూబకు బెత్తెడు చూసి కొట్టినట్లయింది. రామారావు ఆ ఆరోపణకు దిగ్భ్రమ చెందేడు.
ఆ రోజున—,
ఏలూరురోడ్డే వస్తున్న రామారావుని సందుమూలలో వున్న పోలీసులు రైఫిళ్ళు చూపి నిలవబెట్టేసేరు. ముందుకు పోనివ్వమన్నారు. ఏం చెయ్యడానికీ తోచక అతడు ఎదురుగా తెరిచివున్న ఓ ద్వారంలో చొరబడ్డాడు. అది మెట్లగది. పైకి వెళ్ళేడు. అక్కడ తుపాకీ రవ్వలు తగిలి రక్తం కారుతున్న ముగ్గురు యువకులకు నలుగురైదుగురు మిత్రులు ఉపచారాలు చేస్తున్నారు.
ఆ గాయాలు సెప్టిక్ అయి కుర్రవాళ్ళు నిష్కారణంగా చచ్చిపోతారని, వారిని తాను హాస్పిటలుకు చేర్చేడు. చేర్చేందుకు ఎంత గొడవయింది. అడుగడుగునా పోలీసుల అదలింపు. రైఫిళ్ళు చూపి బెదిరింపు. కాని డబాయించి, దెబ్బలాడి వారిని హాస్పిటలుకి చేర్చేడు.
"మీ మాటలకి మోసపోయి వాళ్ళిద్దరూ హాస్పిటలు బెడ్ ఎక్కేరు. నాకు మొదటినుంచీ అనుమానమే. మొదట మీ మీద కాదులెండి, హాస్పిటలులో ఇచ్చే సహాయంమీద అపనమ్మకం. అయితే ఆ అపనమ్మకమే నన్ను 'సేవ్' చేసింది…." అంటున్నాడు ఆ యువకుడు….
తరవాత రెండుమూడు నెలలకి విశాలాంధ్ర షోరూమ్‌లో తనకు బాగా పరిచితుడైన ఒక కమ్యూనిస్టు నాయకుడు కనిపించి ఆ రోజున తన తమ్ముడిని హాస్పిటలులో చేర్పించి వుండకపోతే ఇప్పుడు నడుస్తున్న కేసుల బెడద వుండేది కాదన్నాడు. ఆ విషయాన్నే ఈ యువకుడు మరో మాటలలో చెప్తున్నాడు.
"జనాన్ని కాల్చి చంపుతున్న పోలీసులు మిమ్మల్ని మేం వున్న మేడ దాకా ఎందుకు రానిచ్చేరు? అక్కడ ఎవరో వున్నారని మీకు ఎల్లా తెలిసింది? మీకు వాళ్ళతో లాలూచీవుంది, కనక వదిలేరు. మొదట తోచలేదు గాని మీరు కిందికెళ్ళి రిక్షాకూడా ఎల్లా తేగలిగేరు? వాళ్ళతో షరీకయ్యేరు గనకనే సాధ్యమయింది."
ఇన్నాళ్ళకు ఓ ప్రజాద్రోహిని నడివీధిలో పట్టుకొని కడిగేసే అవకాశం దొరికిందని ఆ యువకుడు ఊగిపోతున్నాడు.
ఆ అన్యాయారోపణకు దిగ్భ్రమ చెంది, ఆందోళనలో ఆరిపోయిన పెదవులు నాలికతో తడుపుకున్నాడు, రామారావు. అంతవరకూ సాగించినట్లు వెక్కిరింతలూ, వేళాకోళాలా మాటున తన అసమ్మతిని ప్రకటించడం మంచిది కాదు. సరాసరి సమాధానం చెప్పుకోవాలి.
"అన్యాయం, మిస్టర్! సబినస్పెక్టరుతో ఎంతో ఘర్షణపడి, గాయపడ్డ వాళ్ళని హాస్పిటలుకు తీసుకెళ్ళడానికి ఒప్పించగలిగా."
"ఎక్జాట్లీ, ఆ సబినస్పెక్టరుది మట్టిబుర్ర. వాడే కాదు. రవీస్ కాలవ వంతెన మొగలో తాలూకాఫీసు మూలలో, ఏలూరు కాలవ లాకు మొగ వద్ద పోలీసువాళ్ళు మిమ్మల్ని ఆపేరు. మీరు అదే సమాధానం ఇచ్చేరు. మేం విన్నాం. ఆ మాటలోనే అసలు 'క్లూ' వుంది—యిందాకా మీరు కాల్పులు కాల్చినపుడు గాయపడ్డారురా గాడిదలూ! అంటే—ఆ ఘర్షణలలో ముందు పేటీన వున్న వాళ్ళు అర్థం చేసుకోరేం—అని చెప్పినట్లే. ఆ రోజున మాకు అర్థం కాలేదు. మొదట పోలీసు వాళ్ళూ తెలియకనే అడ్డం పెట్టేరు. మీ మాట విని తెలివి తెచ్చుకున్నారు. మా వాళ్ళో, కేసుల్లో పడేవరకూ తెలుసుకోలేదు."
రామారావుకి సహనం పోయింది. చర్రుమన్నాడు.
"అర్థం చేసుకోడానికి మెదడు సరియైన స్థితిలో ఉండాలి. మీలో లోపం అదేనని తోస్తూంది."
—అంటూ రామారావు గిరుక్కున తిరిగేడు. ఆ యువకుడు ఫక్కున నవ్వాడు.
"మీ ఫ్రెండ్స్‌కి కాస్త కబురందించరాదూ. ఫలానా వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఆ రోజున హాస్పటల్‌లో చేరకుండా తప్పించుకు పోయేడు…."
రామారావు టక్కున వెనక్కి తిరిగి ఆ యువకుడికి సమీపంగా వచ్చేడు. పళ్ళు కొరుకుతూ, మాటల్లో అసహ్యం ఉమిసేడు.
"ఇల్లాంటి పనికిమాలిన ప్రజ్ఞలకు, దురహంభావానికీ మూలం అర్థం అయింది….నీకు కాదులే, నాకు. నీకు చచ్చినా అర్థం కాదు, నాకు తెలిసింది. యిందాకా హోటలులో నీ నోటి దురద విన్నా, అదో ఫేషనయి పోయిందన్నాడు మా ఫ్రండు. కాదు, చేతకాని దురహంభావం నీ చేత అల్లా అనిపించింది. నీ రాజకీయాలు అంతే. లేకపోతే మనిషిలో యింత "కార్యకారణ వివేచన శక్తి" ఏర్పడదు. ఫస్టుగా ఉంది. పోనీ బండి. యిందాకా హోటలు కౌంటరు వద్ద వెంకట్రావు నూరడించేవు. కాని, ఆ వూరడింపు నీకే."
రామారావు విసురు చూసి వెనుకంజ వేసిన మిత్రుణ్ణి వెంకట్రావు వెనక్కి లాక్కుపోయేడు.
"నీ విసురు చూస్తే దవడలు వాయించేస్తావని కంగారు పడ్డా"నని రామలింగేశ్వరరావు మిత్రుని చేయి పట్టుకొని తీసుకుపోయేడు.
రామారావు నెమ్మదిగా చేయి విడిపించుకొన్నాడు. "నడు పోదాం"
యిద్దరూ నడుస్తున్నారు.
"ఎవరతడు?"
"యిందాకా గుర్తురాలేదు. ఉక్కు వుద్యమం సందర్భంగా ఈ వూళ్ళో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళలో ఒకడు. ఆ రోజున ఇతడినీ, మరో యిద్దరినీ నేను హాస్పటలుకు చేర్చా. ఆ జన సమ్మర్దంలో యితడు తప్పిపోయేడు. మిగిలిన యిద్దరినీ మాత్రం చేర్చేను. యితడూ చేరే వుంటాడులే అనుకున్నా. చేరలేదన్న మాట. అప్పటికి యిప్పుడే చూడడం. పోలీసాళ్ళకి వప్పచెప్పడానికే హాస్పిటలులో చేర్చానంటాడు. వాలకం చూస్తే రాజకీయ అతివాదం మాటున మతిభ్రష్టుతనాన్ని కమ్ముకుంటూన్న నోటి దురదగాడల్లే వున్నాడు. తనమీద కాల్పులు కాల్చిన వాళ్ళ మీదకన్న గాయాలకు కట్టు కట్టించబోయినవాని మీద కసి చూపడం మరో మనిషి చెయ్యడు"
రామలింగేశ్వరరావు నవ్వేడు.
"మంచి అనుశీలన, పరిశీలన గలవాడు. లేకపోతే నీ రాజకీయాలు అంత నిశితంగా పట్టెయ్యలేడు."
మిత్రుని మాటలు వినిపించుకొనే స్థితిలో లేడు, రామారావు. ఈ ఘటన అతని మనస్సును కలచివేసింది. ఏదో ఆలోచిస్తూ, నడుస్తూన్నాడు.
"అరకొరగా చేస్తే మంచిపని అయినా మంచి ఫలితం యివ్వదు. గాయాలతో చచ్చిపోతారని హాస్పిటలులో చేర్చా, మంచిదే. కాని, అవకాశం తీసుకొని పోలీసువాళ్ళు వాళ్ళని కేసుల్లో దూర్చేరు. తప్పు నాదేనా? కాదా? నేనేం చేసి వుండాలి?—ఎప్పుడూ ఆలోచించనేలేదు."
ఆ ఆలోచనను రామలింగేశ్వరరావు అంగీకరించలేదు.
"మనుష్యులు బాధలో వున్నారని చెయ్యగల సాయం చేసేవు. వుద్యోగం మానుకొని హాస్పటళ్ళ వెంటా, తరవాత కోర్టుల వెంటా కూడా తిరగాలా? అదే అయితే మీ చావు మీరు చావండని వూరుకోడం నయం అంటాను…."
రామారావు ఆ వాదాన్ని ఒప్పుకోలేదు.
"మనం వాళ్ళ వెంట హాస్పిటళ్ళకు తిరిగేమా? కోర్టుల వెంట తిరిగేమా అన్నమాట వాళ్ళకీ అంత ముఖ్యం కాదు. తమర్ని విడిచి పెట్టలేదనే ధైర్యం, తమరిని బలపరిచే వాళ్ళు కొందరున్నారనే సంతృప్తీ కావాలి. ఆ భాగం నా వలన సమకూడలేదు. హాస్పిటలులో చేర్చేక మరి నేనటు తొంగికూడా చూడలేదు, నా పని తీరిందనుకున్నా. కాని, ఆ అరకొర పని నా రాజకీయాల్ని కూడా అవమానం పాల్చేస్తూంది…."
రామలింగేశ్వరరావు తన ప్రశ్నకి సమాధానం రాలేదన్నాడు.
"వుద్యోగం మానుకుని నువ్వు వాళ్ళ మంచాల వద్దా, కటకటాల యివతలా పరిచర్యలు చెయ్యవలసిందేనా?"
రామారావు ఆలోచిస్తున్నాడు.
"చెప్పవేం?"
"దారిపొడుగునా పోలీసులతో పేచీ పెట్టుకుంటూనే హాస్పిటలుకు తీసుకెళ్ళేనా లేదా…."
"అయితే…."
"అల్లాగే…."
"కోర్టు కేసుల్లో కూడానా?"
"కేసు అన్యాయమైనదవునా కాదా. దానిమీద జనాన్ని కూడగట్టడం, గొడవ చెయ్యడం అవసరమే. మనం వున్న వ్యవస్థలో ఏమరుపాటు పనికిరాదని దాని అర్థం."
రామలింగేశ్వరరావు నిస్పృహతో ఒక్క దండం పెట్టేడు.
"నీ రాజకీయాలు తగలడ్డట్టే వున్నాయి. వీధేపోయే పెద్దమ్మా మా యింటి దాకా వచ్చివెళ్ళమన్నట్లు లేనిపోని తద్దినాలు తెచ్చుకోక తప్పదనేటట్లయితే పరోపకారం ఏటిలో కలవనీ. ఈ ప్రజాసేవ చెయ్యకపోతే కొంప మునిగిపోదు."
ఏడో ప్రకరణం
ఇంటికి వచ్చేసరికి వీధి అంతా పిల్లలతో నిండి గోలగా ఉంది.
డ్రైనేజీ గొట్టాలు వేయడానికై తవ్విన కందకాల మీద కుర్రవాళ్ళు 'లాంగ్ జంప్' ప్రాక్టీసు చేస్తున్నారు. అంతా పది పన్నెండేళ్ళలోపు వాళ్ళు. రెండు నిలువుల లోతున్నట్లున్న ఆ గోతులలో పడిపోరు కదా—అనిపించింది.
కాని, వాళ్ళకా భయం వున్నట్లే లేదు. పెద్దవాళ్ళు భయపెట్టకుండా వొదిలేసేరనుకోలేము. కాని, కుర్రవాళ్ళకి ఆడుకొనేందుకు స్థలాలు కావాలి. అవే లేవు. పట్టణం పెరిగిపోతూంది. దానికో క్రమం లేదు. అందుకు ప్రయత్నమూ లేదు. నడిరోడ్లు జనతా పాకీ దొడ్లు. వీధులు ఆది వరాహ విహార భూములు. మునిసిపల్ ఆఫీసులు లంచగొండితనం నేర్పే కళాశాలలు. పాఠశాలలు అసమర్థ పరిపాలనకు సాక్షీభూతాలు.
ఇంక కుర్రవాళ్ళ ఆట స్థలాల సంగతి ఎవరికి పట్టింది? వాళ్ళదారి వాళ్ళు చూసుకొంటున్నారు. ఉన్నంతలోనే కొంచెం వినోదం, కాస్త వ్యాయామం కల్పించుకొంటున్నారు.
వాళ్ళ వుల్లాసం, వాళ్ళ గంతులు, కవ్వింపులు, కీచులాటలు చూస్తూనే రామారావు తన కోపం మరచిపోయేడు. తన మానసిక వ్యధ మరచేడు. ఒక్క నిముషం నిలబడి వాళ్ళ ఆటలు చూసేడు. వాళ్ళకి ఒకటి రెండు సలహాలు ఇచ్చేడు. కాని, వాళ్ళు వినిపించుకోలేదు. నవ్వొచ్చింది.
ఓ కుర్రవానిని పిలిచేడు.
ఆ పిలుపు విని ఇంటి ప్రధానద్వారం తెరుచుకొని ఒక తరుణి తొంగి చూసింది.
"పిలిచేరా"
"లేదండి."
ఆమె లోపలికి వెళ్ళిపోలేదు. పిల్లల ఆటలు చూస్తూ ఆమె కూడా అక్కడే నిలబడింది.
"ఓరి, మీ కడుపు ఉడక! పడ్డారంటే కుంటివాళ్ళయిపోతారర్రా!" అంటూ నవ్వింది. వెంటనే ఓ కుర్రవాడు కుంటి నడకను అభినయించేడు. నలుగురు కుర్రవాళ్ళూ గొల్లున నవ్వేరు.
మరల కందకం మీదుగా దాటడం ప్రారంభమయింది. రామారావు ఓ కుర్రవానిని పిలిచేడు. గంతేముందు ఊతం కోసం పరుగు తీసే ప్రయత్నంలో వున్నాడు వాడు. పిలుపు విని నిలబడ్డాడు.
"ఎందుకండి!"
"నీ పేరేమిటోయ్,"
వాడు చెప్పేలోపున వెనకనుంచి వేరొకడు అందించేడు,
"బాబండి"
"అది సరిలే. కృష్ణాజిల్లాలో మగపిల్లవాడిని బాబు అనడం, ఆడపిల్లను బేబీ అనడం ఓ ఫేషను. అసలు పేరు ఏమిటని?"
మరో కుర్రాడు వచ్చి నిలబడ్డాడు. వానికి ఈ ఆరా అంతా ఎందుకో తెలుసుకోవడం అవసరంలా తోచింది.
"ఎందుకేమిటండి?"
"అబ్బే మరేంలేదు. మీరెవరన్నా జారి పడిపోయి కాలు విరుచుకుంటారనుకోండి. హాస్పిటలుకి తీసుకెళ్ళాలి కదా. పాపం, ఎవరి కాలు అనుకొని కట్టుకట్టాలి వాళ్ళు. వాళ్ళకి ఏం పేరంటే, ఏమని చెప్పాలి అని." అన్నాడు, రామారావు గంభీరంగా.
గుమ్మంలో నిలబడ్డ సుశీల ముఖాన చిరునవ్వు కనపడింది.
"ఓస్. అదా." అని కుర్రాడు వెనుతిరిగేడు.
మొదటి కుర్రవాడు తనపేరు 'సుబ్బారావు' అని చెప్పుకున్నాడు. మరుక్షణంలో "హూప్" అని కందకం అవతలికి గెంతేడు.
ఇంక వరసన పేరు చెప్పడం, గెంతడం ప్రారంభమయింది.
"రంగనాధం—హూప్"
"జయరాం—హూప్"
"సారథి—హూప్"
గుమ్మం లో ఉన్న సుశీల ఫక్కున నవ్వింది. ఆమెను చూసి రామారావూ నవ్వేసేడు.
"వాళ్లెవళ్ళూ మన మాట వినిపించుకొనే ధోరణిలో లేరు."
వాళ్ళని హాస్యం చేయబోయి, తానే హాస్యం పాలయినందుకు అతనికి కోపం రాలేదు. తలనెప్పీ, చిరాకూ అనిపించలేదు.
"నెల్లాళ్ళ క్రితం ఆ పై వీధిలో ఓ కుర్రాడు…." అంటూ ఆ ఘటన గుర్తు వచ్చి సుశీల వణికిపోయింది.
వర్షాలు పడి డ్రైనేజీ కందకాలు నిండేయి. పది పన్నెండేళ్ళ వాడు గట్టుమీద నడుస్తూ కాలుజారి కందకం లో పడిపోయేడు. మర్నాడు మోటారు తెచ్చి నీరు తోడించేశాక గాని, అంచులు జారిపడిన మన్నులో కూరుకుపోయిన ఆ కుర్రవాని శవం దొరకలేదు.
ఆ మాట గుర్తు వచ్చి సుశీల ముఖం వివర్ణం అయింది.
"ఈ వీధులు ఎప్పుడు బాగుపడతాయో గాని, పిల్లలిద్దరూ ఇంట్లోకి వచ్చి కనబడేవరకూ ప్రాణాలు ఇల్లా ఉంటున్నాయి." అంది, గుప్పిడి మూసి తెరుస్తూ.
రామారావు మాట తప్పిస్తూ….
"మీరు అప్పుడే వచ్చేశారే." అన్నాడు.
"శనివారం కదూ, బాంకు పని ఒంటిగంటకే అయిపోతుంది."
"మీ పనే బాగుందండీ."
కాని, సుశీలకి కాలేజీ ఉద్యోగాల మీద మోజు.
"మీ కంటేనా? వర్షాకాలం, వేసంకాలం, శీతాకాలం పేరుతో మూడు నెలలు సెలవులు. మిగిలిన వాళ్ళతో పాటు పండుగలూ, పబ్బాలూ వుంటాయి." అందామె టీచర్లకు దొరికే సెలవులు తలుచుకొని లొట్టలు వేస్తూ.
రామారావులో ఆ వుత్సాహం కనబడలేదు. కాని ఒప్పుకొన్నాడు. "నిజమేలెండి."
ఎనిమిదో ప్రకరణం
"ఏమిటి, తలుపులన్నీ బిగించుకు పడుకున్నాడు?" అంటూ నారాయణ గది గుమ్మంలో నిలబడి ప్రశ్నిస్తూంటే, రామారావు లేచి కూర్చుని, ఆహ్వానించేడు—"రాండి".
"ఒంట్లో బాగాలేదేమో, ఇందాక కూడా ఎల్లాగోనే కనిపించేడు." అంది, సుశీల వెనకనుంచి.
"విశేషం ఏం లేదండీ. కొంచెం తల నొప్పిగా వుంటే పడుకున్నా. దానికి తోడు ఈ కుర్రాళ్ళ గోల ఒకటి".
"వెళ్ళిపోయారు లేండి. తలుపులు తియ్యండి. కాస్త గాలేనా వస్తుంది"—అంటూ సుశీల లోపలికి అడుగుపెట్టి కిటికీ తలుపులు బారుగా తెరిచింది.
"ఏం జ్వరం ఏమన్నా ఉందా? చూసుకొన్నావా?"
"వుండండి. వేడి వేడి కాఫీ పడితే అన్నీ సర్దుకొంటాయి. ఎండలో వచ్చేరు కదూ. అందుకు వచ్చి ఉంటుంది తలనొప్పి."
రామారావు వద్దంటున్నా వినిపించుకోకుండా సుశీల తమ వాటా లోకి వెళ్ళిపోయింది.
"అనవసర శ్రమ" అన్నా ఆమె వినిపించుకోలేదు.
"కాఫీ తాగడం శ్రమా?" అని నారాయణ హాస్యమాడేడు.
"వచ్చేటప్పుడు బజారులో తాగి వచ్చేనండీ."
"బజారులో తాగితే? ఇప్పుడింటివద్ద తాగు. యిదిగో యిప్పుడు నువ్వు మొహమాటపడితే నీతో పాటు నన్నూ ఎండగడతావు. మాట్లాడకు"
యింక రామరావేం మాట్లాడలేదు. మాట మార్చేడు.
"ఎటూకాని వేళ మీరు యింట్లో ఉన్నారు, ఏమిటి విశేషం?"
"పాల సప్లయిదార్లకీ, హోటళ్ళ వాళ్ళకీ ఖరీదుమీద పేచీలు వచ్చేయి."
"ఎందుకు?"
"కోవా సరిగ్గా రావడం లేదని మా డబ్బులు కోసేస్తున్నారు. తాము మాత్రం సరుకుల ధరలన్నీ పెంచేశారు. మా ధరా పెంచమన్నాం."
ఆ ధరల వివరాలేమీ తెలియని రామారావు ప్రశ్నలు ప్రారంభించేడు.
"యింతవరకేం యిస్తున్నారు? మీరేం అడుగుతున్నారు?"
"ఇప్పటి వరకు లీటరుకి 80 పైసలే."
"అబ్బ! అంత తక్కువా?"
"హెచ్చు మొత్తం తీసుకొంటారు. వాళ్ళే పెట్టుబడులూ పెడతారు."
"ఓహో"
"అయినా, అది చాల తక్కువ. మేము 83 పైసలు అడుగుతున్నాం."
ప్లేటులో రెండు కప్పుల నిండా పొగలు చిమ్ముతున్న కాఫీ పట్టుకొని, సుశీల వచ్చింది. వస్తూనే—
"రేపటి నుంచి వీరు మనకి పాలు లేకుండా చెయ్యబోతున్నారు." అంది.
"అదేమిటి?"
"టవునికి పాల సప్లయి బందు చెయ్యాలంటూ మనింట్లో మాత్రం రెండు శేర్లు పొయ్యమంటావు. ఆ పని చేస్తే మరి మన్ని చూసేక ఎవ్వడూ కింద వుమ్మెయ్యడు."—అన్నాడు నారాయణ భార్య వేపు కొరకొరా చూస్తూ.
"నేననేదది కాదు. మీరు వూళ్ళోవాళ్ళకి ఎందుకు మానాలి? మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న పన్నెండు పైసలు ఎక్కువిస్తున్నారే."
రామారావు ఆశ్చర్యం కనబరిచేడు.
"సమ్మె అంటే అందరికీ సమ్మే. పంక్తితో బాలభిక్షం ఉండదు."—అని నారాయణ ముదలకించాడు.
సుశీల పేచీ ఏమిటో రామారావుకి చెప్పింది.
"హోటలు వాళ్ళు 80 పైసలు బదులు 83 పైసలు యివ్వమన్నారు గనక యిప్పుడే లీటరుకు 95 పైసలు యిస్తున్న మన మీద సమ్మె ప్రకటిస్తున్నారు." అంది సుశీల, మగడిని కవ్విస్తూ.
"బహుశా మనల్ని తగ్గించి యివ్వమంటున్నారేమో, దానికైతే సమ్మె అనవసరం స్వామీ." అంటూ రామారావు సుశీలను బలపరిచేడు.
నారాయణకి ఏం చెప్పడానికీ తోచలేదు. డబాయింపు ప్రారంభించేడు.
"సమ్మెలు అన్నవి ఒక పెద్ద పోరాటానికి తయ్యారీ తినిపించడం వంటివి. సమష్టిగా పోరాటం జరపడంలో ప్రజలకి శిక్షణ యివ్వడం అన్నమాట. దానిని అల్లాటప్పా వ్యవహారంగా చూడగూడదు." అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ, నారాయణ.
"యిప్పుడిస్తున్నట్లు లీటరుకి 95 పైసలు గాక రూపాయి యిమ్మన్నా జనం ఇస్తారు. మంచి పాలు పోస్తామని తీసుకుంటున్నారు కూడా. మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న ఎక్కువే యిస్తున్నారు కదా"—సుశీల అంది.
"అవును కదా"—అన్నాడు రామారావు.
"ఒకవేళ హోటలు వాళ్ళతో సమ్మె తప్పనిసరి అయితే జనాన్ని మీకు తోడు తెచ్చుకోవాలి. కొన్ని నష్టాలకి సిద్థపడయినా చెయ్యవలసిన పని అది. యిక్కడ ఆ సమస్యా లేదే. అకారణంగా, అన్యాయంగా జనానికి యిబ్బంది కలిగించి వాళ్ళని వ్యతిరేకం చేసుకోడం—యిదేమి పద్ధతి"—అని సుశీల మగణ్ణి నిలదీసింది.
"ఔను కదా." అన్నాడు రామారావు.
"అదీగాక, వూరి జనం ఎన్నడూ లీటరు పాలకి 20 తులాల కోవా వస్తూందా లేదా అని చూసుకోడం నే వినలేదు. మీరు కేవలం కుళాయి నీళ్ళే ఇస్తే తప్ప ఇదేమిటనేనా అడగరు కదా." అన్నాడు.
"ఆ నపుంసకపు జడ్డితనాన్ని, మేకల్లా, కోళ్ళల్లా గొంతు కోసేస్తున్నా నోరు మూసుకు కూర్చోడాన్ని జనానికి వంటబట్టించేశారు. అల్లాంటి దుస్థితి నుంచి జనాన్ని బయట పడెయ్యడం మా పని అనుకోలేదు. కాని, ఇప్పుడు నీ మాట విన్నాక మా సమ్మెకి వున్నసామాజిక ప్రాముఖ్యం అర్థం అవుతూంది. ఇది మూడు పైసల పేచీ కాదు. అంత కన్న పెద్ద విలువవున్నదేనన్నమాట. థాంక్స్. ఇంత మంచి, గొప్ప అంశాన్ని తోపింప చేసినందుకు రొంబ థాంక్స్."—అంటూ వెక్కిరింతగా, నారాయణ మూతి బిగించేడు.
"మీరు కోరినా, కోరకపోయినా మీ కోరిక ఫలిస్తుంది. అయితే మీరనుకున్నట్లు కాదు. ఈ సమ్మె ముగిసేసరికి సగం ఇళ్ళకి మీరు పాలు పోసే పని వుండదు." అంది సుశీల.
"పాలు, మజ్జిగా మానేస్తారా?"
"మానరు. గవర్నమెంటు పాల బూత్స్ మీద పడతారు. వెన్న తీసేస్తారనీ, పాలపొడి పాలు ఇస్తారనీ, కాచి చల్లార్చడం వలన పాల రుచి పోతుందనీ, జబ్బులు చేస్తాయనీ మీ వాళ్ళింతవరకు తెగ బోధిస్తున్నారు, బెదరకొడుతున్నారు. ప్రజలు కొత్తదంటే చూపే భయంతో, బూత్ దగ్గరి కెళ్ళడం క్యూలో నిల్చోడం అంటే వున్న నామోషీతో, ఇంకా ఎన్నో కారణాలు—ఆ పాలో, పాపాలో మీ వద్దే కొనుక్కుంటున్నారు. యింక ఆ జడ్డితనం వదిలిపోతుంది. " అంది సుశీల, వెక్కిరింతగా.
"పెట్టీ బూర్జువా మనస్తత్వం మీ సమ్మెతో చప్పగా వదిలిపోతుంది. " అన్నాడు రామారావు.
"రివిజనిస్టుల విశాలాంధ్రలో వాడు చెప్పినట్లే చెప్పేవు."—అన్నాడు నారాయణ, వెలపరం కనబరుస్తూ.
"అంటే మీ మిత్రులలో కొందరికింకా మెదడు పని చేస్తూందన్నమాట." అంది సుశీల.
"పని చేసేలా చేసేను. ఓ శకున పక్షి గాడు, పరమ అభాజనుడు నీలాగే మొదలు పెట్టేడు. ఎంత దెబ్బలాడవలసి వచ్చింది?"
రామారావు నవ్వేడు.
"వాళ్ళ నోరు నోక్కేసేరన్నమాట."
"అయితే అసలు జడ్డితనం వదలవలసినది వాళ్ళకి. తప్పని ఎరిగీ, మీ నోటికి జడిసి." "….అదయి వుండదు. మీరు చేసేది తప్పని చెప్పేరు. మీరు పోరు పెట్టుకొన్నారు. సరే మనదేం పోయింది. మంచో చెడ్డో మీరు గోతులో దిగుతామంటే పేపర్లో వెయ్యక తప్పదు కదా, వేసుంటారు." అని పూర్తి చేసింది.
పెళ్ళాం మాటలు వినేసరికి నారాయణ కోపం పట్టలేకపోయేడు.
"ఏడిశావు పోదూ, నీ బతుక్కి రాజకీయాలు అర్ధం అవుతాయా, ఏడుస్తాయా? అల్లా బాంకులో అంకెలు కూడుకుంటూ…."
తెగేదాకా లాగకూడదని ఎరిగిన సుశీల వెనక తగ్గింది. ఏదో పని కల్పించుకొనేందుకు వెళ్ళి, ఇంకా మూసే ఉన్న రెండో కిటికీ తెరిచింది.
"ఫాను వేసుకొంటే మాత్రం మూసిపెట్టిన గదిలో గాలి ఆడుతుందా?" అంటూ మాట మార్చింది.
"బెజవాడ వీధులకీ, పరిశుభ్రతకీ చుక్కెదురు." అని రామారావు ఆమె ప్రయత్నానికి సాయపడ్డాడు.
"నిజమే అనుకోండి."
"ఆ మంచం కిటికీ దగ్గిరికి లాక్కో. గాలేనా వస్తుంది." అని నారాయణ సలహా ఇచ్చేడు.
"ఇవన్నీ ఎందుగ్గాని, ఆ కుర్చీలు అల్లా లాక్కోండి. కాస్సేపు మీరిద్దరూ కూర్చుని కబుర్లు చెప్తూంటే తలనొప్పి అదే తగ్గిపోతుంది."
"తలనొప్పి తగ్గించే మాటలు ఒక్కరికే సాధ్యం. ఆ అవకాశం కాస్తా మీరే పాడు చేసుకొన్నారు."—అంది సుశీల.
"మీ అందరి మాటా వినివుంటే నా తలనొప్పి ఆవిడకీ, ఆమెనుంచి మీ అందరికీ కూడా చుట్టుకొనేది. నేను వినిపించుకోలేదో, మీరంతా సుఖపడ్డారో…." అన్నాడు, రామారావు గంభీరంగా.
"మేమందరం అదనపు తలనొప్పి తెచ్చుకుని, అయ్యో కుయ్యో అంటున్నాం. పెళ్లి చేసుకోలేదో, బతికేవో " అన్నాడు నారాయణ.
"మీకేమండీ అదృష్టవంతులు. నెలకు నాలుగైదు వందలు తెచ్చే భార్య ఇంట్లో వున్నారు. ఎన్నేనా కబుర్లు చెప్తారు."
"అడుగడుగునా ఎన్ని గండాలు! ఎవరికి వాళ్ళే పక్కవాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టాలని చూసేవాళ్ళే. కేంద్ర మంత్రి నుంచి మా ఏజంటు దాకా, ఈ నాలుగు వందలలో ఎంత చొర్రి పెట్టగలమని చూసేవాళ్ళే."—
"వెధవముండకి నమస్కరిస్తే నన్ను పోలి బతకమందిట." నారాయణకేసి అంతా గుప్పించేరు.
"దేశం, ప్రజలూ ఏమయిపోయినా సరే పార్టీలు ముఖ్యం అనుకొనే నాయకత్వం వున్నంతకాలం మనం ఎవరికి నమస్కరించబోయినా వెధవముండలే అయి కూర్చుంటారు."—అంది సుశీల విసురుగా.
ఆ మాట విసురు తన మీద వేసుకుంటూ రామారావు ఆ భార్యా భర్తలమధ్య దుమారం రేగకుండా సర్దేశాడు.
"చంపేశారు, నోరు నోక్కేసేరు."
సుశీల సర్దుకుని మాట మార్చింది.
"తిరపతమ్మ గారు ఏమన్నా వ్రాసారా? ఎప్పుడొస్తారు?"
రామారావు తల్లి తిరపతమ్మ. ఆమె కూతురు కొత్త కాపురంలో సాయం చెయ్యటానికి వెళ్ళింది.
"నా స్థితి ఏదో తేలేవరకూ ఆమె రాకపోవడమే మంచిది. అక్కడుండడమే సుఖం."
"మీరేం తిన్నారో, ఏలా వున్నారో ననుకుంటూ తిన్నన్నం వంట బట్టకపోవడం సుఖమా?"—అంది సుశీల.
"తేలడానికేముంది?"—అన్నాడు నారాయణ. "పెళ్ళి వాయిదా వేసుకోనే వేసుకున్నావు. పుష్కరాలు వచ్చేశాయి. ఈ ఏడాది గోదావరి పుష్కరాలు. వచ్చే ఏడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళకు పనికిరాదు. ఇహ తేలడానికేముంది?"
"మీకు తెలియదులా వుంది. నా వుద్యోగం వైభోగం ఈ పూటతో ముగిసింది."
అదేదో అతి సామాన్య విషయం అయినట్లు చెప్పబోయినా అతని కంఠం పట్టేసింది.
దంపతులిద్దరూ ఉలిక్కిపడ్డారు.
"అయ్యో!" అంది సుశీల.
"రెట్రెంచిమెంటా." అన్నాడు నారాయణ.
రామారావు నిశ్శబ్దంగా తల ఆడించేడు.
"వూరుకోవద్దు." నారాయణ సలహా.
"ఉహు." అన్నాడే గాని, వూరుకోకపోవడం ఏమిటో రామారావుకు తెలీలేదు.
"మీ ఒక్కరికేనా?"
"మా కాలేజీలో ముగ్గురం. నాతో వస్తుంటాడు రామలింగేశ్వర్రావని, ఆయన…."
"ఆయనకూనా?" సుశీల ఆశ్చర్యం.
"ఆహా."
"వాళ్ళు పొమ్మంటే లేచి వచ్చేసేరా?" అంటూ నారాయణ ఆశ్చర్యం ప్రకటించేడు.
"ఏం చేయమంటారు?" అని సుశీల ఆశ్చర్యంగా మగని ముఖం వంక చూసింది.
"ఆ ప్రిన్సిపాల్‌ని నాలుగు తన్నాలి, ఏం చెయ్యడం ఏమిటి? జాతి నిర్వీర్యం అయిపోయింది. మిలిటెన్సీ చచ్చిపోయింది. ఏం చేస్తారుట!"
మగనికి మతి వుండే మాట్లాడుతున్నాడా అన్నట్లు సుశీల తెల్లబోయింది. నారాయణ సాగించేడు.
"మనుష్యుల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క క్షణం పరాగ్గా వుంటే కాలి కింద గోతులు తవ్వుతున్నారు. వద్దు. వూరుకోవద్దు. మనం బతికే వున్నామని చూపాలి. చూపడానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఉహు. ఊరుకోవద్దు."
"నిజమేనండి. ఊరుకోకూడదు. కాని, ప్రిన్సిపాల్‌ని తన్నితే పని జరుగుతుందా?"—అంటూ సుశీల సందేహం కనబరచింది.
"మరొకరిని తన్నితే మాత్రం?" అన్నాడు రామారావు.
కాని నారాయణ ఒప్పుకోలేదు.
"రొట్టెకి రేవేమిటి? ఎవరికి వెష్ట మోసినప్పుడు వాళ్ళు బడితె బాజా ప్రారంభించెయ్యాలి. అసలుమనిషి వీడు కాకపోయినా అసలువాడిచేతిలో కీలుబొమ్మ. అసలువాడెవరు? మిగులు వాడెవరని మీన మేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే ఈ లోపున మనల్ని నమలకుండానే మింగేస్తారు."
"అందుచేత ఎవరినో ఒకరిని తన్నడం తప్పదంటారు." అంది సుశీల. రామారావు తెల్లబోయాడు.
"మీరు వ్యక్తి దౌర్జన్యవాదాన్ని సమర్థిస్తున్నట్లుంది. మార్క్సిజం…."
నారాయణ వెడనవ్వు నవ్వేడు.
"అయ్యా, మార్క్సిజాన్నేగాని, మరో ఇజాన్నేగాని దేశ కాల పాత్రలకి సమన్వయం చేసుకోవాలి. అలాగాక ఆ బాధల్ని రూళ్ళకర్ర సూత్రాలు చేసుక్కూర్చుంటే వచ్చే ఇబ్బందే ఇది. ఇన్ని యుగయుగాలుగా మహనీయులు చెప్పిన ఆశయాలూ, చూపిన ఆదర్శాలూ వారితోనే గబ్బుపట్టి పోవడానికి కారణం ఏమిటంటావు?"
"ఏమో. నేనంతవరకు చదువుకున్నట్లు కనిపించడం లేదు"—అన్నాడు రామారావు.
ఆ వెక్కిరింత అర్ధమయిందో, లేదో అర్ధమయినా లెక్కచెయ్యదలచలేదో నారాయణ తన ధోరణినే సాగించేడు.
"మార్క్సు ఊహించినా చూసి ఉండని పరిణామాల్ని లెనిన్ పెట్టుబడిదారీ విధానంలో చూసేడు. సామ్రాజ్యవాద దశలో మన ఎత్తుగడలు ఇల్లా ఉండాలన్నాడు. తరవాత యునైటెడ్ ఫ్రంట్ ఎత్తుగడల్ని…."
"అవీ కొత్త కాదండి, అసలు వర్గపోరాట సూత్రానికి మార్క్సే…."అంటూ రామారావు మాట కలపబోయేడు, కాని నారాయణ మాట సాగనివ్వలేదు.
"డైలెక్టిక్సు స్వామీ డైలెక్టిక్సు. ఫాసిజం మార్క్సు కాలానికి లేదు, లెనిన్ కాలానికీ లేదు…."
"కాని, అది వూహించలేని విషయం కాదు. జాక్ లండన్ తన 'ఐరన్ హీల్ 'లో దానిని వూహించాడు…."
"రాజకీయ పోరాటాన్ని వూహల మీద పెంచుకు పోడానికి వీలులేదు. ఆ స్థితి 35 నాటికి వచ్చింది. అయితే ఈ వేళ పరిస్థితి వేరు…."
రామారావు నిశ్శబ్దంగా వింటున్నాడు. హఠాత్తుగా నారాయణ ప్రశ్నించేడు.
"వింటున్నావా?"
"ఆ"
"దోపిడీ, దౌర్జన్యాలూ ఉత్పత్తి విధానంతోపాటు సామాజికం అయ్యాయి. ప్రతివాడూ పక్కవాడిని దోచుకుంటున్నాడు. రెండో వాడిమీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఈవేళ దోపిడీ, దౌర్జన్యాలు వర్గాల సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి. అసలు దోపిడీకీ, దౌర్జన్యానికీ మూలాన్ని దొరకపుచ్చుకోడం ఈవేళ అసాధ్యం. 1943లో బెంగాలు కరువుకి 50 లక్షల మంది చచ్చిపోయారన్నారు. ఎలకలూ, దోమలూ, ఈగలూ కన్నా హీనం ఆ కరువు మనుష్యకృతం. కాని ఏ మనిషి? అల్లాంటి పరిస్థితే నెహ్రూ అధికార కాలంలో కూడా ఏ చిన్న ప్రయాణంలోనైనా రాకపోలేదు. వచ్చినప్పుడు దానికి కారకుల్లో ఒక్కడిని పట్టుకు ఉరితియ్య గలిగేడా?"
"అంటే అర్ధం దానికి కారణం ఎవడో ఒక వ్యక్తి కాదనీ, అసలు కారణం సమాజ నిర్మాణంలోనే ఉన్నదనీ కాదా."
"అదే నే చెప్పేది, ఘోరాలు జరిగి పోతుంటాయి. దానికి బాధ్యత ఎవరో చెప్పడానికి ఉండదు. కనక నిశ్శబ్దంగా చావవలసిందేనా? 1943లో ఎలకల్లా చచ్చిపోయిన ఆ 50 లక్షలమందీ, ఒక్కో నూరుమంది ఒకణ్ణి పట్టుకొని నలుచుకు తినేస్తే సంఘం ఇల్లా వుండేనా? ఆ పనికి ఎగబడి వుంటే అంతమంది చావనక్కర్లేకుండానే వ్యవహారాలూ సర్దుకొని వుండేవి కావా?"
"మీ మాటలు అర్ధం కావు. ఒక వేపున కనిపించిన వాడినల్లా కొట్టమంటారు. రెండోవేపున పదిమందీ ఏకం అయి దెబ్బలాడమంటారు. ప్రతి వాడినీ తన్నడం ప్రారంభిస్తే పదిమందీ ఏకం కావడం జరుగుతుందా?" అని సుశీల అడ్డం వచ్చింది.
"ఆ సామూహిక వీరత్వం రావాలంటే ఎంత నిర్మాణం కావాలి, ప్రజల్లో ఎంత ప్రబోధం కావాలి? ఎంత అనుభవం వుండాలి? కాని, మీరు చెప్తున్న పద్ధతిలో ఆ మూడూ కూడ నష్టమేనే." అన్నాడు రామారావు.
"ఈత వస్తే గాని నీళ్ళలో దిగవద్దంటావు. అల్లా మంచంమీద పడుకుని కాళ్ళూచేతులూ కొట్టుకొంటూవుండు. ఈత చేతనవుతుంది." అని చిరాకుతో నారాయణ లేచేడు. ఆయన వెనకనే సుశీల లేచింది.
తొమ్మిదో ప్రకరణం
"లెక్చరరుగారు ఇంట్లోలేరేమిటి? ఎక్కడా అలికిడి వినబడ్డం లేదు." అంటూ భాగ్యలక్ష్మి ఎగతాళిగా రామారావు వాటా వేపు తల ఎగరేసింది.
అందులోని వెక్కిరింతను అర్ధం చేసుకోనట్లే సుశీల మాట్లాడేసింది.
"పాపం, ఈ రిట్రెంచిమెంటు కత్తి ఆయన మీద పడింది. ట్యూటరు వుద్యోగం కాస్తా పోయింది. ఏం చెయ్యడమా అని దిగులు పడుతున్నారు."
"దానికింత పాపం; తాపం ఎందుకు? నాలుగెకరాలున్నదాన్ని చూసుకున్నాడుగా. ఆ తరవాయేదో పూర్తయితే…."
"అల్లాంటి వాడైతే ఎకరాలతో పాటు ఓ చిన్న వుద్యోగం వున్నదాన్ని కూడా చేసుకోవచ్చు. దానికైతే వెతకనే పనిలేదు…."
"సడే. సంబడం. చేసుకొంటూ, చేసుకొంటూ…." చటుక్కున భాగ్యలక్ష్మి నిగ్రహించుకొని మాట మార్చేసింది. "సినీమాకిగాని వస్తావేమో అడిగి రమ్మంది, అక్క."
"యింకా పిల్లలు యింటికి రాలేదు. ఏ పనీ కాలేదు, ఇంట్లో. ఈ వేళ రానులే."
"పిన్నిగారున్నారుగా, ఓ పూటకి ఆమె దగ్గిర వుండలేరా?"
"వుండడం ఒక్కటేనా? వాళ్ళకెన్ని చేస్తే వుండడం మాటొస్తుంది."
ఆమె మాట పూర్తికాకుండానే వీధిలోంచి "అమ్మా" పిలుపు వినబడింది.
సుశీల ముఖం విచ్చుకుంది.
"అరుగో వచ్చేసేరు." అంటూ లేచింది.
"రాక ఎక్కడికి పోతారేం? మా అక్క, నువ్వు, మా వదిన మీరంతా ఒకే పాఠాలు చదివినట్లున్నారు. డ్రైనేజీ గోతులు, లారీలు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు….అబ్బ!"
"పెళ్ళి చేసుకొని ఓ పిల్లవాణ్నో, పిల్లదాన్నో కన్నాక చెప్దువులే…."
"నాకు పెళ్ళివద్దు. పెళ్ళయినా పిల్లలు వద్దు. వున్నా మీలాగ భయపడను."
సుశీల చిరునవ్వు నవ్వింది.
"ఆడ, మగ భేదం లేకుండా, ప్రతివాళ్ళూ వరసక్రమంలో ఏదో రోజున చెప్పే మాటలే. కాని తరవాత ఒక్కటీ గుర్తుండదు…."
"సరే. చూద్దుగానికా."
వీధి గుమ్మంలో ఆరేళ్ళ హేమ కనబడింది. అక్కడినుంచే ఫిర్యాదు చేసింది.
"అన్నయ్య రావడంలేదే, అమ్మా! ఒరేయ్, అమ్మతో చెప్పేస్తున్నా…."
ఆయాసపడుతూ హేమ లోపలికి వచ్చింది. ఆమె రెండు భుజాలనీ రెండు పుస్తకాల సంచులు, రెండు చేతులలో రెండు కేరియర్లు. ఆ వేషం చూసి భాగ్యలక్ష్మి ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి హేమకి సిగ్గేసింది. ఏదో అవమానం జరిగినట్లు ఏడుపుమొహం పెట్టింది.
"చూడే అమ్మా! తన సంచీ, కేరియరూ అన్నయ్య అరుగుమీద పారేసేడు."
సుశీల వెళ్ళి కూతురు భుజాలనున్నవీ, చేతులలోవీ తీసుకుంది.
"వాడి సంగతి చెప్దాంలే. ఏడీ వాడు? ఇంట్లోకి రాకుండా ఏం చేస్తున్నాడు?"
ఆ మాటలింకా పూర్తికాకుండానే వీధిలో పెద్దగోల వినబడింది. సుశీలా, భాగ్యలక్ష్మీ అటు పరుగెత్తేరు.
"చంద్రం కాలుజారి పడిపోయేడండి." – అన్నమాట విని, సుశీల ఒక్క వురుకున కందకం గట్టున నిలబడింది.
"వద్దంటున్నా వినలేదండి." అంటూ కుర్రవాళ్ళు ఆ ప్రమాదం బాధ్యత తమది కాదని చెప్పుకొంటున్నారు. ఆ మాటలేవీ సుశీల చెవిని చొరడం లేదు. కందకంలో నిలబడి వెర్రినవ్వులు నవ్వుతూ తన సాహసాన్ని గొప్పగా వర్ణించుకుంటున్న కొడుకును చూస్తూ గమ్మున లోపలికి వురికింది. ఆ వురకడంతో కాలు మడతపడి చదికిల బడిపోయింది. కూర్చునే కుర్రవాడిని దగ్గరకు లాక్కుని ముద్దులాడింది.
"దెబ్బ ఎక్కడ తగిలిందిరా, నాన్నా."
అంతమందిలో తనకేదో దెబ్బ తగిలినట్లు ఆదుర్దా చూపడం, ముద్దు చేయడం చంద్రశేఖరానికి చాలా చిన్నతనంగా కనిపించింది. తల్లి చేతుల నుంచి విడిపించుకొని, దూరంగా జరిగి, తన సాహస చర్యను సాభినయంగా వర్ణించసాగేడు.
"అందరికన్నా దూరం దూకేనమ్మా. మట్టిగడ్డ మీద కాలుపడింది. గోవిందా అని ఇల్లా పడిపోయేను."
పడిపోయిన విధాన్ని అభినయించి చూపడంలో మళ్ళీ తల్లికి దొరికిపోయాడు. యీమారామె వానిని వదలలేదు.
"గొప్పపని చేసేవులే."
"అల్లా కూర్చునే వున్నారేమిట"న్న ప్రశ్న వినబడి, సుశీలకు తాను కూర్చునే వున్న విషయం గుర్తు వచ్చింది. చటుక్కున లేవబోయింది. కాని సాధ్యం కాలేదు. అంతవరకూ కొడుకును గురించిన ఆదుర్దాతో ఆమెకు కాలు బాధ గుర్తు రాలేదు. ఇప్పుడు లేవలేకపోతూంది.
"ఏమయిందేమిటి?" – అని భాగ్యలక్ష్మి ప్రశ్నిస్తూంది. పరిస్థితి గమనించి ఆమె ఇంట్లోంచి నిచ్చెన తెచ్చి వేసుకొని దిగి వచ్చింది. ఆమెతోనే వచ్చిన సుశీల తల్లి గట్టు మీదనుంచే "ఏమయిందే అమ్మా!" అంటూంది.
అంతవరకూ తోచివుండని బాధ కాలినరాల్ని తోడేస్తూంటే సుశీల "అబ్బా" అంటూంది. కాలు రాయడానికి భాగ్యలక్ష్మి చెయ్యి జాపింది. కాని సుశీల మొర్రో అనేసరికి వదిలేసింది.
"చూడు. నీ మూలంగా అమ్మ కాలు నొప్పెట్టింది." అని భాగ్యలక్ష్మి కోప్పడుతూంటె చంద్రశేఖరం బిక్కమొహం వేసేడు.
"అంచుకి వెళ్ళకండర్రా. మీరు కూడా పడిపోతారు!" అని గట్టు మీద పిల్లల్ని బతిమలాడుతూంది. ఆ గోల గంద్ర గోళం విని ఇరుగు పొరుగులు వచ్చేసేరు. తొంగి చూడడంతో వాళ్ళు కూడా తమ మీద పడే ప్రమాదం వున్నదని అప్పుడే దిగి వచ్చిన రామారావు గ్రహించేడు. నిద్రలో బయట కేకలు విని ఉలికిపడి అతడు పరుగెత్తి వచ్చేడు.
"ముందు నువ్వు పైకెక్కు."
భాగ్యలక్ష్మి తిరగబడి చూసింది. నువ్వా నన్ను ఆజ్ఞాపించేదన్నట్లు. కానీ రామారావు మరో మాటకు అవకాశం ఇవ్వలేదు.
"ఊ. త్వరగా పిల్లవాడినందుకో."
సుశీల చూపు కూడా గ్రహించి, భాగ్యలక్ష్మి గబగబ నిచ్చెన నెక్కేసింది. ఆమె ఇంకా పై మెట్టు మీద వుండగానే క్రింది నుంచి రామారావు కంఠం.
"గట్టిగా పట్టుకో."
వెనుతిరిగి చూసింది. పిల్లవాడిని పైఎత్తున నిలబెట్టి రామారావు సుశీలను లేవదీయబోతున్నాడు.
"లేవగలరేమో చూడండి."
ఆమె కాలు రాసుకుంటూ లేవబోయింది. కాని, మరల చదికిలబడింది.
లాభంలేదు. రామారావు నొప్పిపెట్టిన కాలు తొక్కిపెట్టి, ఆమె నడుముకు చేతులు చుట్టి బలంగా లేవనెత్తి గుంజేడు. అదురు తిన్న నరాలు కొంతవరకు సర్దుకొన్నాయి. కాని, కాలు నేల మోపగల స్థితిలో లేదు. నిచ్చెన ఎక్కడం ఎల్లాగ? జనం కందకం అంచుకు చేరి తలో సలహా ఇస్తున్నారు. సలహాలు వుపయోగం ఉన్నా, లేకపోయినా గట్టుతో సహా వారంతా తమ మీద పడే ప్రమాదం వుంది. రామారావు వొంగి చటుక్కున సుశీలను భుజాన వేసుకొన్నాడు.
"భయపడకండి."
తీసుకెళ్ళి మంచం మీద కూర్చోపెట్టేడు.
"ఎర్రమన్ను వుడికించి కట్టండి."
"చింతపండూ, సున్నం అయినా సరే."
ముసలమ్మ ఆశీర్వదిస్తూంటే రామారావు తన గది వేపున నడిచేడు.
పదో ప్రకరణం
వినోదం చూడవచ్చిన వారూ, ప్రమాదాన్ని పరామర్శించ వచ్చిన వారూ వదిలిపెట్టేవరకూ ఎంత చిరాకుగా వున్నా, చెప్పిన మాటే చెప్తూ, రామారావు అరుగు మీదనే నిలబడిపోవలసి వచ్చింది.
వారంతా వెళ్ళిపోయాకనే అతడు తన వాటాలో ప్రవేశించేడు. చికాకుగా వుంది. ఉక్క, చెమట, స్నానం చెయ్యాలని ఆశ.
వెళ్ళి, కుళాయి తిప్పేసరికి అది కంయ్ మంది. పక్క వాటాలోంచి సుశీల తల్లి కేకేసింది.
"ఈవేళ కుళాయిలు రాలేదు నాయనా!"
"కృష్ణానది పక్కనుండగా నీళ్ళ కరువు. దరిద్రగొట్టు మునిసిపాలిటీ." అని తిట్టుకున్నాడు. ప్రాణం వుసూరుమంది. నిలబడి పోయేడు.
"ఎక్కడో బాగులో, దోగులో తగులడుతూండి వుంటారు" – అన్నాడు కోపం పట్టలేక.
"నీళ్ళు రావు. జాగ్రత్త పడండి – అనేనా చెప్పి చావరు" – అంది ముసలమ్మ లోనుంచే.
నోటీసు పంపడం ఇంటింటికీ చెప్పడం అనవసర శ్రమ కాదా? బాధ ఎల్లాగూ తప్పదు. ముందుగానే చెప్పి ఏడిపించడం ఎందుకనుకొని వుంటారు. అన్నాడు తిట్టలేక కసి పట్టలేక.
"పండుగొచ్చేసరికి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ మామూళ్ళ కోసం ముష్టికి బయలుదేరడం కష్టమనిపించదు." అంది ముసలమ్మ.
"త్రాగడానికా? స్నానానికా?"
"స్నానం చెయ్యాలనేమో ఇందాకా పనిమనిషిని మీ స్నానాల గదిలో కూడ నీళ్ళు పొయ్యమని చెప్పేను చూసుకోండి." అంది, ఆ సంభాషణ అంతా వింటున్న సుశీల.
"బాల్చీలు కావేసినట్లున్నాయి. మరిచిపోయి వుంటుంది. అదేనా తక్కువ తిన్నది." అన్నాడు, రామారావు తెచ్చికోలు శాంతంతో.
"మా గదిలో పోయించాను. వాడుకోండి."
పక్కనే వున్న భాగ్యలక్ష్మికి పని పురమాయించింది.
"ఆ చెంబూ, బాల్చీ, సబ్బూ కాస్త ఆ గదిలో పెట్టి రావే."
రామారావు వద్దన్నాడు.
"తరవాత చూస్తాలెండి"
అలా అన్నాడేగాని కూజాలో నీళ్ళు చూశాక మరో ఆలోచన తోచింది. హస్పిటళ్ళలో రోగులకు చేయించే "సోప్ బాత్" గుర్తొచ్చి అంత చిరాకులోనూ నవ్వొచ్చింది.
"Simple living and high thinking. భారతదేశపు పారమార్థికతకి ప్రపంచం జోహార్లు చెప్పక చస్తుందా?"
పదకొండో ప్రకరణం
తన వెనకవేపున బరువు బాల్చీ దబ్బున పెట్టిన చప్పుడయి, రామారావు ఉలికిపడి, ఈలపాట ఆపేడు.
ఆ"సోప్‌బాత్" ఇంచుమించు తడిగుడ్డతో తుడుచుకోవడం వంటిదే అయినా, ఆమాత్రానికే ప్రాణం ఎంతో హాయిగా వుంది. చిరాకు తగ్గి ఈలపాట దానంతట అదే వచ్చేసింది. ఆ హుషారులో భాగ్యలక్ష్మి నీళ్ళ బాల్చీతో రావడాన్ని అతడు గమనించలేదు. బాల్చీ చప్పుడు విని తిరగబడి చూసేడు. భాగ్యలక్ష్మి, నడుమున రెండు చేతులూ పెట్టుకొని ఆయాసపడుతూ నిల్చునుంది. తడిసిన అండర్‌వేర్‌తో ఇంచుమించు నగ్నంగా వున్న తన స్థితికి సిగ్గుపడి అతడు కూర్చున్న పీటమీదనే వెనక్కి తిరిగేడు.
"ఏమిటిది?"
"నీళ్ళు"
"అది సరిలే. ఎందుకూ అని."
"తమరు తానమాడాలని."
"అదీ బాగానే వుంది. నీకీ శ్రమ ఎందుకని….వద్దన్నా కాదా?"
ఒక్కక్షణం భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపులు తన వొళ్ళంతా తడుముతున్నట్లనిపించింది.
"బాగుంది. Thanks—వెళ్ళు."
"నాకెందుకు. ఆ సుశీలమ్మగారికి చెప్పుకో. ఓ బాల్చీడు నీళ్ళు యిచ్చిరా తల్లీ! ఆ వొళ్ళు వేడేనా తగ్గుతుంది అని తరుముతే తెచ్చేను."
"నా ఒళ్ళు వేడి ఆమెకెందుకు తెలిసిందబ్బా!" అన్నాడు, రామారావు వెక్కిరింతగా.
ఆ ప్రశ్నకోసమే కాచుక్కూర్చున్నట్లు భాగ్యలక్ష్మి చటుక్కున అనేసింది.
"కౌగలించుకున్నప్పుడు తెలిసి వుంటుంది."
భాగ్యలక్ష్మి స్వభావం ఎరిగిన రామారావు ఎర్రబారి చూసేడు.
"సంతోషించాం. వెళ్ళిరా."
భాగ్యలక్ష్మి కదలలేదు. పైగా—
"ఏమిటి నీ వుద్దేశం? అంతమంది ముందు, పట్టపగలు, పరాయి ఆడదాన్ని, నీకన్నా పెద్దదైతే మాత్రం, పిల్లల తల్లిని అల్లా కౌగలించుకోడం, చేతుల్లో ఎత్తుకుని రావడంలో నీ వుద్దేశం ఏమిటి? రేపు ఆవిడ తల ఎత్తుకోవాలా?"
సుశీలయందున్న గౌరవం కొద్దీ అతడామాటను సాగదియ్యలేకపోయాడు. అందుచేత వెక్కిరింత, వేళాకోళంతో తోసివెయ్యబోయేడు.
"ఔను సుమా!" అన్నాడు. ఆ కందకంలో ఆవిడను వదిలేసి, మీ అందరి సానుభూతి ప్రదర్శనలకూ అవకాశం ఇవ్వకుండా పైకి తేవడం ని….ఝం….గా చాలా….తప్పు."
భాగ్యలక్ష్మి కళ్ళు చురచురలాడేయి….
"సిగ్గు లేకపోతే సరి."
ఆమె కోపం ఏమిటో, ఎందుకో రామారావు ఎరుగును. కానీ గుర్తించదలచుకోలేదు.
"నిజమే. మనిషికి అభిమానం, అహంకారమే గాక సిగ్గు కూడా అవసరమైన ఆడగుణాల్లో ఒకటని నాకు గుర్తులేదు సుమా."
"ఆడది కనిపిస్తే నీకేమీ గుర్తుండదు. ఎదో పేరున ముట్టుకోవాలి."
ఆ మాటతో రామారావు కళ్ళు నిప్పులు కురిసేయి. అతికష్టం మీద కంఠాన్ని నిగ్రహించుకున్నాడు.
"నీకు నీమీద అభిమానం కన్న ఇతరుల పాతివ్రత్యం కాపాడ్డం మీద ఎక్కువ శ్రధ్ధ సుమా."
ఒక్కనిముషం క్రితం కలిగిన సిగ్గు మాట మరిచిపోయాడు. లేచి ఆమె రెక్క పట్టుకొని వరాండా గుమ్మంవేపు నడిపించేడు.
"సినీమాలూ, నాటకాలూలో లాగ లెంపకాయకొట్టే ఆలోచన పెట్టుకోకు. అప్పుడు నిజంగా విలన్‌నైపోతా."
చెయ్యి విడిపించుకుంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడింది.
"చెయ్యొదులు."
"ఆడదానివి. చెయ్యేనా పట్టుకోకపోతే నీ ఆడతనానికే అవమానం కాదూ"
గుమ్మం వెలుపల నిలవబెట్టి తలుపు వేసుకుంటూ హితోపదేశం చెసేడు.
"మీ యింట్లో వుండడంలేదనీ, మీరంతా నా ఆరోగ్యం, నా మర్యాదా గురించి ఇంత శ్రధ్ధ తీసుకోనక్కర్లేదనీ నీకు ఎల్లా నచ్చచెప్పడమో తెలియడం లేదు. ఇక అనవసరంగా…."
తరవాత ముగింపు ఏమిటో తలుపు చప్పుడుతో భాగ్యలక్ష్మికి వినిపించనేలేదు.
పన్నెండో ప్రకరణం
సుశీల పడుకుని వున్న గది గుమ్మంలో నిలబడి "కాపడం పెట్టేరా? ఎల్లా వుంది?" అని అడుగుతున్న రామారావుని లోపలికి ఆహ్వానించింది.
"రాండి. ఆ కుర్చీ లాక్కోండి. అప్పుడే స్నానం అయిపోయిందా?"
"ఎంతసేపేం?"
"ఇప్పుడే కదా భాగ్యలక్ష్మి బాల్చీ పెట్టి వచ్చింది?"
"ఆమె వచ్చేసరికే నా స్నానం అయిపోయింది."
"నీళ్ళెక్కడివి? మొగమోటపడ్డారా?"
"భాగ్యలక్ష్మిని పాపం ఎందుకు శ్రమ పెట్టేరు? అంత పెద్ద బాల్చీని నీళ్ళతో ఈడ్చుకొచ్చి, పాపం వొగిర్చేసింది. నాకు అవసరం అనిపిస్తే నేను తెచ్చుకోకపోయేనా? మీ యింట్లోనా నాకు మొహమాటం?"
ఆ రెండు కుటుంబాల మధ్య దగ్గరదో, దూరపుదో బంధుత్వం వుందని సుశీల ఎరుగును. రాకపోకలున్నాయి. కాని, వ్యవహారాలు చూస్తే ఎక్కడో ఏదో లోపం వుందనిపిస్తుంది. ముఖ్యంగా భాగ్యలక్ష్మి.
"అబ్బే. యిందులో ఏం వుంది? భాగ్యలక్ష్మి ఒకరికి సాయం అంటే వెనక తియ్యదు. చాలా మంచిపిల్ల."
"నేనెరగనా? పి.యు.సి., బి.ఎస్.సి., లు నేను వాళ్ళింట్లో వుండే చదువుకొన్నా. మీరెరగరేమో."
"మీ అమ్మగారు అంటుంటారు."
"నాకు తెలుసు. అయితే ఆమెకు శ్రమ ఇవ్వడం అనవసరం అని గాని…."
సుశీల యింకా ప్రసంగాన్ని సాగతీయదలచుకోలేదు. మాట మార్చింది. కొంతసేపు డాక్టరుకు కాలుచూపడం అవసరమా, ఆయన్ని తీసుకురావడమా, లేకుంటే వెళ్ళడం ఎల్లాగ—అనేక విషయాలు కబుర్లలో దొర్లేయి.
ఒక నిమిషం ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి రామారావు లేచేడు.
"చూడండి, మీ విషయంలో నేనేమన్నా అనుచితంగా వ్యవహరించి వుంటే క్షమించండి."
సుశీల తెల్లబోయింది.
"మీమాట నాకర్ధం కాలేదు."
"అర్ధం కాకపోతే బాధ లేదు. వదిలెయ్యండి. సరే, పోయొస్తా."
సుశీల ఆలోచనలో పడింది. ఆ క్షమాపణకి యిప్పుడవసరం ఏమిటి? భాగ్యలక్ష్మి ఏమన్నా అందా? ఆమెకు అతడంటే ఏదో చులకనభావం. మగాడు, గడుసువాడు కనక తేలడు. కాని, రామారావుకీ వుంది అటువంటిదేదో. వాళ్ళ వైమనస్యాలమధ్య తన ప్రసక్తి ఏమిటి?
"మనుష్యులకి ఒకరినొకరు పీక్కు తినడం ఆనందమా, కాలక్షేపమా?"
పదమూడో ప్రకరణం
"సినీమాకొస్తావేమో అడిగి రమ్మంటే కాలు విరుచుకున్నావని ఓ గంట పోయాక కబురు తెచ్చింది, భాగ్యం. చూసొద్దామని బయలుదేరా" నంటూ వచ్చిన సుపర్ణను చూసి సుశీల సంతోషంతో ఆహ్వానించింది.
"రావే. రా. నిద్ర రానప్పుడు మంచం మీద పడుకుని వుండవలసి రావడం ఎంత కష్టమే. అబ్బ." అని చిరాకు పడింది.
"పడుకో, లేస్తావెందుకూ? కుర్రాడు ఏడీ? వాడికేం దెబ్బ తగలలేదు కద." అంటూ సుపర్ణ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది.
"పిల్లలిద్దర్నీ తీసుకొని అమ్మ ఇప్పుడే పక్క యింటి కెళ్ళింది. అదీ అదృష్టమే, వాడికేం తగలలేదు."
"పోనీలే. పిల్లగాళ్ళు కారుగాని…."
"ఒక్క నిమషం కాలూ, చెయ్యీ వూరుకోదు కద."
పిల్లల మాటలూ, అల్లర్లూ గురించి కొంతసేపు విచారం, సంతోషం, విసువు, ఉత్సాహం వారి మాటలలో మారి మారి వినిపించింది. తరువాత ప్రమాదం ఎల్లా జరిగిందో, ఆ క్షణంలో తన మనస్స్థితి ఏమిటో సుశీల కొంతసేపు వర్ణించింది. అదీ విసుగనిపించింది.
"అబ్బ, పాడుదెబ్బ. కాస్సేపు మరో కబుర్లేవేనా చెప్పు. పిల్లని తీసుకొచ్చేవు కాదేం? ఏడాది వెళ్ళిందా? మీ ఆయన ఎప్పుడు వస్తారుట. నీ ప్రయాణం ఎప్పుడు?"
"వుద్యోగరీత్యా హైద్రాబాదు వెళ్ళేరు. ఆదివారం మెయిలుకి టిక్కెట్లు తీసుకొని రెడీగా వుండమన్నారు."
"ఎల్లుండి పొద్దుటేనా?"
"కాదు. పైవారం."
"ఎక్కడికి పార్వతీపురమేనా?"
"ఆ. అంతా గొడవ గొడవగా వుంది. కొండవాళ్ళనీ, కోయవాళ్ళనీ రెచ్చగొట్టి వూళ్ళు దోసిస్తున్నారు, కమ్యూనిస్టులు."
"మొగుడు పోలీసు ఆఫీసరు అయినందుకు నీకు పాఠాలు బాగానే వంటబడుతున్నాయి."—అని నవ్వింది సుశీల, సుపర్ణ తెల్లబోయింది.
"అదేమిటే, అల్లా అంటావు? మాకు తెలిసిన కుటుంబం ఒకటుంది. వర్తకులు, ఇంక ఆ ప్రాంతాలకు వెళ్ళం బాబోయని యింటిదగ్గిరే కూర్చుంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే…."
"వీళ్ళు ఏంచేసి ఎందుకు భయపడుతున్నారో. చెప్పేటప్పుడంతా సుగుణాభిరాములే."
"వాళ్ళేమిటి? చెయ్యడం ఏమిటి? నువ్వు మరీను. అక్కడి సరుకు తెచ్చి ఇక్కడా, ఇక్కడిదక్కడా అమ్ముకొనే రకం. ఒకరి జోలికీ సొంటికీ పోయేరకం కాదు."
"ప్రపంచం మనకు కనిపించేటంత అమాయకంగా వుందనుకోకు. సరిలే. ఏమిటి కథ. భాగ్యలక్ష్మికింకా పెళ్ళి మాట ఆలోచించడంలేదా?" అంటూ మాట మార్చింది, సుశీల.
ఆ ప్రశ్న రాగానే సుపర్ణ అటూ, ఇటూ చూసింది. నెమ్మదిగా గొంతు తగ్గించి—"రామం ఇంట్లో వున్నాడా?" అంది.
తాను భాగ్యలక్ష్మి పెళ్ళి సంగతి అడుగుతూంటే, సుపర్ణ రామారావు వున్నాడా అని అడగడం సుశీలకు వింతగా తోచింది. కాని ఏమీ తేలలేదు.
"లేరు. ఇంతక్రితమే బజారుకెళ్ళేరు. భోజనం అవీ పూర్తి చేసుకుని ఏ తొమ్మిదింటికో చేరుకుంటారు. ఇంటిదగ్గిర కనిపెట్టుకొని వుండే వాళ్ళెవ్వరూ లేరు కదా. తోచినప్పుడు రావడం-పోవడం…." అంటూ సుపర్ణ అడిగినవీ, అడగనివీ అన్నింటికీ సమాధానం ఇచ్చింది.
"తల్లి?"
"కూతురు కొత్తకాపరం సరిదిద్దడానికి వెళ్ళేరు కదా. ప్రస్తుతం కూతురూ, అల్లుడూతో కొండకెళ్ళేరుట. వస్తారు, ఎప్పుడో."
సుపర్ణ నవ్వింది.
"తెలుగునాట దైవభక్తి డేంజరుగా మారుతూంది."
"పెళ్ళికాక ముందునుంచే ప్రభావతి శనివారాలుంటూంది."
"అదేముందిలే. ఈవేళ హాస్టల్సులో ఆడపిల్లలందరికీ అదో ఫేషనయిపోయింది. లావు తగ్గించేందుకనీ, వెంకటేశ్వరుణ్ణి మంచి చేసుకొనేందుకనీ ఉమ్మడిగా ఉపవాసాలు చేసేస్తుంటారు," అంది సుపర్ణ. సుశీల నవ్వింది.
"ఎదటివూరునపట్టి రాంలింగయ్యో రామభద్రయ్యో అయినట్లు—"
"అదేంకాదు, సిగ్గా ఏమిటి? ఎవరో ఒకరూ, ఇద్దరూ అల్లా చేస్తేనది. అందరూ అదే పడవలో వున్నప్పుడు ఎవరికోసం ఆ భయం?"
"నువ్వూ చేస్తున్నావా?"—అంది ఆశ్చర్యంగా సుశీల. సుపర్ణ చిన్నపుచ్చుకొంది.
"యూనివర్సిటీ హాస్టలుకెళ్ళేక నలుగురినీ చూసి నేనూ ప్రారంభించా. అంతకు పూర్వం రామారావుది ఇన్‌ఫ్లుయన్సు. ఆ పద్యం ఆ రోజుల నాటిదే."
"మీ భాగ్యలక్ష్మికి లావు భయం, దేవుడి భయం కూడా లేవు." అని మెచ్చుకుంది, సుశీల.
సుపర్ణ ఒక్క నిముషం తటపటాయించి, ఎత్తుకుంది.
"మాట వచ్చింది కనక చెప్తాను. నీకు చేతనైతే దానికి నచ్చచెప్పడానికి ప్రయత్నించు. మళ్ళీ ఎక్కడా అనకు."
అదేదో కుటుంబ విషయం అయివుంటుందని గ్రహించి సుశీల సందేహించింది.
"రహస్యమైతే చెప్పకు."
"అది ఇక్కడినుంచి వచ్చి గదిలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంది."
సుశీల ఆశ్చర్యపడింది.
"ఎందుకు? ఏం జరిగింది? వెళ్ళేటప్పడు మామూలుగానే వుందే."
కొద్దిసేపటి క్రితమే రామారావు వచ్చి భాగ్యలక్ష్మితో నీళ్ళు ఎందుకు పంపించేరని అడిగిన మాట గుర్తు వచ్చింది. అతడేమన్నా….తన తప్పును కమ్ముకోనేందుకు ముందుకాళ్ళ బంధంలా ఆ మాట అనలేదుగదా అనిపించింది.
"అదే అడిగేసరికి భళ్ళున ఏడ్చేసింది."
"ఎందుకంటుంది?"
"రామారావు మీద దానికి….వెర్రి మమకారం."
సుశీల వులిక్కిపడింది. తన అంచనా తప్పన్నమాట.
"అదేమిటే….ఆయనకి పెళ్ళి స్థిరపడింది కాదటే…."
సుపర్ణ ఏమీ అనలేదు.
"మీది పొరపాటేమోనే….అతనంటే దానికేమాత్రం గౌరవం లేదు."
"నీకు తెలియదు, అదో పెద్దకథ."
సుపర్ణ ఆ కథనంతనూ చెప్పలేదు. కాని, అసలు విషయం చెప్పింది.
"మా అమ్మా, నాయనమ్మా అంటే అతనికి పరమ అసహ్యం. వాళ్ళకి అతనంటేనూ అంతే. భాగ్యలక్ష్మి ఆశ విఫలం కావడానికి మూలం అదే. దానికి అతడు తప్ప మరెవ్వరూ ఆనరు. ఆ విషయం తెలియబరిచే పధ్ధతినది ఎరగదు. ఫలితంగా దాని పరిస్థితి తెలియకుండానే అతడు చెయ్యి జారిపోయేడు."
"చిత్రమేనే."
"నే నెరుగుదును."
"ఎరిగినదానివి సర్దుబాటు చెయ్యడానికి నువ్వెందుకు ప్రయత్నించేవు కావు? ఈ పరిస్థితినింతదాకా ఎందుకు రానిచ్చేవు?" సుపర్ణ ఒక్క నిముషం ఆలోచించింది.
"దాని స్థితి నాకు అర్ధం అయ్యేసరికి రామారావుకు సలహా ఇవ్వగల స్థితి లేకుండా పోయింది."
"మీ నాన్నగారికి…."
"ఆయనకి తెలియదు. తెలిసినా ఏమీ చెయ్యగలిగి వుండేవారు కాదు."
"నువ్వేదో దాస్తున్నావు. రామారావుకి యీ సంబంధం కుదర్చడంలో మీ నాన్నగారి పాత్ర చాలా వుంది. నాకు తెలుసు. కూతురు ఆలోచన తెలిసివుంటే ఆయన ఎందుకల్లా చేస్తారు?"
సుపర్ణ దానికేమీ సమాధానం ఇవ్వలేదు.
"అతనికా పెళ్ళేదో జరిగిపోతే బాగుండిపోను. ఇంకెల్లాగూ లాభం లేదని అదే సర్దుకొనేది."
"ఒక్కటి చెప్పు. భాగ్యలక్ష్మి మనస్సు తన మీద వున్నదని రామారావుకి తెలుసా?"
"చెప్పలేను. చెప్పలేను."
"తెలిసి మాత్రం ఏం లాభం? ఆయనకు ఇష్టం వుండాలి కద!"
"ఆ మాట దానికి నచ్చచెప్ప గలిగితే ఇంకేముంది? నీకేమన్నా సాధ్యమేమో ప్రయత్నించు."
పధ్నాలుగో ప్రకరణం
సుపర్ణ నెమ్మదిగా మేడమీదికెళ్ళి తండ్రి గదిలోకి తొంగి చూసింది. చుట్టపొగల మధ్య, చీకట్లో, కిటికీ దగ్గర, నిర్వికల్ప సమాధిలో వున్నాడాయన. ఒక్క నిముషం తటపటాయించింది. కానీ, ఏదో నిర్ణయానికి వచ్చినట్లు గదిలో అడుగు పెట్టింది.
"ఇంత ఉక్కలో, ఈ పొగలో ఎల్లా కూర్చున్నారు? ఫాన్ అయినా వేసుకున్నారు కాదు." అంటూ ఆమె స్విచ్ వేసింది. వెలుతురు వెల్లువలో కళ్ళు చికిలిస్తూ సత్యనారాయణ నవ్వేడు. సమాధిలోంచి లేస్తూ "ఔను సుమా!"
"ఏమిటి చదువుతున్నారు?"—అంటూ సుపర్ణ కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుంది.
"ఈవేళ మీ అల్లుడుగారు ఉత్తరం రాసేరు."
"నాకూ వ్రాసేరు. అదే ఆలోచిస్తున్నా."
"అమ్మ వాయిదా వేస్తూంది…."
"ఏమంటుంది?"
"ఎదురుగా దసరాలు పెట్టుకుని ఇప్పుడు ప్రయాణమేమిటంటుంది."
"ఇప్పుడెక్కడ దసరాలు. ఇంకా జూలై కూడా వెళ్ళలేదు."—అన్నాడు సత్యనారాయణ ఆశ్చర్యంగా.
"ఔను."
"నువ్వేమనుకుంటున్నావు?"
"ఆయనకి కోపం వస్తుంది."
"ఆయనకి కోపం వస్తుందని బాధా? మొగుణ్ణి వదిలి వుండటం బాధా?" అంటూ, పెత్తల్లి కాంతమ్మ తుఫానులా గదిలో ప్రవేశించింది.
"మగడిదగ్గరకెళ్ళడం అపరాధమన్నట్లు మాట్లాడతారేమండి?"
"దసరాల పేరు చెప్పి ఇప్పటినుంచీ మఠం వెయ్యమంటావేమిటి? ఆనాటికి మళ్ళీ రావచ్చు"—అంది సుపర్ణ ఖండితంగా.
"అదే బాగుంటుందని నా అభిప్రాయం"
కాంతమ్మకు మరిది మీద మహా కోపం వచ్చింది. "సంసారం అంటూ చేసేవు గనక పిల్లలు పుట్టేరు. అంతకి తప్ప నీకు ప్రేమా, పేగూ అంటూ వున్నాయా? వుంటే నువ్వే దానిచేత ప్రయాణం కట్టిస్తావా?" అంటూ వచ్చినంత దూకుడుగానూ వెళ్ళిపోయింది, కాంతమ్మ.
"వాళ్ళగొడవే వాళ్ళది. ఏమీ అర్థమయి చావదు"—అని విసుక్కున్నాడు, సత్యనారాయణ.
"మీరు కూడా అమ్మతో చెప్పండి."
వదినగారి మాట విన్నాక భార్య ధోరణి ఎలా వుంటుందో సత్యనారాయణ వూహించగలడు. ఆయన వ్యాపారానికి మూలధనం వాళ్ళ ఇద్దరి ఆస్తీ. ప్రతి విషయంలోనూ, వారామాట మరిచిపోకుండా చూస్తుంటారు. వాళ్ళని ఏమాత్రం కాదన్నా అరికాలి కింద మంటలు పెట్టేస్తారు. తెలుసును. కాని, కూతురుకు సాయం ఇవ్వాలి. ఆలోచించేడు.
"నేను వెడతాను." అంది, సుపర్ణ.
"నిలబడవలసింది నువ్వు."
ఆ మాటలో ఇదివరలో అతిముఖ్యమైన మరో విషయంలో నిలబడలేకపోయావన్న అర్ధం ధ్వనించి సుపర్ణ గమ్మునై పోయింది. సత్యనారాయణ మాట మార్చేడు.
"పాప మాట వినబడదేం?"
"పడుకుంది."
"ఇప్పుడా? ఎటూ కాని వేళ."
"అల్లా సుశీలని చూసి వద్దామని వెళ్ళివచ్చేసరికి పడకేసేసింది."
"రామం వున్నాడా?"
"లేడు. ఏ హోటలులోనో భోంచేసి, ఏ పదింటికో ఇల్లు చేరుతాడట."
"వాళ్ళమ్మ లేదు కాబోలు."
"ఉహు."
ఒక నిముషం ఊరుకుని సుపర్ణే ప్రారంభించింది.
"ఎం తకాలం ఈలా అవస్థలు పడతాడు? సంబంధం కుదిరి అన్నీ నిశ్చయమయ్యాక కూడా ఈ నాన్పుడు ఎందుకు? ఆ పెళ్ళేదో చేసుకోమనండి."
ఆమె ఆ ప్రసక్తి తేవడం సత్యనారాయణకు ఆశ్చర్యం అనిపించింది. సుపర్ణ ఒక దశలో రామారావును పెళ్ళి చేసుకోవలసింది. అది ఆమె పట్టుదలే కూడా. ఆ రోజుల్లో రామారావు తమ యింట్లోనే వుండి, కాలేజీలో చదువుకుంటున్నాడు. యిద్దరిదీ ఒకే తరగతి, ఒకే వయస్సు. వాళ్ళు పెళ్ళి చేసుకుంటామనడం తనకు ఇష్టమే. డబ్బులేక తన యింట వుండి చదువుకొంటున్నా సత్యనారాయణకు రామారావు మీద వెర్రి మమకారం వుంది. కుర్రవాడు. తెలివి గలవాడు. మంచితనం వుంది. చూపరి. ఆరోగ్యవంతుడు. అవన్నీ చూసే, స్కూల్ ఫైనల్ తో చదువు మానెయ్యకుండా తీసుకొచ్చి యింట పెట్టుకున్నాడు. పైకి చదివించేడు. అతడు తనకు అల్లుడు కావడం అప్రతిష్ఠగా తోచలేదు, సత్యనారాయణకి.
కాని భార్య మంగమ్మ, వదిన కాంతమ్మ, వారితోపాటు తన తల్లి పిచ్చమ్మ కూడా ఆ సంబంధాన్ని మెచ్చలేదు. రగడ ప్రారంభమయింది. చివరకు ఆ యిల్లు వదిలేసి, చదువు పూర్తికాగానే రామారావు వుద్యోగం వెతుక్కున్నాడు. ఎం. ఏ. చదవడానికి సాయం యిస్తానన్నా నిరాకరించేడు. సుపర్ణ తల్లినీ వాళ్ళనీ ఏమార్చడం కోసం పోయి యూనివర్సిటీలో చేరింది. అది పూర్తి చేసుకు వచ్చి రామారావును పెళ్ళి చేసుకుందామనే ఆమె వుద్దేశ్యం.
కాని, రెండేళ్ళయేసరికి ఆమెకు యింకా ఆ ఆసక్తి మిగలలేదు. అక్కడే బి. యల్. చదువుతున్న యువకుడు పరిచయం అయ్యేడు. అతడు ఐ. పి. యస్.కు సెలక్టు కావడం చేత యింట్లో వాళ్ళకి అభ్యంతరం కాలేదు. పెళ్ళయిపోయింది. అటు తర్వాత ఆమె ఏదో తప్పు చేసినట్లు రామారావును తప్పించుకు తిరుగుతూంది.
ఆమెయే ఈవేళ రామారావు పెళ్ళి ప్రసక్తి తేవడం ఆశ్చర్యమనిపించింది.
"ఇప్పుడా మాట ఎందుకొచ్చింది?"
ఏమని చెప్పాలో సుపర్ణకి అర్ధం కాలేదు. చెల్లెలి మాట చెప్పడమా? కాని ప్రయోజనం ఏమిటి, గొడవ తప్ప? వద్దనుకుంది. యింక ఏదో ఒకటి చెప్పాలి.
"అతని వుద్యోగం పోయిందట."
"రిట్రెంచిమెంటా?"
సుపర్ణ తల తిప్పింది.
"బాగా పని చేస్తాడనీ, పిల్లలు అతని యెడ అభిమానంగా వుంటారనీ నాలుగు రోజుల క్రితమే కాలేజీ కమిటీ ప్రెసిడెంటు అన్నారే."
"మన దేశంలో సమర్ధతా, మంచితనం ఉద్యోగార్హతలు కావు నాన్నగారూ!"
"నీకీమాట ఎవరు చెప్పేరు?"
"సుశీల."
"నిజమే అయివుంటుంది." అన్నాడు సాలోచనగా…."అభిమానపడి పై చదువు మానుకున్నాడు. లేకపోతే….సరిలే. ఈ ముండా కాలేజీ వుద్యోగం లేకపోతే బతకలేడట. నోట్లో అక్షరమ్ముక్క వున్నవాడు. ఇది కాకపోతే మరొకటి."
సుపర్ణ ఏమీ అనలేదు. సత్యనారాయణకి అప్పుడు గుర్తుకు వచ్చింది.
"లంఖణాల్లో మనుగుడుపులన్నట్లు వుద్యోగం పోయి అతడుంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోమనడం ఏమిటి?"
"ఆ అభ్యంతరం అందరికీ చెల్లవచ్చు. కాని అతని విషయం వేరు."
"ఏమిటో."
"ఈ బి.ఏ.తో అతనికి వుద్యోగం దొరకడం మాటలు కాదు. ఏదో దొరికినా ఆ వచ్చే డబ్బులతో, పెరుగుతున్న ధరలతో అతని కడుపు నిండదు."
"చెప్తే విన్నాడు కాదు…."
"పోనీండి. అతనికి కొన్ని అభిమానాలున్నాయి."
కూతురు చెప్పదలచుకొన్నదేదో స్పష్టంగా చెప్పడం లేదనిపించింది.
"చేతిలో నాలుగు రాళ్ళుంటే పోయి చదువుకోమందాం. తక్కువైతే ఇద్దాం. అంతేగాని ఇప్పుడే పెళ్ళి తగులాటం పెట్టుకోమనడం ఏం సబబు?"
"డబ్బు మీరిస్తారు. ఇదివరకే చెప్పేరు. కాని, మనిషికి పట్టుదలా, అభిమానమూ, వాటినేం చేస్తారు? ఈ స్థితిలో అతని చదువుకు పెళ్ళొక్కటే మార్గం."
"అతడు కట్నం తీసుకోనంటాడు కద!"
"అందుకే పెళ్ళి."
సత్యనారాయణకు అందులో వున్న మెలిక అర్థం కాలేదు. సుపర్ణే వివరించింది.
"అతనికి ప్రథానం అయిన అమ్మాయికి వాళ్ళ నాన్నగారు నాలుగెకరాలు యిచ్చేరన్నారు కాదూ?"
"ఊ. ఇస్తానన్నాడు."
"ఆమె కూడా మొన్న మార్చిలో బి. ఎస్. సి. అయింది. ఇద్దరూ వెళ్ళి యూనివర్సిటీలో చేరుతారు. కావాలని కోరుకున్న వాడు కదా. తండ్రి యిచ్చేదాంట్లో రెండెకరాలు అమ్మితే కనీసం యిరవై వేలు వస్తాయి. మొగుడూ, పెళ్ళాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసుకోడమే కాదు. డాక్టరేట్ చేయాలనుకొన్నా కొంత దూరం ఈడుస్తుంది."
కూతురు ఆలోచన బాగానే వున్నదనిపించింది.
"కాని, ఒప్పుకుంటాడా?"
"మీరు నచ్చచెప్పడంలో వుంటుంది. అభిమానం వుండడం మంచిదే. కాని, అది మూర్ఖత్వం కాకూడదు."
సత్యనారాయణ సాలోచనగా తలవూపేడు.
పదిహేనో ప్రకరణం
అలారం గణగణలాడుతూంటే రామారావు వులికిపడి లేచేడు. నాలుగయింది. అనేక ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మనస్సుకి విశ్రాంతి లేదు. నిద్ర పోయినట్లే అనిపించడం లేదు. కాని తప్పదు. పాల సప్లయిదార్లు హోటలు వాళ్ళని లొంగదీయడం కోసం ఊళ్ళోవాళ్ళ మీద సమ్మె ప్రారంభించేరు. రోజూ నారాయణ తన ఇంటికి పంపే పాలతో తనకూ పంపుతున్నాడు. నిన్నటి నుంచి వాళ్ళ యింటికే పాలు లేవు. వారితో పాటే తనకూ లేవు. ఇంక తనతో పాటు వాళ్ళ కోసం కూడా గవర్నమెంటు పాలబూత్‌కు పోవాలి. ఆ క్యూలో గంటో, అరగంటో నిలబడవలసిందే. తప్పదు. లేచేడు.
తీరా పాలబూత్‌కు వెళ్ళేసరికి అక్కడ విచిత్రమైన దృశ్యం కనబడి తెల్లబోయేడు. బూత్ ముందు మూడు నాలుగు గజాల దూరం వరకూ ఓటి డబ్బాలూ, సీసాలూ, చిన్న పెద్ద రాళ్ళూ వరసగా పేర్చివున్నాయి. పెద్దవాళ్ళంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకొంటున్నారు. కుర్రవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి గొడవ చేస్తున్నారు. "ఇవన్నీ ఏమిటి?"
అవన్నీ క్యూలో నిలబడవలసిన వాళ్ళ ప్రతినిధి స్వరూపాలని చెప్పి డాక్టరు చలపతిరావు పక్కున నవ్వేడు.
"రాత్రి పదిగంటల వేళ కనకయ్యగారు వచ్చి, ఒక స్టీలు పాత్ర పెట్టి పొద్దిటి క్యూలో తన స్థానం నిరుకు చేసుకున్నాననుకున్నారు. కాని, తెల్లవారగట్ల వచ్చి చూసుకొనేసరికి గిన్నె లేదు. దానితో ఆయన స్థానమూ పోయింది. అప్పటినుంచీ వచ్చిన వాళ్ళంతా తమ కోసం, తమ మిత్రుల కోసం ఆ విధంగా స్థానాలు నిరుకు చేసుకుంటున్నారు."
రామారావు నవ్వేడు. అయితే ఆ సమస్య అంత సులభం కాదు. ఆ సీసా ఎవరిది? ఈ రాయి ఎవరిది? తనదేనని ఒకడంటే కాదనడానికి సాక్ష్యం ఏమిటి?
ఇదో కొత్త బెడద. డాక్టరుకూ, అక్కడే ఉన్న మరో పదిమందికి ఏమీ తోచలేదు. ఆ రాళ్ళన్నీ పాత్రలయి ముందుకు నడుస్తే చివరనుండే తమకు పాలు రావు.
"అరలీటరు కన్న ఎక్కువ ఎవరికీ పొయ్యరనేసరికి ప్రతి మనిషీ నాలుగైదు గిన్నెలతో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళకి పట్టుకెళ్ళాలన్నారు. ఎవరికి కావలిస్తే వారే వస్తారనీ, రావాలనీ ఆ సహకారబుద్ధిని భగ్నం చేశాం. మళ్ళీ ఇప్పుడిదో బెడద." అన్నాడు డాక్టరు.
"సరిపడేంత సరుకు వచ్చేవరకూ ఈ బెడదలు తప్పవు." అన్నాడు రామారావు.
"అయ్యా! వూళ్ళల్లో పాలు లేకనా? ఎవరికి వాళ్ళే మింగుడుగాళ్ళుగా తయారయ్యారు. లంచాల కోసం పాలు కలెక్టు చేసేవాళ్ళు మీటరుకి రావడం లేదని రైతుల్ని ఏడిపిస్తూంటే వాళ్ళు పాలు పొయ్యడం మానేసేరు. లేకపోతే ఈ దరిద్రం ఏమిటండి?" అన్నాడు, కనకయ్య.
పాల కలక్షన్ కేంద్రాలలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎంతోసేపు సాక్ష్యంమీద సాక్ష్యం విన్నా, ఇక్కడ వోటి సీసాల, డబ్బాల యజమానుల్ని గుర్తించడం ఎల్లాగో ఎవరికీ తేలలేదు.
"ఇంకా పాలు రాలేదు కదా. అప్పుడే తేలుతుంది, చూద్దాం." అన్నాడు, డాక్టరు.
మరో పదినిమిషాల్లోనే తేలిపోయింది.
దూరంలో లారీ హెడ్‌లైట్లూ, మోతా వినిపించినట్లయింది. అంతవరకూ ఆడుకుంటున్న కుర్రాళ్ళంతా బర్రున వచ్చేసేరు. డబ్బాలూ, సీసాలూ గుర్తించడంలో పేచీ వచ్చింది. ఆ తోపులాటలో అన్నీ చెదిరిపోయాయి. కొన్ని వందలున్నాయనిపించిన రాళ్ళ స్థానంలో పదిహేను ఇరవయిమంది వున్నారు. వాళ్లంతా ఒకరినొకరు అత్తుకొని నిలబడ్డారు. తోసుకుంటున్నారు.
"ఒరేయి కుర్రాళ్ళు. మీ గిన్నెలు ఎక్కడికీ పోవుగాని, అక్కడుంచి దూరంగా నిల్చోండి. వరసగా వెళ్ళి తెచ్చుకుందురుగాని."
రామారావూ, మరో యిద్దరు ముగ్గురూ కలిగించుకుని, చెప్పి, బలవంతపెట్టి గిన్నెలు కింద పెట్టించడం మహాకష్టం అయింది. గిన్నెలు క్రింద పెట్టేరుగాని వాని పక్కన కాపలాగా తాము నిలబడవలసిందేనన్నారు. తమ గిన్నె స్థానం మారుతే?
కాని, గిన్నెకు సరిపడిన చోటు మనిషికి చాలదు. తోసుకుంటారు. ఆ గలాభాలో గిన్నెలు తన్నేసుకుంటారు. మళ్ళీ వానిని యథాస్థానంలో వుంచాలి. కాని, దేని తరవాత ఏది?
ఇప్పుడదే జరిగింది.
"ఇది నా చోటు" అంటున్నాడు ఒకడు.
"వీడు నా తరవాత వచ్చేడు" అంటాడు రెండోవాడు.
తన్నుకుంటున్న ఇద్దర్నీ చెరోచేత్తో పట్టుకొని రామారావు గుంపులోంచి వారిని బయటకు తెచ్చేడు.
"మీ గిన్నెలు ఏమీ అవవు. కూర్చోండి. బుద్ధిగా."
కాని, వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాలేదు. గిజాయించుకొంటూంటే కోప్పడ్డాడు.
"మీరు గొడవ మానకపోతే మీ గిన్నెలు చివర పెట్టేస్తాం." అని బెదిరించేడు, డాక్టరు.
"ఎందుకు పెడతావేం?"
ఆ ఏకవచన ప్రయోగానికి డాక్టరు కంగు తిన్నాడు.
"రెండుచ్చుకోండి, మహా ఎగురుతున్నాడు"—అని రంగాచారి టీచరు సలహా యిచ్చేడు.
ఆ గొడవా, గంద్రగోళం, గిజాయించుకోడం, ఎదిరించడం చూస్తూంటే రామారావుకు చిరచిరలాడుతూంది. ఒక్కటుచ్చుకోవాలనిపించింది. కాని, నిగ్రహించుకున్నాడు. శిక్షణ మంచిదా, చెడ్డదా అన్న సందేహం కాదు. అది తేలేదీ, చచ్చేదీ కాదు. పెద్దవాళ్ళు వచ్చిపడతారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. అదీ భయం. అందుకు నిగ్రహం.
అయితే ఇక వానిని పట్టుకోలేదు. వదిలేసేడు. వానితో రెండోవానినీ వదిలేసేడు.
"తేల్చుకోండిరా, బాబూ! తేల్చుకోండి. మీ బాబులు ఇంట్లో ఏమన్నా మిగుల్చుకున్నారేమో హాస్పిటళ్ళకీ, డాక్టర్లకీ పోద్దురుగాని"
"మీ బాబు ముల్లె దాచిపెట్టేవు—" అంటూ ఆ కుర్రాడు ఎదుర్కొనే సరికి అంతా తెల్లబోయేరు.
"ఈ కాలం కుర్రాళ్ళని కదిలించి లాభం లేదు"—అన్నాడు, కనకారావు.
"ఎవరి బుల్లోడేం?" అని ఆడాళ్ళలో చర్చ.
వ్యవహారం ముదురుతున్నదని గ్రహించి మిగతా కుర్రవాళ్ళు గప్‌చిప్‌గా సర్దుకొన్నారు.
తన ఎదుర్కోలుతో అంతా సద్దుమణిగినట్లుండడం ఆ కుర్రవానికి ధైర్యం ఇచ్చింది.
"నా గిన్నె ఇక్కడ కాదు. నా సీసా ఇంకా చాలా ముందు పెట్టుకున్నాను"
—అంటూ ముందుకు బయలుదేరేడు.
డాక్టరు చలపతిరావు మండిపడుతున్నాడు. ఒక్క కేక పెట్టాడు. "ఆ"—
ఆ కేకకు కుర్రవాడు నిలబడిపోయేడు.
"వెళ్ళు చూస్తా. నువ్వూ, నీ గిన్నే కూడ ఈ చుట్టుపక్కలుండరు."
కుర్రవాడు ఆ కంఠస్వరం విని హడలిపోయేడు. దిక్కులు చూసేడు. అంతక్రితం అందరూ నిశ్శబ్దంగా తన వీరత్వాన్ని మెచ్చుకున్నారనుకొన్నాడు. వాళ్ళు ఇప్పుడూ నిశ్శబ్దంగానే వున్నారు. ఒకరి ముఖంలోనూ మెచ్చుకోలు కనబడలేదు. అభిమానం వేసింది. నిలబడ్డపాటున ఏడ్చేసేడు.
రామారావు వాని భుజంమీద చెయ్యివేసి సముదాయించబోయేడు.
"ఏడుపెందుకు? నీ గిన్నె ఎవరూ తియ్యరులే. కూర్చో."
ఆ ఓదార్పు విరుద్ధ ఫలితం ఇచ్చింది. వాడాతని చేయి విదిలించేసేడు.
"నా గిన్నె తీసేస్తారు. నా కొడుకులు." అంటూ ఏడుస్తూనే పదడుగులు వేసేడు. అవసరమైనంత దూరంలో వున్నట్లు తోచేక బూతులు తిడుతూ పరుగు ప్రారంభించేడు.
నలుగురూ నిర్ఘాంతపోయేరు. చెయ్యగలదేమీ లేక ఫక్కున నవ్వేరు.
ఆ నవ్వులు ఆగక పూర్వమే ఆ కుర్రవాని తల్లీ తండ్రీ రంకెలూ, బొబ్బలూ పెడుతూ రంగం మీదికి వచ్చేరు.
"మా వాడి గిన్నె తీసి పారేసిన నా కొడుకు ఎవరు?"
"ఆళ్ళకి పిల్లల్లేరా? మావోణ్ణి కొట్టేడంట! ఆడింట పీనుగెళ్ళ!"
ఈ జంట కవిత్వం చెవిని బడగానే వ్యవహారం ముదిరిందని అంతా గ్రహించేరు. రామారావు ఎదురెళ్ళి "తొందరపడకండ"ని ఆ జంటని సముదాయించ బోయేడు.
"ఎవరయ్యా నువ్వూ. తొందరపడ్డామా? కుర్రాడినల్లా కొట్టేస్తే?"
ఆ మనిషి గుర్రం మీద లేడని, మన లోకంలోనే వున్నాడని గ్రహించేక సమస్య కష్టం అనిపించలేదు.
"మీ కుర్రాడు ఏం చెప్పేడేం?"
తన సుపుత్రుడు చెప్పింది ఆద్యంతం అబద్ధమని తేలేక అతడు తెల్లబోయేడు.
"ఏరా?"—అని కొడుకును నిలేసేడు.
"మీరు కుర్రాడి మాట పట్టుకొని దెబ్బలాటకొచ్చేరు. కనుక్కోవలసిందే. కనుక్కుని మరీ హడావిడి చేస్తే బాగుండేది. అలా చెయ్యలేదు. మీ అలుసు చూసుకొనే మీవాడు అబద్ధాలు చెప్పగలిగేడు. ఇక్కడ మిగతా కుర్రాళ్ళతో పేచీ పడింది మీవాడు. విడతీస్తే నానా కూతలూ కూసిందీ మీ సుపుత్రుడు. అయినా తనని ఎవరో కొట్టేసేరని అమ్మనీ నాన్ననీ సాయం తెచ్చుకున్నాడు. మీరెప్పుడూ అతనికా సాయం ఇస్తూనే వున్నారన్న మాట. అందుకే అంత ధైర్యం"—అని రామారావు తండ్రిని నిలేసేడు.
మిగిలినవాళ్ళు ఆడ, మగ కూడ తలోవేపునుంచీ అదే మాటలంటూంటే ఆ పెద్ద మనిషి బిక్కచచ్చిపోయేడు. సిగ్గనిపించింది. ఆ సిగ్గును కమ్ముకొనేందుకు కొడుకు మీద పడిపోయేడు.
ఇప్పుడింకో సమస్య. ఆ కోపంతో కుర్రవాడిని చంపెయ్యకుండా నలుగురూ ఆపవలసి వచ్చింది. తండ్రి చేతుల్లోంచి కాపాడడానికి కుర్రవానిని తల్లి దగ్గరకు తీసుకుంది.
"పాలు దొరక్క ఇక్కడికి పంపుతే ఈ గొడవలు…."
అక్కడున్న వాళ్ళదే తప్పంటున్నట్లు అనిపించి రంగాచారి వప్పచెప్పేడు.
"మీ పెంపకం సరిగ్గా వుంటే చిల్లర గొడవలు సర్దుకోవచ్చమ్మా!"
"మేం వచ్చిందీ పాలకే."
"మీవాడు చేసిందీ, తిట్టిందీ చాలనట్లు మీరూ, మీ ఆయనా మీ చిట్టినాయనకు సాయం వచ్చేరు"—నలుగురూ నాలుగు వేపులనుంచి అంటూంటే, ఆమె తెల్లబోయింది.
"మేము దెబ్బలాటకు రాలేదండోయ్" అంటూ కుర్రవానినీడ్చుకుంటూ భర్త వెనకే వెళ్ళింది.
పదహారో ప్రకరణం
ఈ గంద్రగోళానికంతకూ మొదట వినిపించిన లారీ పాల లారీ కాదు. ఇసకో, ఇటికలో పట్టుకొని అది తన దారిన పోయింది. జనం మళ్ళీ సర్దుకున్నారు.
ఈ గలభాతో రామారావుకి చిరాకనిపించింది. పొద్దుటే లేచి, తిట్లాటలూ, కొట్లాటలూనా? ఆ మాటకి వస్తే ఒక్క పొద్దుటే నేమిటి? రోజంతా తగువులు పెట్టుకోవలసే వస్తూంది. లేకుంటే విస్తట్లోకి అన్నం రాదు.
"ప్రతి చిన్న వస్తువు కోసం తగువులాటే. అడిగిన ఖరీదు యిచ్చి ఎదుటివాళ్ళతోనో, పక్కవాళ్ళతోనో కయ్యమాడితే తప్ప పావులీటరు పాలు రావు. రాళ్ళు కలపని బియ్యం దొరకవు. ఛెస్. వెధవ బతుకు."
డాక్టరు చలపతిరావు అంగీకరించేడు.
"ఆనక వెళ్ళి పంచదార కార్డు కోసం రూపాయో, రెండో ముడుపు చెల్లించుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి."
అక్కడ చేరిన వారెవరికీ ఇంకా ఆ గొడవ అందినట్లులేదు. నాలుగు దిక్కులనుంచి ప్రశ్నలు—పంచదార కార్డేమిటి? మార్పించుకోవడం ఏమిటి?
డాక్టరు గంభీరంగా నలుగురి ముఖాలు చూసి ప్రారంభించేడు.
"ఏముందీ. నిన్న సాయంకాలం పేషంట్లనెవరినో చూడ్డానికి బయలుదేరబోతూంటే మా గృహదేవత సడెన్‌గా "పంచదారండోయ్" అంది. సరే, తప్పుతుందా? తిరిగి వచ్చేటప్పుడు మార్కెటు దగ్గర ఆగి మా షావుకారుని అడిగా. కోటా వచ్చిందట. కాని, ఇవ్వవద్దని అధికారుల నుంచి తాఖీదు. ఇప్పుడున్న కార్డులన్నీ రద్దు చేశారట. కొత్తవి తెచ్చుకోవాలి—అన్నాడు. అదేమిటయ్యా అంటే అది అంతే నన్నాడు. పత్రికల్లో వెయ్యలేదే అన్నా. తొందరేమిటండి—బాబూ! వేస్తే కాస్త ఊపిరేనా తీసుకోకుండా తెల్లవారేసరికే వచ్చి కూర్చుంటారనుకొని వుంటారు. వేస్తారు ఎప్పటికో—అన్నాడు. ఇంతకీ అర్థాంతరంగా ఈ మార్పెందుకు కావలసి వచ్చిందో తెలుసా?"—అని నలుగురి ముఖాలూ పరీక్షగా చూసేడు.
"కార్డుకో రూపాయో రెండో వడుక్కోవాలి అనిపించి వుంటుంది."—అన్నాడు రంగాచారి టీచరు.
"అది లోపాయికారీ మాట. పైకి అల్లా చెప్పగలరా? రిక్షా లాగే వాళ్ళూ, అంట్లు తోముకు బతికేవాళ్ళూ సంపాదించుకొన్న పావుకిలో, అరకిలో కార్డులు అమ్ముకుంటున్నారుట. అసలు తినేవాళ్ళకి చాలడం లేదట. మనం నష్టపడుతున్నామనీ, మన కోసమే ఈ బాధ అంతా…." అన్నాడు, డాక్టరు.
"బద్మాష్‌లు, రిక్షా వాడు టీ తాగడు! వాడికేం అక్కర్లేదు!"
"వేగన్లకు వేగన్లు బ్లాక్‌మార్కెటు చేస్తూంటే అడిగే నాధుడు లేడు. పావుకిలో పంచదార పనిచేసుకు బతికే మనిషి అమ్ముకున్నదని నిఘా."
"ఈదో సందులో మిల్లుల వాళ్ళూ, కోటాల వాళ్ళూ, తలా పిడికెడూ పంచుకొంటారు."
ఆ ఊహలకు అంతులేదు. చర్చలకు అంతులేదు. ఎప్పటిలాగే ఇప్పుడూ పాపం ప్రజల సమస్యలు పట్టించుకోడంలేదని రాజకీయ పార్టీల మీదకు తిరిగింది.
"ఇది వరలో యిటువంటి పనులకి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పూనుకునేవారు."—అన్నాడు డాక్టరు.
అర్ధోక్తిలోనే అదేం లాభం లేదన్నాడు, రంగాచారి.
"వాళ్ళలో ఎవరు తప్పు చేస్తున్నారో తమ పార్టీ ఏ పనీ చెయ్యకుండా చేతులు ముడుచుక్కూర్చోవలసి వస్తూందో తేల్చుకోవడానికే వాళ్ళకి ఎంత టైమూ చాలడంలేదు. ఈ సంగతేదో చూడండర్రా బాబూ అంటే వాళ్ళ పేచీలకు మూలం ఎక్కడుందో మనం వినవలసి వస్తూంది…."
"మీరు చెప్పింది చూశారూ….డాక్టరుగారూ! అది బతికున్న రోజులనాటి మాట. జీవత్సు తాతపాదేషు…." అని నిట్టూర్పు విడిచేడు రంగాచారి.
అందులో అసత్యం ఎంతో లేదనిపిస్తున్నా తన అభిమాన పార్టీ తిట్లు తినడం రామారావుకు ఒప్పిదం కాలేదు.
"మనం కూడా కదిలితే తప్ప పార్టీలు ఎన్ని పనులకి కదులుతాయి? మనం చేసుకోవలసినవి ఎవరి భుజానికో ఎత్తి వాళ్ళు చెయ్యలేకపోయారనడం అందరం నేర్చుకున్నాం." అన్నాడు.
పదిహేడో ప్రకరణం
పెద్దవాళ్ళ సమస్యలకి ఏమాత్రం తగ్గవు పిల్లకారు సమస్యలు. వాళ్ళకేసి ఓ చెవి పడేసి వింటున్న రామారావు సంజ్ఞ చేయడంతో పెద్దవాళ్ళు తమ సంభాషణ నిలిపేరు.
అందరూ ఒక్కమారు ఊరుకోడం చూసి, "ఏమిటది?"—అన్నాడు కనకయ్య.
పక్కనే డ్రైనేజీ గొట్టాలమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పిల్లవాళ్ళవేపు తల ఎగరేసి, రామారావు మాట్లాడవద్దని సంజ్ఞ చేసేడు.
"ఇంకేం లాభం లేదురా. ఈవేళ టి. సి. ల మీద సంతకం పెట్టితే గానీ మేం కదలం, మిమ్మల్ని కదలనియ్యం అని కూర్చోవలసిందే…." అంటున్నాడు ఓ కుర్రాడు.
"టి. సి. లు కావలసిన వాళ్ళం వున్నదల్లా ముగ్గురం."
"పెట్టనంటే ముగ్గురం ఏం చేస్తాం?"
"నిన్న క్లాసులో వాళ్ళతో చెప్తే వాళ్ళంతా వొస్తామన్నా"రన్నాడు మొదటి కుర్రాడు.
పత్రికలూ, ప్రభుత్వాలూ, నాయకులూ గగ్గోలుపెట్టి బుడి బుడి దీర్ఘాలు తీస్తున్న "ఘెరావో" బెజవాడలో ప్రత్యక్షం కాబోతూంది.
ఏ కార్మికులదో, వుద్యోగులదో ఆలోచన కాదది. పది పన్నెండేళ్ళ పిల్లలు! పిలక పట్టుకోడానికి సిధ్ధమైతే తప్ప తెమలని సమస్యలే వాళ్ళవీ.
"ఏం వొచ్చిందిరా గురునాథం!" అని అడిగేడు కనకయ్య.
"వీళ్ళ నాన్నగారు ఎలక్ట్రిక్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారండి. ఈ మధ్యనే రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారు." అంటూ గురునాధం ఒక కుర్రవాడిని పరిచయం చేశాడు.
"ఔనండి, వారం నుంచి టి. సి. కోసం అడుగుతున్నా యివ్వడం లేదండి. మళ్ళీ రాజమండ్రిలో సీటు లేకుండా పోతుందని కూడా చెప్పుకున్నానండి."
"ఏమంటారు?"
"కొత్త హెడ్మాస్టరు వచ్చి ఇస్తారంటారండి."
"తానేమయ్యాడు?"
"ఈయన్ని కృష్ణలంక కేశారట. ఇంకా వెళ్ళలేదు. కొత్తాయన రేపే వచ్చినా ఆయన మాత్రం ఇస్తారా? అన్నీ సర్దుకోవాలని ఆయన వాయిదా వేస్తారండి."
"ఎల్లాగ? ఔను. అంతా ఒక బడిలో చదువుకున్నవాళ్ళేగా."
ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేకపోయారు. రంగాచారి సూచన చేసేడు.
"మీ నాన్నగారే వెడితే పని జరుగుతుందిరా."
"ఆయన డ్యూటీలో జాయినయిపోయారండి. వూళ్ళోలేరు."
"ఇంత చిన్న పనికి, పనిమాలా ఆయన రాజమండ్రి నుంచి రావాలా!" అని రంగాచారి ఉక్రోశం ప్రకటించేడు.
తాను చేయవలసిన చిన్న పనిని ఎగకొట్టి ఒక సమస్యను సృష్టిస్తున్న హెడ్మాస్టరును నలుగురూ బూతులతో ఆశీర్వదించేరు.
"కుర్రవాళ్ళలో అవిధేయత ప్రబలిపోయిందని ఆ గావుఏడ్పులేడ్చేది ముందు వీళ్ళే." అన్నాడు డాక్టరు.
"ఏడ్చేరు." అనేసేడు, రామారావు బహు నిర్లక్ష్యంగా. ఆ కుర్రవాళ్ళని చూస్తే అతనికి ఎంతో ఆనందమనిపించింది.
"మనకంటె కుర్రాళ్ళు తెలివిగా వున్నామనిపిస్తున్నారు. వాళ్ళకి ఈ ఘెరావో ఆలోచన ఎవరు చెప్పేరు? జీవితం! అవసరం! ఘెరావో అంటే ఇదేనని కూడా వాళ్ళెరగరు. వాళ్ళామాటే విని వుండరు. కాని, నీతీ నిజాయితీ లేనివాళ్ళని దారిలో పెట్టేందుకు…."
మాటల సందడిలో దగ్గరకు వచ్చేవరకూ పాల లారీని ఎవ్వరూ గమనించనే లేదు. దాని హోరులో రామారావు మాటలు వినిపించలేదు. అంతా గొల్లున లేచేరు.
"డాక్టరుగారూ! లేవండి. క్యూ చెదిరిపోకుండా కాస్త చూద్దాం." అని రామారావు ముందుకొచ్చాడు.
"తప్పుతుందా? మళ్ళీ ఎవరో అమ్మ వచ్చి ఆశీర్వదించేదాకా…." అంటూ డాక్టరు లేచేడు.
క్యూలో మొదటి స్థానం మిగుల్చుకొన్న కనకయ్య ముందుకెళ్ళాడు.
పాలకాన్ లు లోపలికెళ్ళి పదినిమషాలయినా పంపిణీ ప్రారంభం కాలేదు. బడ్డీలో మాటలు వినిపిస్తున్నాయి. ఆడవాళ్ళూ, చిన్నవాళ్ళూ కిటికీకేసి ఎగబడుతున్నారు.
విషయం తెలుసుకునేందుకు బూత్ లో కెళ్ళిన కనకయ్య తిరిగి రాలేదు.
దాక్టరు వెళ్ళి వచ్చేడు.
"పాల కాన్లలో పాలు తక్కువ వున్నాయి. కనీసం పది లీటర్లేనా తగ్గినట్లున్నాయి. ముదరా నే నెక్కడిచ్చుకోనని ఏడుస్తున్నాడు."
"వాడివ్వడం ఎందుకు?"
"ఇంకెవరిస్తారు? కాన్ లు ఒప్పచెప్పినట్లు సంతకం చేయించుకొని పోయుంటారు." అని రంగాచారి వూహ మీద వివరించేడు.
"ఎల్లా తగ్గుతాయి?" అని మళ్ళీ రామారావు అమాయిక ప్రశ్న.
"ఎల్లా తగ్గడం ఏమిటి స్వామీ! దార్లో ఆఫీసర్ల ఇళ్ళకి తలో రెండూ, మూడూ లీటర్లు పట్టి ఇచ్చేసుండవచ్చు. లేకపోతే డ్రైవరూ, లారీతో వచ్చే గుమాస్తా చెరో నాలుగు లీటర్లూ వొంచేసుకోవచ్చు. మన భారతదేశంలో ఎల్లా జరిగిందన్న ప్రశ్నకి అర్ధం లేదు." అంటూ డాక్టరు కనుబొమలు ముడేసేడు.
కనకయ్య వచ్చేడు.
"కాన్‌లు యిచ్చినట్లు వాళ్ళు సంతకం చేయించుకు పోయారు. కనక వాళ్ళకింకేం బాధ్యత లేదు. అడంగుని ఎన్ని పాలు కాన్‌లో నింపేరో రికార్డు వుంటుంది. పాలు తగ్గినట్లు సాక్ష్యం ఏమిటి? నువ్వే అమ్ముకుని డబ్బులు జేబులో వేసుకున్నా"వంటారు.
అంతా దిగాలుపడి కూర్చున్నారు. యింకా పాలపంపకం ప్రారంభమే కాలేదు. ఇళ్ళవద్ద బోలెడు పనులు.
"కొంచెం కొంచెం తగ్గించి పొయ్యమంటే"—అన్నది రంగాచారి సూచన.
"ఖరీదు మామూలుగా తీసుకొనా?"—అని ఒకరు అభ్యంతరం చెప్పేరు.
"అర లీటరు, పావు లీటరులో ఇంకా కొరవా?" అన్నది వేరొకరి అభ్యంతరం.
రామారావు ఒక సూచన చేసేడు.
"కాన్‌లలో పాలు కొలుద్దాం. ఎన్ని వున్నాయో లెక్క వ్రాసి అందరం సంతకాలు పెట్టి ఇద్దాం."
"విచారణ తతంగానికి పనులు మానుకుని పరుగులెత్తుతుండాలి." అన్నాడు డాక్టరు. కాని అంతకు మించి ఆ క్షణంలో చెయ్యగలది లేదు.
నలుగురూ ఆ మాట చెప్పి దిలాసా ఇవ్వడానికి బూత్ వేపు కదిలేరు.
పద్ధెనమిదో ప్రకరణం
మధ్యాహ్నం సత్యనారాయణ, రామారావు గదికి వెళ్ళేడు. కూతురు చెప్పిన ఆలోచన ఆయన మనస్సుని దొలుస్తూంది. కాని గదికి తాళం వుంది.
"రామం వూళ్ళో వున్నాడా అమ్మా!" అంటూ సుశీలను పలకరించేడు.
"రాండి, బాబయ్యగారూ!" అంటూ సుశీల మంచం మీదనే లేచి కూర్చుని అహ్వానించింది.
"ఆయన ఇప్పుడే వీధిలోకి వెళ్ళేరనుకుంటా. ఇంతవరకూ రామలింగేశ్వరరావుగారనుకొంటా….ఆయన కొలీగు—ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే వున్నారు."
"ఆహా." అంటూ సత్యనారాయణ సావట్లో అడుగు పెట్టేడు.
"నీ కాలుకి దెబ్బ తగిలిందంది సుపర్ణ. ఎల్లా వుంది?"
"కూర్చోండి బాబూ! పెద్ద ప్రమాదం తప్పిపోయింది." అంటూ మహాలక్ష్మమ్మ లోగుమ్మంలోంచి సమాధానం ఇచ్చింది.
"ఎదో ఆ ఏడుకొండలవాడి దయ. తల్లీ, పిల్లవాడూ పెద్ద దెబ్బలేం తగలకుండా బయటపడ్డారు."
"అంతే లెండి. కాకపోతే మనదేముంది?" సత్యనారాయణ అమోదించేడు.
"దేవుడు తప్ప మనకీ దేశంలో రక్షణ లేదనే నిర్ణయానికి మీరూ వచ్చేరేమిటి బాబయ్యగారూ!" అంటూ సుశీల నవ్వింది.
సత్యనారాయణ తెల్లబోయేడు.
"తప్పు, తప్పు." అంటూ మహాలక్ష్మమ్మ కూతురు అవిశ్వాసానికి తాను లెంపలు వేసుకుంది.
"కూర్చోండి, బాబయ్యగారూ. ఈవేళ భాగ్యలక్ష్మి రాలేదు. ఏం చేస్తూంది."
"నేనూ చూడలేదమ్మా! వాళ్ళ ప్రిన్సిపాల్‌ను కలుసుకోవాలంది. వెళ్ళిందేమో."
సుశీల మాట మారుస్తూ రామారావు వుద్యోగం పోయిన వార్త చెప్పింది.
"ఉన్న చిన్నపాటి వుద్యోగం కాస్తా పోయింది. చాల యిదైపోతున్నారు."
"కాదు మరీ. చదువు తప్ప మరో ఆధారం లేదు. దానికిదీ గతి."
అసలు చదవడమే దండగమారిపని అన్నట్లు అనిపించింది.
"మరీ అన్యాయంగా వుంది మన వాళ్ళ ప్రభుత్వం. చదువుకొన్నవాళ్ళు దేశానికి పెద్ద ఆస్తి. దేశంలో ప్రతి ఒక్కళ్ళకీ చదువు వుంటే బాగుంటుందనుకొంటూ రెండోవేపున వున్నవాళ్ళని వుపయోగించుకోలేకపోవడం…."
"గవర్నమెంటు మాత్రం ఏం చేస్తుంది?"
""యావత్తైలం తావద్వ్యాఖ్యానం" చేతిలో వున్న డబ్బును ఖర్చు చేస్తుంది. దానికో పరిమితి వుంది కదా, చేసినంతవరకు ఎక్కువ లాభకరంగా వుండేలాగ చూసి చేస్తుంది."
సుశీల అతని వాదాన్ని ఒప్పుకోలేదు.
"ఉన్న డబ్బు అంటారు. డబ్బు వచ్చే వనరులన్నీ ఎవరెవరి చేతులకో వప్ప చెప్పెయ్యడం. అదిచాలదన్నట్లు జనం దాచుకున్న డబ్బు కాస్తా వాళ్ళని దోచేస్తున్న వాళ్ళకు వొప్పచెప్తున్నారు. ఇంకా మిగిలితే మనువర్తులు పంచిపెడుతున్నారు."
"అంటే—బాంకులు స్వాధీనం చేసుకోవాలి. వర్తక వ్యాపారాలు చేత పట్టుకోవాలి. మహారాజులకిచ్చే భరణాలు ఆపెయ్యాలి." అంటూ అతివాద పార్టీలు దేశ ప్రభుత్వం చేయాలంటున్న పనులను ఎకసక్కెం చేస్తూ సత్యనారాయణ నవ్వేడు.
"ఔను. ఏం చెయ్యకుండా మీ కంట్రాక్టర్లకి బిల్లులు ఎల్లా చెల్లుతాయనుకొన్నారు? ఈ ప్రాజెక్టులు పూర్తవడం ఎల్లాగ? ఇంజనీర్లనీ, పనివాళ్ళనీ తగ్గిస్తారు. అవి పూర్తి కావడానికి మరో నాలుగేళ్ళు పడుతుంది. వాటి ఖర్చు ఈవేళ పూర్తయితే అయేదాని కన్న రెట్టింపు తేలుతుంది. మీరు ఏం పొదుపు చేసినట్లు?"
సత్యనారాయణ కాంగ్రెసువాది. కంట్రాక్టరు. నాగార్జునసాగరు కాలవల తవ్వకాలతో ఆయనకు కంట్రాక్టు వుంది. రమారమీ మూడు నాలుగు లక్షల రూపాయల బిల్లులు రావలసివున్నాయనీ, మనిషి ఆర్థిక ఇబ్బందులలో వున్నాడనీ నిన్ననే సుపర్ణ చెప్పింది.
తన ప్రయోజనం నెరవేరాలన్నా ప్రభుత్వం తను సమర్థించబోయిన పధ్ధతికి భిన్నంగానే వ్యవహరించడం అవసరం. అది అర్థం అయినా సత్యనారాయణ ఒప్పుకోలేకపోయేడు.
"వ్యవధి కావాలమ్మా! ఓర్పుండాలి. దేశం ఒక్కరోజులో సర్వసంపన్నం కాగలదంటావా? ఇదేం గారడీయా. కళ్ళముందు సాయిబాబాలా బూడిదరాసులు కుమ్మరించడానికి?"
"కాదు. తెలుసు. వ్యవధి కావాలి. సరే. ఎంత? ఓర్పుండాలి. ఎందుకు? మీరు ఏం చెయ్యదలుచుకున్నారు?"
"ఇందిరాగాంధీ చెప్తూంది, అంతక్రితం నెహ్రూ చెప్పేడు. సోషలిజం మా లక్ష్యమని. అందుకే ఈ పని అనీ…."
"ఏది వుద్యోగాలు ఊడపీకడమా? ఇదిగో, బాబయ్యగారూ! గాడిదను చూపించి గుర్రం అనుకోమంటే అమాయకులూ, అజ్ఞానులూ కొంతకాలమేనా నమ్ముతారు. కాని ఆ గాడిద మీద కూర్చుని జెట్ విమానంలో ప్రయాణం చేస్తున్నామనుకోమంటే ఎల్లాగ? మీ ఇరవయ్యేళ్ళ సోషలిజం సాధన తర్వాత రామారావుగారి వంటి వాళ్ళని వీధిలో పారేస్తుంటే…అది."
"ఏం చెప్తావమ్మా!" అని సత్యనారాయణ నవ్వేసేడు.
"మీరే చెప్పండి. మీరు చెప్పే వోర్పుకి హద్దేమిటి?"
"నిజమే అనుకో."
"ఆయన వంటి స్థితిలోనే వున్న విద్యావంతులు నేటికి దేశంలో కొన్ని లక్షలున్నారు."
"నువ్వెన్ని చెప్పు. కాని ఒక్కటి మరవవద్దు. మన దేశ జనాభా ఎంత? అందులో ఈ నిరుద్యోగుల సంఖ్య ఏపాటిదంటావు."
ఆ లెక్క పధ్ధతికి సుశీల చిరునవ్వు నవ్వింది. వెంటనే సత్యనారాయణ సర్దుకున్నాడు.
"ఒక ఖండమంత దేశం. పెద్ద ఎత్తున జరుగుతున్న పునర్నిర్మాణం. పెద్దవో, చిన్నవో వెనకబాట్లు రాకుండా వుంటాయా? ఆ తాత్కాలిక నష్టం, కష్టం చూపించి ఏమీ జరగలేదనడం…."
సుశీల తన తప్పును గ్రహించింది. దేశ సమస్యల్ని వ్యక్తి పరిమితం చెయ్యబోతే వచ్చే ప్రమాదం అది. కాని ఆ వోటమిని ఆమె అంగీకరించలేదు. కొన్ని లక్షలమంది బతుకులయెడ కనబరచిన నిర్లక్ష్యాన్ని మాత్రమే గణనకు తీసుకొంది.
"సోషలిజం సర్వత్రా ఏర్పడే అవకాశం వున్నప్పుడు, అందుకోసం ప్రపంచ జనాభాలో సగం మంది చచ్చిపోయినా మా బాగే నన్నాడట మావో. మీరయితే కొద్ది లక్షలమంది నిరుద్యోగం మాత్రంతో తృప్తి పడుతున్నారు. పెద్ద చూపూ, చిన్న చూపూ తప్ప తేడా ఏమీలేదు."
మావోతో తనను పోలిక పెట్టడం గర్వకారణమనుకోవాలో, అపఖ్యాతి అనుకోవాలో సుశీల స్వరం పట్టి అర్ధం కాలేదు. నవ్వేసేడు.
సుశీల తన ధోరణిలోనే మరో అడుగు ముందుకు వేసింది.
"చచ్చిపోవలసిన జనాభా సగం మందిలో తానూ ఒకడు కావచ్చునని మావో అనుకొని వుంటాడా?"
"ఎవరు మాత్రం అనుకొంటారు? నేనూ, పిల్లలూ బాగుంటే మొగుడు లోకంతోపాటూ—అనే సామెత ఊరకే పుట్టలేదు. ప్రతివారూ తాను బతకాలనీ, తాను సుఖపడాలనీ, తనవాళ్ళు బాగుండాలనే కోరుతారు…." అంటూ మహాలక్ష్మమ్మ ట్రేలో డ్రింకు గ్లాసులు పెట్టుకొని వచ్చింది.
"మరి బాబయ్యగారు ఎందుకు వచ్చేరనుకొన్నావు. తన వాడి వుద్యోగం పోయిందని విన్నారు. ఆ లక్షల మందిలో ఈయనొకరని వూరుకోగలిగేరా? తీసుకోండి బాబయ్యగారూ."
"ఈ ఎండలో వుడుకు కాఫీ ఇవ్వకుండా డ్రింకు ఇచ్చేరు. బాగుంది."
"ఇవ్వాలనుకున్నా కష్టమే"
"మీకూ పాలవాళ్ళ సమ్మె బాధేనా."
"అది ప్రారంభమే మా యింట్లోనండోయ్."
సత్యనారాయణ డ్రింక్ సిప్ చేస్తూ సాలోచనగా అన్నాడు.
"ఎవరు బాధపడుతున్నారన్నా మనస్సుకి ఎల్లాగో వుంటుంది. తప్పదు. మన చేతిలో ఏం వుంది? ఏ ఒక్కడికన్నా సాయపడగలమా? వట్టి భ్రమ. సానుభూతి చూపుతాం. చిన్న సలహా యిస్తాం."
"అది మాత్రం ఎంతలో వుంది?" అంది మహాలక్ష్మమ్మ వుదారంగా.
సత్యనారాయణ లేచేడు.
"అతడు రావడం ఆలస్యం కావచ్చు. వచ్చి వెళ్ళేనని చెప్పండి. తీరిక చేసుకుని ఓమారు కనిపించమన్నానని చెప్పండి."
సత్యనారాయణ వెళ్ళిపోయేక మహాలక్ష్మమ్మ కూతురుని కోప్పడింది.
"మనిషి యింటికి వస్తే చాలు మీ రాజకీయాలూ, రగడలూయేనా! ఏం మనుషులర్రా! ఇల్లా తయారవుతున్నారు."
పంధొమ్మిదో ప్రకరణం
"మామయ్య ఎందుకో రమ్మన్నారుట. ఇంట్లో వున్నారా?" అంటూ రామారావు హాలులో అడుగుపెట్టేడు.
సోఫాలో కూర్చుని రేడియో వింటున్న భాగ్యలక్ష్మి ఆ పలకరింపు విని ఉలికిపడి తల ఎత్తింది.
"నువ్వా" అంది, ఆశ్చర్యంతో, రేడియో కట్టేస్తూ.
"అయివుంటుంది. నేనేనేమో." రామారావు ఎగతాళి చేస్తూ సోఫాలో కూర్చున్నాడు. భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
"గుర్తు పట్టేవే."
భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది.
"గుర్తు పట్టలేనంతగా కళ్ళు మూసుకుపోలేదు—" అంటూ చర్రున లేచింది.
"రక్షించేవులే. కూర్చో."—అని ఆమెను చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టేడు.
"నన్ను గురించి మీ ప్రిన్సిపాల్ కు ఎన్నో అబధ్ధాలు చెప్పేవుట. ఎన్నో ఆరోపణలు చేసేవుట. ఏమవసరం వచ్చింది."
అతని కంఠస్వరం విని భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
"నేనా?"
"ఎవరు రామం?"—అంటూ సుపర్ణ హాలులోకి వచ్చింది.
రామారావు కంఠస్వరం వెంటనే మారింది. స్నిగ్ధంగా చూస్తూ—థేంక్స్—" అన్నాడు. సుపర్ణ వేపు తిరిగి "మామయ్య లేరా!"—అన్నాడు,
"వస్తాడు కూర్చో."
"ఎందుకీవిడగారు కోపంగా ఉన్నారు?"—అన్నాడు కన్నెగరేస్తూ.
"నేనేం కోపంగా లేను."
సుపర్ణ చిరునవ్వుతో మాట దాటించ ప్రయత్నించింది.
"రిట్రెంచిమెంటు కత్తిరింపులో నువ్వూ పడ్డావుట కాదూ.’"
ఆ మాటకు సమాధానంగా రామారావు భాగ్యలక్ష్మిని ఆట పట్టించేడు.
"అయితే నీ కోపం కాలేజీ కమిటీ మీదనన్నమాట! బాగుంది. థాంక్స్."
భాగ్యలక్ష్మి చర్రుమంది.
"నీకుద్యోగం వుంటే నా కొరిగేదీలేదు. పోతే తరిగేదీలేదు."
"ఓహో, అలాగునా. అంత నిర్మమత్వం ఉన్నదానివి నాకు వుద్యోగం ఇమ్మని ఆవిడతో ఎందుకు సిఫార్సు చేసేవు."
అతని కళ్ళు నవ్వుతూంటే భాగ్యలక్ష్మి ఉడుక్కుంది.
"నేనేం నీకోసం చెప్పలేదు. ఆ మధ్య లెక్కల టీచరు కావాలనుకున్నారు. తమరు ఖాళీ అయ్యేరు ఉన్నారు, చూసుకోండి—అన్నాను, అంతే."
"అందుకే థాంక్సు అన్నాను, మరి కోపం చేస్తావేం."
"నాకేం థేంక్సు చెప్పక్కర్లేదు," అంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
"దానినల్లా రెచ్చగొడతావెందుకు?"—అని సుపర్ణ గదిమింది.
"థేంక్సు చెప్తే కోప్పడుతూంది. చూడు, నేనేం చెయ్యను."—రామారావు అసహాయత నటిస్తూ నవ్వేడు.
"నీకు నవ్వెల్లా వస్తూంది?"
"నీతో ఎట్లా మాట్లాడగలుగుతున్నాను?" అంటూ ఆమె ముఖం వంక చూసేడు, సుపర్ణ గమ్మునైపోయింది.
"దేనిమీదనూ పెద్ద మమకారం పెంచుకోకూడదు సుపర్ణా! బతకలేం. అంటీ ముట్టనట్లుంటే తప్ప మనశ్శాంతి సాధ్యం కాదు."
"పెద్ద వేదాంతివయ్యేవు"—అంది సుపర్ణ చెల్లెలు వెళ్ళినవేపే చూస్తూ.
"జీవితం! సుపర్ణా! జీవితం"—అన్నాడు, జీవితాన్నంతనూ వాడి వడపోసినంత గంభీరంగా.
"మరిప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు"
"నిజం చెప్పమంటావా? ఏమీ చెయ్యాలనిపించడం లేదు."
"మరి?"
"ఈ నాలుగేళ్ళ సంపాదనలో మిగిలించింది పదిపన్నెండు వందలుంది. అదయిపోయే లోపున ఏదో ఒకటి తోచక పోతుందా యని ధైర్యం!"
సుపర్ణ దిగ్భ్రమ చెందినట్లు చూచింది.
"చాలా పెద్ద మొత్తమే!"
"నా బతుక్కి అదేమంత చిన్న మొత్తం కాదు. కూర్చుని తింటే నాలుగైదు నెలలు నిరాఘాటంగా సాగిపోతుంది. తరవాత చూద్దాం."
"నాలుగు అయిదు నెలలే మన జీవితావధి అన్నట్లు మాట్లాడుతున్నావు."
"మనదేశపు సగటు ఆదాయం లెక్కన అది ఒక మనిషికి నాలుగైదేళ్ళ ఆదాయం తెలుసా? లేకపోతే నలుగురి సంవత్సరాదాయమన్నా అనవచ్చు."
"ఈ కష్ట దినాలలో ఒక్కరు నలుగురి ఆదాయాన్ని జేబులో వేసుకోకూడదు. పాపం"—అంది సుపర్ణ ఎగతాళిగా.
"అన్యాయమే. అందుకే సోషలిజం స్థాపనకు నాందిగా ప్రభుత్వం నాబోటిగాళ్ళని ఉద్యోగాల నుంచి స్వస్తి చెప్పింది."
ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దం అయిపోయేరు. లోపలినుంచి మంగమ్మ వచ్చింది. కూతురు కబుర్లేసుకున్న వ్యక్తిని చూసేక ఒక్క క్షణం మొగం వివర్ణం అయింది. అంతలో సర్దుకుని ఆప్యాయంగా పలకరించింది.
"ఎంతసేపయిందయ్యా వచ్చి? ఎక్కడా కనపడ్డమే మానేశావు." అంటూ తానో కుర్చీ లాక్కుని కూర్చుంది.
"అదేమిటే సుపర్ణా! వచ్చిన పెద్దమనిషికి కాఫీయేనా ఇస్తావా. కబుర్లు చెప్పి పంపేస్తావా?"
ఆమె ముఖ్యమైన అభ్యంతరం కాఫీ ఇవ్వకపోవడం కన్న, కూర్చోబెట్టి కబుర్లు చెప్పడమేనని ఇద్దరూ గ్రహించేరు. సుపర్ణ లేచింది.
"నాన్నగారు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళేరు. నువ్వొస్తే ఉండమని చెప్పమన్నారు. వెళ్ళిపోకు."
"అల్లాగేలే."
సుపర్ణ వెళ్ళిపోయేక మంగమ్మ అడిగింది.
"ఏం కథ?"
"తెలియదు".
మంగమ్మ ఆ మాట నమ్మలేదు కాని పైకి తేలలేదు. లోకాభి రామాయణం వాడేసింది. రెండు మూడు నిముషాల లోపల సుపర్ణ మగడు పెద్ద వుద్యోగస్థుడనీ, బాగా సంపాదిస్తున్నాడనీ అతని దృష్టికి తెచ్చింది.
"ఆయన్ని నువ్వు చూడనే లేదనుకుంటా."
"లేదు. పెళ్ళి నాటికి నేను వూళ్ళో లేను."
"మనం ఆ పేరు చెప్తేనే హడలి చచ్చే సబినస్పెక్టర్లూ, సర్కిలినస్పెక్టర్లూ ఆయన ఎదట అగ్గగ్గలాడుతూ నిల్చుంటారు. ఆ భోగం చెప్పలేం. ఏమయినా అను. ఆడదానికి అదృష్టం ఉండాలి, అనుకో."
మంగమ్మ ఆ ప్రసంగం ఎందుకు తెచ్చిందో రామారావు ఎరుగును. కాని ఆమె ఆశించినట్లు అతడు వుడుక్కోలేదు. ఆమె మాటలకు సంపూర్ణామోదం తెలిపేడు.
"సందేహం ఏముంది?"
"మా అత్తగారు అంటుండేవారు. జిల్లా కలెక్టరు పెళ్ళాం అవుతుందనే వారు. చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో గాని."
"ఆమెకు గొప్ప వాక్శుద్ధి ఉంది."
"నిజం చెప్పేవు."
"ఓ మాటు నా భవిష్యత్తు గురించి చెప్పేరు. జ్ఞాపకం ఉందా?"
"గుర్తు లేదోయ్, ఏమన్నారు?"
"గొప్పగా చెప్పేరులే. 'కరతల బిక్షా, తరుతల వాసః’’' నీ బ్రతుకు అంతకన్న మించదురా—అన్నారు. నాకిప్పటికీ గుర్తు."
రామారావు కంఠధ్వనిలో వెక్కిరింత గాని, కష్టం పెట్టుకున్నట్లుగాని సడి దొరక్కపోయినా మంగమ్మ కంగారుపడింది. అతని ముఖంలోనూ ఆ ఛాయలు కనబడలేదు. నమ్మలేకుండా వుంది. అత్తగారి తోడ్పాటు లేకపోతే రామారావుతో సుపర్ణ పెళ్ళి తప్పించడం సాధ్యమయ్యేది కాదని మంగమ్మ నమ్మకం. ఆ ఘట్టాలు జరిగి ఇంకా అయిదేళ్ళు కాలేదు. అవేమీ జరగనట్లూ, జరిగినా వానితో తనకేమీ సంబంధంలేనట్లూ రామారావు మాట్లాడడం నమ్మతగిందిగా తోచలేదు.
"ఎప్పుడేనా కోపం మీద ఏదన్నా అన్నారేమోగాని, ఆమె మనస్సు చాలా మంచిదోయ్."
అత్తగారు బ్రతికి ఉండగా ఆమె విషయంలో మంగమ్మ అంత సద్భావం కనబరచిన సాక్ష్యం లేదు. ఈ సదభిప్రాయానికి మూలం ఏమిటో రామారావు ఎరుగును. అందుచేత ఆశ్చర్యపడలేదు.
"ఆమె మనస్సు మంచితనం నేనెరగనా. ఆ రోజుల్లో మీరు చెప్తుండే వారు అందుచేతనే, ఆ వాక్శుద్ధి…."
ఆ రోజుల్లో అత్తగారిని గురించి తాను ఏం చెప్పేదో మంగమ్మ మరిచిపోలేదు. రామారావును హుషారు చెయ్యడం అవసరమనిపించింది.
"శుభ్రంగా వుద్యోగం చేసుకొంటున్నావు. నెలకో మూడు నాలుగు వందలు తెచ్చుకుంటున్నావు. నీకు లోటేమిటయ్యా."
రామారావు అట్టహాసంగా నవ్వేడు. అప్పుడే డ్రింక్సు తీసుకొని హాలులోకి వస్తున్న సుపర్ణ ఆ నవ్వు విని నిలబడిపోయింది.
"నాకేదో లోపం అని కాదు. ఆవిడ వాక్శుద్ధికి ఉదాహరణ నేనేననడం మనస్సులో కష్టం పెట్టుకుని కాదు. ఏ గుమ్మంలో భిక్ష ఆ గుమ్మంలోనే వేసుకొంటావన్న మాటకి ఆధునిక పాఠమే మేస్టరీ. అసలు ఉద్యోగాలన్నీ ఇంచుమించు అంతే. ఏదో మీ అల్లుడిగారివంటివి చాలకొద్ది. ఈ ఉద్యోగాల వాళ్ళంతా అంతే. కరతల భిక్షా. తరుతల వాసః. ఏమంటావు సుపర్ణా! గొప్ప సత్యం."
సుపర్ణ గ్రహించింది. అతని మనస్సులో చాలా ఆందోళన ఉంది. పైకి కనిపిస్తున్న ప్రశాంతి వట్టి నటన.
"పోదూ. పాడు ఉద్యోగం. అదిపోతే ప్రపంచమే పోయినట్లు మాట్లాడతావు." అంటూ సుపర్ణ అతనిని గదిమింది.
"మంచి గదులలోనే
సంచరిస్తాయి మీ ఊహలు
అన్నాడు శ్రీశ్రీ. నువ్వు అదృష్టవంతురాలివి సుపర్ణా."
దాని తరువాతి చరణం గుర్తువచ్చి సుపర్ణ తెల్ల బోయింది.
ఎంతో ఇబ్బందిగా తయారవుతున్న సంభాషణ సత్యనారాయణ రాకతో తేలిపోయింది.
"ఎంతసేపయిందోయి వచ్చి?"
"మీరు అల్లా వెళ్ళేరు, వచ్చేడు." అంది భాగ్యలక్ష్మి.
ఆమె అక్కడకు వచ్చినట్లే గమనించి ఉండని రామారావు తిరిగి చూసేడు.
"ఆ మాట చెప్పనేనాలేదేం?"
"చెప్తే వెంటనే వెళ్ళిపోయివుండే వాడివా?"—అంది భాగ్యలక్ష్మి.
"నన్ను ఆపాలనే చెప్పలేదన్నమాట."
"ఈ యింట్లో నువ్వు పరాయివాడివా ఏమిటోయ్. నువ్వంటే అందరికీ ఇష్టమే."—అంది మంగమ్మ.
రామారావు డ్రింకు తాగి గ్లాసు బల్లమీద పెడుతూంటే సుపర్ణ చటుక్కున అందుకుంది.
సత్యనారాయణ లోపలికి దారి తీసేడు.
"రా. పైకిపోదాం."
ఇరవయ్యో ప్రకరణం
ఒకే విమూఢస్థితిలో మేడ దిగి వచ్చేడు, రామారావు. తాను సత్యనారాయణ వద్ద అంగీకరించినది నీతిబద్ధమో, నీతిబాహ్యమో అతనికి అర్థం కావటం లేదు.
కట్నం కోరరాదనేది తన నియమం. కాని, ఇదేమిటి? తనకు స్థిరపడిన కన్యకు తండ్రి రాసి ఇవ్వగల భూమిని అమ్మించి ఆ ధనంతో తన చదువు పూర్తి చేసుకొనాలని ఆలోచించడం ఆ నియమానికి అనుగుణమా?
ఆ భూమి కోసం—ఆ కన్యమీది ఆసక్తితో మాత్రం కాదు—తాను ఇంతవరకూ వాయిదావేస్తూ వచ్చిన పెళ్ళికి తొందరపడడం నీతి బాహ్యమని మనస్సు ఎదురు తిరుగుతూంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆమె అనుకుంటుందనే కాదు. వాస్తవం అదే కదా! ఏదో ఉద్విగ్నస్థితిలో, ఎవరి మీదనో కసితో, ఎప్పటికేనా తప్పదుకదా యని, వివాహానికి ఆనాడు వొప్పుకొన్నాడు. కాని, ప్రదానం చేసుకోడం దశ దాటి ముందుకు అడుగు వెయ్యలేకపోయాడు. వధువు చదువు పూర్తికాకపోవడం. తన చెల్లెలి పెళ్ళి అవసరం కొంతకాలం అతనిని ఆదుకున్నాయి. ఆమె చదువు ఒక దశకు వచ్చింది; చెల్లెలు పెళ్ళి అయింది. కాని అతడు ఉత్సాహం చూపలేదు. వధువుకు ఉన్నత విద్యావసరం పేరున మరల వాయిదా కోరేడు. గతంలో తను ప్రేమించిన కన్య ఉన్నత విద్యకని వెళ్ళి తనను మరిచిపోయినట్లే ఈమె కూడా తప్పిపోతుందని ఆశ అతనిది. ఈ సంబంధం తప్పిపోవాలనే తాను కోరుతున్నాడు. అయితే ఆ మాట తప్పేననే అప్రతిష్ట చుట్టుకోకుండా బయటపడాలని తన ఆశ. కాలయాపనతో పనిలేకుండా తన ఆశ నెరవేరే అవకాశం ఇప్పుడుంది. సెంటు భూమి లేక, వున్న వుద్యోగం ఊడి, కాని సంపాదన లేని తనకు కూతురునిచ్చి పెళ్ళిచేసే ఉత్సాహం హనుమంతరావుకు ఉండదు. తెలిసో, తెలియకో, తన చెల్లెలు ప్రోత్సాహం వల్లనో తనను కోరుకొన్న జయప్రదకూ ఈ దశలో యిదివరకటి పట్టుదల ఉండదు—తాను బయట పడడానికి, ఈ వుద్యోగం పోవడం ఒక విధంగా సాయపడుతుందను కుంటూంటే—ఇప్పుడీ మెలిక. తనను పునరాలోచింప చేస్తున్న ఈ సంబంధం తన భవిష్యత్తుకి సోపానం కావచ్చు. కాని, ఇది తన నైతిక ధర్మదీక్షను గబ్బు పట్టించేస్తుందే! ఆ అమ్మాయి పట్టుదల అలాగే వుంటే తన సంసిద్ధత చూసి హనుమంతరావు పెళ్ళి చేయవచ్చు. కాని, భూమి అమ్మడం, దానితో చదువుకోవడం ప్రతిపాదన విని ఆ భూమిని కూతురుకు వ్రాయకపోవచ్చు. అప్పుడేమౌతుంది? తనదే కాదు. ఆ అమ్మాయి భవిష్యత్తూ చెడుతుంది కనక పెళ్ళికి ముందు ఆ భూమి రాసివ్వాలనేది ఒక షరతు కావాలి. తప్పదు. తానంత సుముఖంగాలేని అమ్మాయితో పెళ్ళి. తన నియమానికి భంగకరంగా కట్నం కోరడం వంటిదే ఆ షరతు. తనలోని ఈ లొసుగుకు అభిమానపడి ఆ అమ్మాయి తనమీద అపనమ్మకంతో భూమి అమ్మడానికి నిరాకరిస్తే? అసంభవం కాదు. మళ్ళీ పెళ్ళిముందే దానిని అమ్మి తీరాలని షరతు పెట్టాలి. అప్పుడు కూడా దానిని ఆమె పేరనే బ్యాంకులో పెట్టకూడదు. తనకూ అధికారం ఉండే లాగ యిద్దరి పేరనా పెట్టించాలి.
సత్యనారాయణ ఎన్నోవిధాల నచ్చచెప్పినా రామారావుకి ఈ ఏర్పాట్లు ఒప్పందం కాలేదు. అయితే ఏదో మూల ఆశా కనిపించక పోలేదు. ఈనాటి దుర్భర స్థితి నుంచి బయటపడడానికి లేదా దుర్భర నైతిక పరిస్థితి నుంచి బయటపడాలంటేనూ ఈ ప్రయత్నమే తోడ్పడవచ్చుననిపించింది. కన్యా వధువుతో ఈ విషయం పూర్తిగా చర్చించనిదే ముందుకు అడుగు వెయ్యకుండేందుకు సత్యనారాయణ చేత ఒప్పించడం ఒక గొప్ప విజయం అనుకున్నాడు. ఈలోపున సత్యనారాయణ తన ప్రయత్నాలు చేస్తాడు.
కాని, మెట్లు దిగుతూంటే మళ్ళీ సందేహం. తాను కూడదనుకున్న పనిని చర్చకు పెడతాననడం మాత్రం విజయమా? ఆ అమ్మాయిని కలుసుకోడం ఎల్లాగ? ఏదో ఎవరో బంధువులింట పెళ్ళికి ఆమె ముంగండ వెళ్ళిందని తన చెల్లెలు వ్రాసింది. ఎప్పుడు వస్తుంది? ఎల్లా కలుసుకోడం? ఎల్లా మాట్లాడడం?
ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ హాలులోకి వచ్చేసరికి భాగ్యలక్ష్మి ఎదురయింది. ఆమెను చూడగనే తనను గురించి ప్రిన్సిపాలుకు అభ్యర్థించిన సమాచారం మనస్సుకు వచ్చింది. అంతక్రితమే ఆమె ఆలోచనలు తనకు తెలుసు. ఈ ఘటన ఆమె మీద ఆప్యాయతను పెంచింది. మొదట అది తెలిసేసరికే తాను మరొకరికి అతుక్కు పోయేడు. విడుదల అయ్యే అవకాశం వచ్చేసరికి మళ్ళీ ఈ మెలిక. దీనితో తాను మరీ అతుక్కుపోవడమో, నిరుద్యోగంతో వివాహార్హతనే కోల్పోవడమో! తన చిత్ర పరిస్థితి తోచగనే నవ్వొచ్చింది. నవ్వుతూనే ఆమెను అభినందించేడు.
ఆ అభినందన భాగ్యలక్ష్మికి కోపం తెప్పించింది.
"ఉద్యోగం పోయినా నీకు విరగబాటు తగ్గలేదు."
"నీబోటిది సాయం ఉండగా…."
"హు—సాయం"—భాగ్యలక్ష్మి ముక్కి, చర్రున లేచింది.
రామారావు మరింత నవ్వేడు.
"జీవితం ఓ చిత్ర విచిత్రాల కథ భాగ్యం!"
ఆ సంబోధనకు ఆశ్చర్యంతో తిరగబడి చూసింది. "భాగ్యం." అన్నమాట ఆమె పెదవులుదాటి బయటకు రా నిరాకరించింది.
ఇరవయ్యొకటో ప్రకరణం
అప్పుడే హోటలునుంచి వచ్చి చదవడానికి పేపరు తీసుకున్నాడు. వీధిలో పిలుపు—"మేష్టారూ?"
"ఇలా"—అంటూ రామారావు వెళ్ళి తలుపు తీసేడు. వీధి దీపం ఉన్నా క్రీనీడలో ఎవరో తెలియలేదు.
"నేనండి, బలభద్రాన్ని."
అయినా అర్థం కాలేదు. లోపలికి ఆహ్వానించేడు.
దీపం వెలుతురులో గుర్తు తెలిసింది. తమ కాలేజీలోనే పి. యు. సి. పాస్ అయ్యాడు. మానేసేడు. తాను చేసుకోదలచిన అమ్మాయికి ఏదో బంధువు.
"నువ్వుటోయ్! గుర్తు తెలియలేదు. బాగున్నావా?" అని కుశల ప్రశ్నలు వేసేడు.
"ఇంట్లో అమ్మగారు లేరా"—అని ఎదురుప్రశ్న వేస్తూ, బలభద్రం సిగ్గుతో ఒక కవరు అందించేడు.
"మీరు తప్పక దయచేయాలి."
కవరు అంచులకున్న పసుపు మరక చూస్తూనే, రామారావు చిరునవ్వుతో "పెళ్ళా యేమిటోయ్!" అన్నాడు.
బలభద్రం సిగ్గుపడ్డాడు. లోపలి శుభలేఖ చూసి రామారావు సంతోషం తెలిపేడు.
"కంగ్రాట్యులేషన్స్. బాగుంది, పిల్ల పేరు విజయలక్ష్మా! ఏమన్నా చదువుకుందా?"
"మెట్రిక్ చదువుతూందండి."
ఇటీవల తెలుగు దేశంలో ఆడపిల్లలవాళ్ళూ—మగపిల్లల వాళ్ళూ రెండోవారు ఏం చదువుతున్నారని ప్రశ్నించడం మామూలు అయింది. దానితో జనం ట్యుటోరియల్ స్కూళ్ళకి ఎగబడడం మొదలెట్టేరు. ఏం చదువుతున్నావంటే మెట్రిక్ అనొచ్చు. అబద్ధం చెప్పేవనలేదు. దానికో ప్రవేశ పరీక్షంటూ లేదుగనక, ఇంగ్లీషు అక్షరాలు గుర్తుపట్టడం నేర్చుకుంటున్న వానిది కూడా తక్షణ గమ్యం మెట్రికే. ఏ అమెరికాకో ప్రయాణంకట్టి బెజవాడలో రైలెక్కిన వాడు కూడా "స్టేట్స్"కే వెడుతున్నానంటాడు.
చదువు గురించి మరి రామారావు తరచలేదు.
"కట్నం ఏమాత్రం ఏమిటి?"
"ఏమీ లేదండి. ఆ పేరు చెప్తే వొప్పుకోనన్నాను."
"చాలా మంచిపని చేసేవు. బాగుంది."
అంత విశాల, దృఢాభిప్రాయం తెలిపిన ఆ కుర్రవానికి ఇంకా యిరవయ్యేళ్ళేనా వుండవు. తెనుగుదేశపు కుర్రకారులో అటువంటి ఉదాత్త భావాలు వ్యక్తమవుతున్నందుకు చాల ఉత్సాహం కలిగింది. అయితే తన చదువే ఇంకా ప్రారంభదశలో వుంది. అటువంటప్పుడు చదువు ఇంకా ప్రారంభమేనా కాని పిల్లని పెళ్లిచేసుకొంటున్నాడు. ఈ తొందరేమిటనిపించింది.
"మీ నాన్నగారు బాగా సంపాదించారనుకుంటా, ఏం చేస్తుంటారు?"
"వ్యవసాయమేనండి, అదీ ఎక్కువ కాదు. మాకున్నది మూడెకరాల చిల్లర. నలుగురైదుగురు పిల్లల్లో నేనే పెద్దవాణ్ణండి."
అనేక ప్రశ్నలు వేసి రాబట్టిన ఈ సమాచారం విన్నాక, రామారావుకు మరింత ఆశ్చర్యం కలిగింది. వయసు వస్తున్న దశలో కను ముక్కు తీరు చూసి మిగతా ప్రపంచం మరిచివుంటాడనిపించింది.
"అమ్మాయి నచ్చిందా?"
బలభద్రం వెంటనే జేబులోంచి ఓ కవరు తీసి అందించేడు.
"అమ్మాయి చక్కగా వుంది." అన్న మెచ్చుకోలుకు బలభద్రం ఉబ్బి తబ్బిబ్బయిపోయేడు.
"అవునండి."
"మీ మామగారు ఏం చేస్తుంటారు?"
"పెద్దగా ఏం లేదండి."
"ఆస్తి బాగా వుందనుకుంటా."
"అదీ ఏం లేదండి. పది పన్నెండు ఎకరాలు వుంటుందేమో."
"బావమరుదులు?"
"ముగ్గురండి. ఇద్దరు కూతుళ్ళు."
"వాళ్ళేమన్నా వుద్యోగాల్లో వున్నారా?"
"పెళ్లికూతురే పిల్లలలో పెద్దది."
పాతికేళ్ళుదాటినా పెళ్ళంటే తనకు అనిపిస్తున్న భయం వీనికెందుకనిపించడంలేదు. రామారావుకి ఆశ్చర్యంగా వుంది.
"మా నాన్నగారికి నాచేత మెడిసిన్ చదివించాలని వుందండి. అందుకే ప్రీ – ప్రొఫెషనల్ కోర్స్ లో చేరేనండి."
"మంచిదే. ఈ రోజుల్లో బి. ఏ. లూ, ఎం. ఏ .లూ కావడం కన్న, ఇంజనీర్లు కావడం కన్న మెడిసిన్ చదవడం మేలు. ప్రాక్టీసు పెట్టుకు బ్రతకొచ్చు. ఆయన ఆలోచన మంచిదే."
"కాని, మేమంత సాగగలవాళ్ళం కామండి."
"మరి."
"మా కాబోయే మామగారి తండ్రిగారు రెండు మూడు డొనేషన్ కాలేజీలకు ఏజంటు. పేరు వినే వుంటారు. పట్టాభిరామయ్యగారని. ఆయన సీటు ఇప్పిస్తానన్నారు. డబ్బు కట్టనక్కర్లేదు. ఆయనే చూసుకొంటారు."
"సీట్ దొరికితే చదువు అయిపోతుందా? మరో పాతిక వేలేనా అవదూ"
"ఆ అమ్మాయి పెత్తల్లి వాళ్ళవద్ద పెరుగుతూంది. వాళ్ళు వున్న వాళ్ళు. అభిమాన పుత్రిక. కాకినాడ వాళ్ళది. చదువు చెప్పించడం తమరు చేస్తామన్నారండి."
"గట్టి వాడివే."
"లేకపోతే బి.ఏ. కన్న చదవలేను. వుద్యోగాలు దొరక్క బాధపడుతున్న ఈ రోజుల్లో బి.ఏ. మొహం ఎవరు చూస్తారు?"
తానే స్వయంగా నిదర్శనం. రామారావు నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు.
కాని, అనేక ఆలోచనలు.
బలభద్రం ఏర్పాటు కట్నంగా భావించవచ్చునా! ఇప్పుడు తాను అదే స్థితికి రావడంతో ఆ విషయాన్ని తేల్చుకోడం అత్యవసరంగా కనిపించింది.
యిప్పుడే కాదు. ఇంతకు పూర్వమూ యిటువంటి ఘట్టం వచ్చింది. సత్యనారాయణే చదివిస్తానన్నాడు. కాని, తానే ఒప్పుకోలేదు. పోయి ఉద్యోగంలో చేరేడు. డబ్బు కూడబెట్టి తానే చదువుకోవాలని ఆశ. నాలుగేళ్ళయింది. ఒక్క ఏడాది చదువుకు కావలసినది కూడా సమకూడ లేదు. ఇప్పుడా వుద్యోగం పోయింది. ఆ అమ్మాయీ చెయ్యిదాటి పోయింది. తన నియమ నిష్ఠ తన జీవితాన్నే దెబ్బ తీసింది. ఆ దృష్టితో చూస్తే, బలభద్రం చేస్తున్నది తెలివైన పనే అనిపించినా మంచిదనిపించడం లేదు.
ఆ అమ్మాయి తండ్రి కాలేజీ సీటు యిప్పించలేకపోతే. ఆమె పెత్తల్లిగారి వాళ్ళు సాయం చెయ్యలేకపోతే? రెండు, మూడు కుటుంబాల మధ్య అగ్నిహోత్రమే కద. అంతకన్న కట్నం నిర్ణయించుకొని వసూలు చేయడం సుఖం కదా.
ఆ ఆలోచన అనిపించేక తన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేడు. తన కాబోయే భార్యకు పరిస్థితులన్నీ చెప్పి, అన్ని ఏర్పాట్లూ అందరికీ అంగీకారమయి, స్పష్టం అయితేనే పెళ్ళికి సిద్ధం కావాలి. ఎక్కడా ఏ మాత్రం లొసుగు పనికిరాదు. ఆ నిర్ణయానికి వచ్చేక "బలభద్రం" అని పిలిచేడు.
"అయ్య."
"నిద్ర పోలేదా?"
"కొత్త చోటు కాదాండి."
"మీ జయప్రద ఎక్కడుంది?"
"స్పష్టంగా తెలియదండి? వాళ్ళ వూరెడుతున్నా. తెలుసుకు రాయమంటారా? కాని, నా పెళ్ళికి వస్తుందండి. పెళ్లికూతురావిడ పింతల్లి కూతురే."
"సరే వ్రాయి." అన్నాడు.
మళ్ళీ ఆలోచనలు. ఎదటి పక్షం ఎక్కడ సందేహించినా తన పెళ్ళి నిలిచిపోతుంది. అది తనకు ఇష్టమే. కాని, జీవితంలో చాలా నష్టం.
వాళ్ళు అంగీకరిస్తే తన యిష్టం ఏమంటుంది? ఎన్నడూ వూహించని స్థితి.
మొత్తం మీద ఇష్టం—పెళ్ళి—చదువు—డబ్బు ఇవన్నీ ఒకదానికొకటి పొసగని అంశాలేనా? ఎవరికివారు, తమకు కావలసినవీ, చేతికి అందినవీ ఒక పోగులోంచి లాక్కుని, దానితో తృప్తిపడో, ఏడ్చో, కొట్లాడుతూనో కాలక్షేపం చెయ్యవలసిందేనా?
అతనికి భయం కలిగింది.
ఇరవై రెండో ప్రకరణం
పంచదార కార్డు చేత బట్టుకొని అడిషనల్ తహసీల్దారు ఆఫీసు దగ్గరకెళ్ళేసరికి, ఆ జనాన్ని చూసి రామారావు గుండెలు అదిరిపోయాయి. కొన్ని వందలమంది గుంపులు, గుంపులుగా ఆఫీసు వరండాలలో, ఆవరణలో చెట్ల క్రింద వున్నారు. రోడ్డుమీద వచ్చేటప్పుడు తన పక్కన నడిచిన వాళ్ళేగాని, ఎదురు వచ్చిన వాళ్ళున్నారా, జ్ఞాపకం చేసుకొనేందుకు ప్రయత్నించేడు. ఎక్కువ మంది కనిపించలేదు….ఈ వేళ కాదు. వారం రోజులైనా తనకి కొత్త కార్డు పుడుతుందా? తిరిగి పోదామనిపించింది. మరో రూపాయి అవుతుంది గాని, తాను కొనే పంచదార మాత్రం ఎంతలే అనీ అనిపించింది. అయినా వెనకకు తిరగలేదు. ఓ ప్రయత్నం చేసి మరీ పోదామనుకున్నాడు.
ఆవరణలో కెళ్ళేక వాకబు చేస్తూంటే ఎవరో పలకరించేరు.
"మీరా మేస్టారూ. యిల్లా వచ్చేరు. పంచదార కార్డుకేనా?"
ఆ యువకుడినెక్కడో చూశాననిపించింది. కాని, గుర్తు రాలేదు. అతని వేపు తెల్లబోయి చూస్తుంటే తానే చెప్పేడు.
మరిచిపోయారన్నమాట. ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనలో కాల్పుల రోజున బజారులో మేడమీది నుంచి హాస్పిటలు చేర్పించినది నన్నేనండి." అంటూ నవ్వేడు.
"గుర్తు వచ్చిందా?"
రామారావు సంతోషంతో అతని చేయి పట్టుకుని గిజాయించేడు.
"చాల సంతోషం. గాయాలు మానిపోయాయా?"
"అవి అప్పుడే మానిపోయాయండి. కాని లంజ కొడుకులు కేసుల్లో పెట్టి తిప్పి చంపుతున్నారు."
"ఔనుట. మీ అన్నగారోమాటు చెప్పేరు."
"మీరెవరో నాకు చెప్పిందీ ఆయనే."
"ఆ రోజున మిమ్మల్ని బలవంతంపెట్టి హాస్పిటలుకు చేర్చకపోతే ఈ కేసులుండేవి కాదు గదా. మరి మీకు కోపంగా లేదూ, నా మీద."
"అప్పారావు గాని ఏమయినా అన్నాడేమిటండి." అంటూ అతడు పకపక నవ్వేడు.
"ఆ మూడో అతని పేరు అప్పారావా! రెండు మూడు రోజుల క్రితం బజారులో హోటలు వద్ద చూశా."
"ఏమన్నా అన్నాడేమిటండి. ఏమీ అనుకోకండి సర్! మనిషి మంచివాడు. కాని అదోరకం."
"అర్ధం అయింది. మీరిల్లా మాట్లాడుతున్నారు గాని, ఆయన…."
"పలకరిస్తే కరిచేసుంటాడు" అంటూ నవ్వేడు. "కాని తెలివి తక్కువదనం. మీరేం చేసేరు. మాకు ఏమవుతుందోనని కంగారుపడి హాస్పిటలుకు తీసుకెళ్ళారు. ముండా గవర్నమెంటుది అంతా లాలొచీ వ్యవహారం. ఆ నిరశన వ్రతంగాడు మాత్రం నిజాయితీవాడా. జనం యిచ్చినవే ముప్ఫయి, నలభై వేలు స్నేహితుల ద్వారా దాటించేడుట. పారిపోయేడు. వాడిని నమ్మి ముఫ్పై మంది ప్రాణాలిచ్చేరు. యిది వాస్తవం. మా కేసులు కొసరు. మధ్య తిట్లు మీరు తిన్నారు."
యిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీసు వరండా ఎక్కేరు.
"మీకెవరేనా తెలుసాండి."
"నాతో చదువుకున్న అతడొకడుండాలి మరి. మీరిక్కడే వుండండి. చూసి వస్తా."
రామారావు ఒక్క మారు వరండాలో చుట్టు తిరిగి వచ్చేడు. ఒక కిటికీ వద్ద తాను ఎరిగిన ముఖం కనిపించింది. కాని, పేరు గుర్తు రాలేదు. అతడు తల వంచుకొని తెగ రాసేస్తున్నాడు. పక్కన ట్రేలో రాయవలసిన కార్డుల బొత్తి, పెద్దది కనిపిస్తూంది. మరో రెండు కిటికీల వద్ద కూడా గుమాస్తాలు కనిపించేరు. వాళ్ళవద్దా కార్డుల బొత్తులున్నాయి. పని బహు తాపీగా జరుగుతూంది. లోపలి గదిలో తాశీల్దారు కాఫీ సేవిస్తూ ఫోనులో ఎవరితోనో మాట్లాడడం వినిపిస్తూంది.
ప్రతి ఆఫీసులో కనిపించే వాతావరణమే. చేసేవాడు చేస్తుంటాడు. సాచేసేవాడు సాచేస్తూంటాడు. కనుక్కొనే నాధుడుండడు.
రామారావు వెనక్కి వచ్చి—"మా మిత్రుడున్నాడు. వ్యవహారం తెలుసుకు వస్తాను. మీ కార్డు ఎవరిదగ్గర కెళ్ళిందో చూసొస్తా. వుండండి. అన్నట్లు—మీ పేరేమిటి?"
"శ్యామలరావు"
లోపలికి వెడితే ఎల్లాగోలా యామారి పని చేయించుకోవచ్చుననిపించి, రామారావు గుమ్మంవేపు వెళ్ళేడు.
అతనిలాగే మరికొందరు అక్కడ చేరి వున్నారు. కాని బంట్రోతు వారిని పోనివ్వడం లేదు. అంతమంది తన్ను చూసి జంకుతూ నిలబడి పోతూండడం, తిరిగి పోతూండడం చూస్తుంటే ఆ బంట్రోతుకి దర్పం పెరిగిపోతూంది. తనను అడుగుతున్నవారిని కసురుకుంటున్నాడు.
"పోండయ్యా బాబు! నన్ను సంపితే నేనేం సేసేది? ఎల్లి కూకోండి. దొరవారు నన్ను తిడుతుండారు, ఆ గోలేంటని! నేనే పిలిసి కార్డులిత్తున్నా గంద."
తన వాగ్దానానికి సాక్ష్యంగా బంట్రోతు నాలుగు పేర్లు పిలిచేడు.
"పునుగు చలమయ్య."
"గంటా ఘటోత్కచుడూ."
"బాగోతుల మాణిక్యమ్మ."
"అవిటి లచుమన్నా."
బాబ్బాబు—అంటూ నాలుగుపేర్ల వాళ్ళూ పరుగెత్తి వచ్చేరు.
"ఏమయ్యోవ్! అయినకాడికి రూపాయీ పుచ్చుకొని ఎనకటల్లే అరకిలోయే వేయించావేం." అని మాణిక్యమ్మ పేచీ పెట్టుకుంది.
"అసలిచ్చేరనుకోక మళ్ళీ గునుస్తావేం." అని బంట్రోతు గదిమేడు. ఆమె ఇంకా అరుస్తూనే వుంటే, అసలు రహస్యం బయట పెట్టేడు.
"చూడండయ్యా! ఈవిడేమో పావలాకి, అర్థకీ అమ్ముకుంటుంది. ఇసుమంటోళ్ళ మూలంగానే కావలసినోళ్ళకి దొరకకుండా పోతాంది."
ఆమె పేరు వినగానే రామారావుకు తన మిత్రుని పేరు గుర్తుకు వచ్చింది. "మాణిక్యాలరావు." ఆ పేరు నుపయోగించుకొని లోపల చొరబడ్డాడు. బంట్రోతు వెనకనుంచి కేకేసేడు.
"మూడో నెంబరు టేబులండి."
"తెలుసునయ్యా దేవుడా!"
లోపలికెళ్ళేక తనదొక్కడిదే ప్రజ్ఞ కాదనీ, తనకన్నా ముందో అయిదారుగురు ఆ టేబులు అగల బగల తచ్చాడుతున్నారనీ గ్రహించేడు. అంటే తన మిత్రుడు అంత ఆశ్రిత సులభుడు కాదన్నమాట. ఆ మాట తోచినప్పుడు సంతోషమే కలిగింది.
"నమస్తే."
మాణిక్యాలరావు తల ఎత్తేడు.
"మీరా!"
ఎరిగిన ముఖం కనబడగానే మాణిక్యాలరావు తన బాధ చెప్పుకున్నాడు.
"చచ్చిపోతున్నానండి. వ్రాసినకొద్దీ కట్ట పెరిగిపోతూంది."
"ఇంత హఠాత్తుగా ఈ మార్చడం ఆలోచన ఎందుకొచ్చింది?"
"మార్చాలనుకొన్నారనుకోండి. వార్డు తరవాత వార్డు ఏడిస్తే ఎంత బావుండేది? లేదా వార్డుకో గుమస్తా నిచ్చినా బాగుండును."
"వాళ్ళకా అంత బుద్ధి. అయ్యో." అన్నాడు, రామారావు.
"మేం చెప్పేం. ముప్ఫయి, నలభయి వేల కార్డులు రాయాలంటే నెల రోజులు కూడా చాలదన్నాం."
"అయినా కాదన్నారేం!"
"కాదంటే, అదో అందం. ఓ నెల పంచదార అందకపోతే చచ్చిపోరులే—అన్నాడు ఆఫీసరు."
"అమ్మ బద్మాషు."
ఆ తిట్టుతో మాణిక్యాలరావుకు తెలివి వచ్చినట్లయింది. తాను తొందరపడి ఆఫీసు రహస్యాలు బయట పెట్టేశానని కంగారు పడ్డాడు. చటుక్కున తల వంచి రాతకి తలబడ్డాడు.
రామారావు ఆలోచించేడు.
జనం పొద్దుటినుంచీ ఎండలో మాడిపోతున్నారు. తనకీ కార్డు కావాలి. మళ్ళీ రాత్రి ఊరుకు పోతే ఏమవుతుందో. పోనీ, కొందరు కార్డులు రాయడానికి సాయపడితే పని త్వరగా జరుగుతుందనిపించింది.
"కొన్ని కార్డులు నే వ్రాయనా?"
"మీకెందుకండీ బెడద. మీ కార్డు వీటిలో వుందా?"
"లేదు. కానీ, ఏం వ్రాయలేనా?"
"బ్రహ్మ విద్యా ఏమిటి?"
"మరింకనేం. మరో నలుగురిని లాక్కొస్తా. పని త్వరగా జరుగుతుంది."
"తాసిల్దారు ఒప్పుకోడు." అన్నాడు మాణిక్యాలరావు, తనకభ్యంతరం లేదని సూచిస్తూ.
తాసిల్దారు ఒప్పుకోడన్న మాటకు రామారావులో పట్టుదల పెరిగింది. వెనకటి రోజున కుర్రాళ్ళు గురునాధం మేష్టరును ఘెరావో చెయ్యాలనుకోడం గుర్తు వచ్చింది.
"సాయం చేస్తామంటున్నాం గాని, మరొకటి కాదు కదా. అయినా…."
"అడిగి చూడండి."
అంతలో మరో ఆలోచన తోచింది. తీరాచేసి తాసిల్దారు సరేనంటే వ్రాసేందుకు ఎవరన్నా వస్తారో రారో….అనిపించింది.
అదేదో తేల్చుకొనేందుకు వరండాలోకి వెళ్ళేడు. ఆ సలహా విని శ్యామలరావు సిద్ధపడ్డాడు.
"నేను వస్తా"
"మరో నలుగురుంటే…."
ఇద్దరూ జనం గుంపుల మధ్య తమ ప్రతిపాదన పడేశారు.
"బాబ్బాబు. అల్లాంటిదేదో చెయ్యండి నాయనా. మళ్ళీ పనిమాలా రేపు రావాలంటే చచ్చిపోతాం."
నాలుగువేపుల నుంచీ జనం తమ ప్రతిపాదనను సమర్ధించేరు. కాని వ్రాతగాళ్ళు కావాలనేసరికి గొణుగుడు ప్రారంభమయింది.
"నాయాళ్ళు కలం పెడితే పని జరుగుద్ది గాని, ఊసులాడుతుంటే అవిద్దా?"
"కార్డుకి రూపాయి ఆడు తీసుకోడం, మనం వ్రాయడమూనా?"
"వీళ్ళ వీపులు విమానం మోత మోగిస్తాననక, వాళ్ళకి సాయం చేస్తానంటావే."
అనేక వ్యాఖ్యలు, విసుళ్ళు. కాని, క్రమంగా పదిమంది దొరికేరు.
బంట్రోతు వారిని అడ్డగించబోయేడు. కాని, రామారావు సమాధానం విని, జనంలో రేగుతున్న కోపతాపాలు చూసేక వదిలేసేడు.
"గొడవ సేయకండి. అయ్యగారు కోపం సేత్తారు. నెమ్మది. సద్దు సేయొద్దు."
ఇరవైమూడో ప్రకరణం
కాని, తన పనిలో వేరొకరు చెయ్యి పెట్టడాన్ని తాసిల్దారు మొదటే ఒప్పుకోలేదు. బంట్రోతును కేకేసేడు.
"వీళ్ళందర్నీ ఎందుకు వదిలేవు?"
"చిత్తం. చిత్తం. రాండయ్యా బాబు, రాండి." ఒకళ్ళనో ఇద్దర్నో మాత్రం తీసుకొని బంట్రోతు బయటకు నడిచేడు. రామారావు కదలతలుచుకోలేదు. అంతవరకూ నిల్చున్నవాడు పక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"మీరు వెళ్లిపోండి. నెమ్మదిగా చెప్తున్నా, వినండి." అన్నాడు ఆఫీసరు.
"మేమూ నెమ్మదిగానే అడుగుతున్నాం. మీ పని జరగడం లేదు…."
"ఎల్లా జరిగించాలో మాకు తెలుసు."
"సందేహం ఏముందీ. అందుకే మేం సాయం చేస్తామనడం."
తాసిల్దారుకు మహా కోపం వచ్చింది.
"ఐసే. ప్లీజ్ గెటవుట్!"
రామారావు బిగిసేడు. అతని తోడివాళ్ళు దగ్గరకు జరిగేరు.
"మేం వెళ్ళడానికి రాలేదు సర్! వెళ్ళం. పంచదార కార్డులందరికీ ముట్టందే కదలం. కార్డుకి రూపాయి వసూలు చేయడం ఏమిటో అదీ తేలుస్తాం."
అడిషనల్ తాసిల్దారు ఇల్లాంటి చాతుర్మాస్యలు చాలా చూసేడు. బెదిరింపులేగాని, చివరకి ఒక్కడూ నిలబడడు. అందుచేత నిర్భయంగా తానే ఎదుర్కొన్నాడు.
"పోలీసుల్ని పిలిపించవలసి వుంటుంది."
"ఆ అందం చూద్దాం. పిలవండి. ఆ డ్రాయర్లలో చేరిన రూపాయల దొంతరలూ, ఇంతవరకు ఇచ్చిన కార్డులూ అన్ని సంగతులూ బయట పడడం మంచిదే."
తాసిల్దారు ఒక్క క్షణం ఆలోచించేడు. ఏదో తోచింది. ఫోన్ మీద చెయ్యి వేసేడు.
ఆ క్షణంలో రామారావూ ఆలోచించేడు. ఆఫీసర్లూ, ఆఫీసర్లూ అన్నీ సర్దేసుకొంటారు. వెంటనే ఫోన్ నెత్తకుండా తాసిల్దారు చెయ్యి నదిమి పెట్టేడు.
"తొందరపడొద్దు. నువ్వు పోలీసుకి ఫోన్ చేస్తావు. నేను వీధిలో వున్న జనానికి నీ వ్యవహారం చెప్తా. నీ పోలీసువాళ్ళు సర్దుకు వచ్చేసరికి అరగంటేనా పడుతుంది. ఈ లోపున నిన్ను, నీ ఆఫీసుని, నీ రికార్డుల్ని ఒక్క డబ్బాడు కిరసనాయిలు పోసి అగ్గిపుల్ల గీసేస్తారు. ఏం సరదాగా వుందా?"
రామారావు కుర్చీలోంచి లేస్తూ, రిసీవరును ఒడుపుగా ఒక్క గుంజు గుంజేడు. తాసిల్దారు తెల్లబోయేడు. కొద్దినెలలు క్రితమే ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళన సందర్భంగా నగరంలో జరిగిన భీభత్సాన్ని అతను మరిచిపోలేదు. సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసు స్టేషను అంటించేసేరు. హోటళ్ళు తగలపెట్టేరు….ఒకరు చెప్పనక్కర్లేకుండా జనం వీధుల్లోకి వచ్చేసేరు. ఇక్కడ అల్లాకూడాకాదు. పొద్దుటి నుంచి జనం ఎండలో మాడుతూ, మండిపడుతున్నారు. వుసిస్తే రామారావు చెప్పినంతపనీ చేసేస్తారు. అతని వాలకం చూస్తే అందుకు సిద్ధమై వచ్చేడనిపించింది. అంతవరకూ చూపిన నిబ్బరం సడిలింది. మోకాళ్ళలో వణుకు పుట్టింది.
సాకెట్ పట్టు వదిలి చేతిలోకి వచ్చిన రిసీవర్‌ను క్రేడిల్ మీద పెట్టేసేడు, రామారావు.
"అట్టే పేచీ పెట్టుకోకండి. జనం విసిగిపోయి వున్నారు. మీరు కోరే పోలీసు సాయం మీ శవ పంచాయితీకి పనికొస్తుంది. వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు. మేము మీకు సాయం రావలసిన పనేం లేదు. జీతాలు మీరూ తీసుకుంటున్నది. అది చాలక ఒక కోటా వదిలి పెట్టేందుకు మిల్లువాళ్ళతో లాలూచీ అయి, ఈ కార్డుల తతంగం పెట్టేరు. అక్కడికీ ఆశ తీరలేదు. కార్డుకు రూపాయి వసూలు చేస్తున్నారు. అదీ చాలనట్లు జనాన్ని ఎండలో నిలబెట్టి హింస పెడుతున్నారు. మీరు చేస్తున్న పనికి ఏం చేసినా పాపం కాదు. "సహేంద్ర తక్షకాయస్వాహా" అనేసి, అల్లాంటి మరో పది సర్పయాగాలు జరిగేందుకు దారి చూపిస్తే, నీబోటిగాళ్ళకి కాస్త ఒళ్ళు తెలిసొస్తుందేమో, కాని మేమా పని చెయ్యడం లేదు. పైగా సాయం చేస్తామంటున్నాం. మీ కోసం కాదు. ఆ జనం కోసం. మీ ప్రాణానికి అడ్డు పడుతున్నాం."
"మీరు చెయ్యలేరు. తప్పులు రాస్తే." అంతవరకూ లోపలే మంటనణుచుకొంటున్న శ్యామలరావు గంయ్ మన్నాడు.
"నీ బోటి విద్వాంసులు దేశంలో లేక గొడ్డుపోలేదు."
"ఎల్లా రాయాలో చెప్పండి." అన్నాడు రామారావు.
"మీకు చెప్పేకన్న మేం రాస్తే సరిపోదా?"
"మాకేం అభ్యంతరం లేదు. ఈ కార్డులన్నీ అయ్యేవరకు మేం కదలం. మీరెవ్వరూ ఈ హాలునుంచి బయటికి పోడానికి ఒప్పుకోము."
ఇరవైనాలుగో ప్రకరణం
నాలుగైదు నెలల క్రితం అయితే సత్యనారాయణ ప్రతిపాదనకు హనుమంతరావు ఎగిరి గంతేసి వుండేవాడు. నిజానికి అతడే ఓమారు ఆ ప్రతిపాదన చేశాడు. అదీ మధ్యవర్తి ద్వారా కాదు, స్వయంగా.
"కట్నం డబ్బు సగం పిల్ల పేర పెడతా. సగం నీకిస్తా. వుద్యోగం మానెయ్యి. పోయి ఎం. ఏ. చదువుకో."
రామారావు వొప్పుకోలేదు. మామగారి డబ్బుతో చదవుకోడం అతనికి నచ్చలేదు.
ఆ నిరాకరణకు విసువే కలిగింది. కాని హనుమంతరావు తొందరపడలేదు. కూతురు జయప్రద అతనే కావాలంటూంది.
రెందోవేపున సంతోషమే కలిగింది. నీతీ నిజాయితీ కలవాడు అల్లుడుగా దొరకడం, సులభం కాదనిపిస్తున్న రోజుల్లో ఆ మాట.
తన కంటె ఎవరేనా ఎక్కువిస్తానంటే అటు జారిపోతాడేమో. కట్నం చాలక, అడగలేక వేస్తున్న అడ్డం కాదు గదా అనిపించకపోలేదు. కాని తానే కాదనుకున్నాడు. అమాయకత్వం, ప్రపంచ జ్ఞానం లేకపోవడం కారణం అయివుంటుందని సర్దుకున్నాడు. కాని ప్రపంచం చూసి గడుసుబారితే? ఈ నియమాలు నిలుస్తాయా? వెంటనే పెళ్ళి చేసేసి అల్లుడిలోని నిజాయితీని భద్రపరచాలనుకొన్నాడు.
కాని రామారావు ఒప్పుకోలేదు.
నెలలు గడిచాయి.
కూతురు పెళ్ళి చేసెయ్యాలని ఆనాడు పడ్డంత తొందర ఈవేళ హనుమంతరావులో లేదు. రిట్రెంచిమెంట్లనీ, ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని వార్తలు చెవిన పడుతున్నాయి. ఈ ఊడూడు గోచీ వుద్యోగం గాడికి, వుద్యోగం తప్ప మరో ఆధారం లేనివానికి పిల్లనివ్వడం మంచిదా అనిపించక పోలేదు. తొందర పడకూడదనీ అనిపించింది.
"ఇదిగో సత్యనారాయణా! ఇదివరలో తెలియక అతనిని తొందర పెట్టేననుకో. అప్పుడు ఆ తొందర చూపినా అర్ధం వుంది. కాని, ఇప్పుడు? ఉద్యోగం పోయి అల్లాడుతున్న దశలో వెళ్ళి మా పిల్లని పెళ్ళి చేసుకోడం మాట ఏం చేసేవని అడగనా? సామ్యం చెప్పిన తరవాయిగా వుంటుంది కదూ."
"ఆ మధ్య నువ్వు చెప్పమన్నావని, నాలుగు రోజుల క్రితం కనిపిస్తే చెప్పేను. చెల్లెలు పెళ్ళి అయిపోయింది. ఈ అమావాస్యదాటితే గోదావరి పుష్కరాలు. వచ్చే యేడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళు చేయకూడదు కదా. ఈ మాటే చెప్తే మెత్తపడ్డాడనిపించింది."
హనుమంతరావు రెండేళ్ళ ఆటంకాన్ని మాత్రమే చెవిని వేసుకున్నాడు.
"రెండేళ్ళు ఎంతసేపులో తిరిగి వస్తాయి. మా పిల్లదాని వయస్సు ఏం మించింది. పంధొమ్మిది వెళ్ళి ఇరవయ్యే కదా. మరో రెండేళ్ళు ఆపినా ఈ రోజుల్లో పరవాలేదు. అదో వయస్సా? ఈ లోపున అతడేదో మంచి వుద్యోగం చూసుకో గలుగుతాడు."
అర్ధం అయింది. హనుమంతరావు వెనకంజ వేసేడు. పైగా ముక్తాయింపుగా మరోమాట అనేసేడు.
"నాదిగా ఓమాట చెప్పు. ఈ రెండేళ్ళూ పోయి చదువుకోమను. ఇంక డబ్బుదా! మొత్తం అంతా నే పెట్టలేకపోయినా, అప్పుడూ అప్పుడూ వందో రెండు వందలో కావాలంటే ఏ తలో తాకట్టు పెట్టి సర్దుతాను."
అల్లుడుగా కట్నం పుచ్చుకో నిరాకరించినవాడు పైవాడుగా చదువుకు డబ్బు అడుగుతాడనే భయం లేకపోవడంచేతనే హనుమంతరావు అంత ధారాళంగా అనేసేడు.
"అతడు కావాలననే అక్కర్లేదు. పుచ్చుకోననడని తోస్తే చాలు చదువు ఖర్చు అంతా నేనే పెడతాను. కాని ఒప్పుకోడు కదా. స్కూల్ ఫైనల్ అయ్యాక నేనే బెజవాడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొన్నా. బసా, భోజనం వరకు ఎల్లాగో సర్దుకొన్నాడు. అంతే. ఎక్కడెక్కడో ట్యూషన్లు చెప్పుకొని జీతం, బట్టలూ గడుపుకొన్నాడు. బి. య్యే. అయ్యేక అదీ లేదు. పోయి వుద్యోగంలో చేరేడు.
హనుమంతరావు చాలా ఉదారంగా ఆ అభిమానాన్ని మెచ్చుకొన్నాడు.
"ఈనాడు అటువంటి నీతి నియమాలూ, దీక్షా కుర్రవాళ్ళల్లో కనబడడంలేదు. అందుకే అతనంటే నాకిష్టం. అల్లాంటి వుత్తమాదర్శాలను మలిన పరచకూడదు. స్వశక్తిమీద ఆధారపడడం చాల మంచిది. చాల పవిత్రం. దానిని పంకిలం చెయ్యకూడదు. ఈ ఇబ్బందులనుంచి బయటపడి రమ్మను. రాగలడులే. నాకా నమ్మకం వుంది.
ఇరవైఅయిదో ప్రకరణం
నాలుగు రోజులుగా భాగ్యలక్ష్మి తమ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఆ రోజున సుపర్ణ తన చెల్లెలు ఆశలూ, నిరాశలూ గురించి చెప్పేవరకూ సుశీలకు ఆ మాట తోచనేలేదు. కాని, ఇప్పుడు ఆలోచిస్తూంటే భాగ్యలక్ష్మి ఎప్పుడు వచ్చినా రామారావు ఇంట్లో వుండే వేళప్పుడే ననిపిస్తూంది. మళ్ళీ అతనిని పలకరించేది కాదు. వీలు చిక్కితే, మాటవస్తే వెక్కిరించడమో, వెటకారం చెయ్యడమో తప్ప ఎప్పుడూ సజావుగా మాట్లాడేది కాదు. అదేమి ప్రణయమో అర్ధంగాక పోయినా సుశీలకు ఆమె యెడ జాలి మాత్రం కలిగింది. నిరుపయోగకరమైన ఆ మనస్తత్వం రాను రాను స్థిరపడిపోయి ఆమె జీవితాన్నే భగ్నం చేస్తుందన్న జాలి. వీలయితే ఆమెను హెచ్చరించి దారిన పెట్టాలన్న ఆదుర్దా, ఈ నాలుగు రోజుల నుంచీ ఆమె కోసం ఎదురు చూస్తూనే వుంది. చివరకు పిల్లగానిచేత కూడా కబురు పెట్టింది. వస్తున్నానందేగాని రాలేదు.
సాయంకాలం వచ్చింది. వస్తూనే ఆమె అందించిన కబురేమిటో సుశీలకు అంతు పట్టలేదు.
"హనుమంతరావుగారు తన కూతురు నిచ్చేదిలేదు పొమ్మన్నాట్ట. ఆ సంబంధం జరగదు." అన్నది, భాగ్యలక్ష్మి.
"ఎవరా హనుమంతరావు? ఏమాకథ" అంది, నిశ్వాత్ముని నరసింహమూర్తిగారి బొమ్మల పంచతంత్రం పాత్ర బాణీలో.
అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భాగ్యలక్ష్మి అడ్డుప్రశ్న వేసింది.
"రామారావింకా వూరినుంచి రాలేదా?"
"నేనొకటడుగుతే నువ్వొకటి చెప్తావేం….ఈ వేళ వస్తానన్నారా?"
"రాలేదా అంటే వస్తానని చెప్పినట్లు అర్ధమా? గడుస్తనం పోతున్నావు."—భాగ్యలక్ష్మి అదిలింపును సుశీల చిరునవ్వుతో దాటేసింది.
"ఎవరా హనుమంతరావు?"
భాగ్యలక్ష్మి మళ్ళీ తన మొదటి ధోరణికి మళ్ళింది.
"హనుమంతరావు అనే ఆడపిల్లతండ్రి ఒకాయన వున్నాడీ కృష్ణాజిల్లాలో."
"ఏవంగుణ విశేషణ విశిష్టులైన ఏతన్నామధేయులు ఈ జిల్లాలో ఒకరేం ఖర్మ, ఊరికో అరడజను మందున్నారు."
"వుండనీ, మనకి కావలసింది ఈయన ఒక్కడే."
"సరే, వున్నాడు."
"అతడు తన ‘కన్యాం కనక సంపన్నాం" రామారావనే కాలేజీ ట్యూటరుకు ఇవ్వడానికి…."
విషయం అర్థం అవుతూందనిపించింది, సుశీలకి.
"ఆయనిప్పుడు ట్యూటరు కాదు."
"అందుకే ఆయన తాను మామను కాదలచుకోలేదన్నాడుట."
"ఎవరితో, ఎప్పుడు."
"నాన్నగారి దగ్గర…."
సుశీలకా సమాచారం నమ్మతగినదిగా తోచలేదు, నవ్వింది.
"ఇప్పుడామాట ఎందుకొచ్చింది? ఈయనే ఇప్పుడా తలపులో లేడుకదా."
"ఇప్పుడియనగారు సిద్ధంగానే వున్నాడు. నువ్వు చెప్పేది ఒకనాటి మాట."
ఆ చెప్పడంలో సంతోషం, ఉత్సాహమే గాని సానుభూతిలేదు. కసీ కనబడ్డంలేదు. తనకు దారి నిరాటంకం అయిందన్న ఆలోచనా? అదే అయితే ఈ ధోరణితో ఆమె విజయం పొందలేదు. చెప్పాలి. నేర్పాలి,— అనుకొంది, సుశీల.
"రామారావుకు ఏమాత్రం అపకారం జరిగినా మేలేనన్నట్లు ఆ మాటేమిటి?"
భాగ్యలక్ష్మి తెల్లబోయింది. అంతలో సర్దుకొని, తనని సమర్థించుకొంటూ "అతని కంతే జరగాలి," అంది.
"అబ్బో. అతనికెంత నీలుగు? ఎంత గర్వం? తానే అందగాడినని, తన్నుచూసి ఆడపిల్లలంతా మూర్ఛ పోతారని…."
ఆ ఆరోపణలకు సుశీల విస్తుపోయింది. తన మాటలకు ఆ ముఖంలో విశ్వాసం కనబడకపోవడంతో భాగ్యలక్ష్మి ముక్తాయింపుగా వినిపించింది.
"అతని సంగతి నీకేం తెలుసు. నన్నడుగు చెప్తా, నా పదోఏట నుంచి చూస్తున్నా."
"నిజంగా నమ్మకం వుండే అంటున్నావా?"
రామారావు అందవికారంగా ఉండడేగాని అందగాడు కాదు. వయస్సులో వున్నాడు. ఆరోగ్యవంతుడు. నిరాడంబరంగా ఉన్నా నీటుగా ఉంటాడు. అదే చూడముచ్చటగా వున్నాడనిపించే లక్షణాలు. మంచి తెలివిగలవాడవును. ఆ పరిజ్ఞానం ఆయనకుంది. ఆ రెండూ వున్న వాళ్ళలో సాధారణంగా కనిపించే అహంభావమూ వుంది. కాని, ఎవ్వరినీ మాట తూలడు. ఆడవాళ్ళవద్ద ప్రతి యువకుడూ కనబరిచే ఆత్మ ప్రకటనాసక్తివుంది. కాని వాళ్ళ వెంటబడతాడనుకోలేం. మర్యాద దాటడు.
కాని భాగ్యలక్ష్మి సుశీలకున్న సదభిప్రాయాన్ని నిరాకరించింది.
"నీకేం తెలుసు? మా యింట్లో నాలుగైదేళ్ళున్నాడు. నాకు తెలుసు."
"కాని, మీ అక్క అభిప్రాయం వేరు. దానికి ఆయన మీద…."
"దానికి అతని మీద మంచి అభిప్రాయం ఉండకేం. ఏం లేకపోతే, మేలుకొన్న పది పదహారు గంటలూ అతని వొడిలో దూరిందా?"
సుశీలకు కోపం వచ్చింది.
"ఒళ్లెరిగే మాట్లాడుతున్నావా? నోటికేంవస్తే అది అనెయ్యడమేనా?"
భాగ్యలక్ష్మి భయపడింది. ఉడుకుబోతుతనమూ కలిగింది. చర్రున లేచింది. కాని సుశీల పోనియ్యలేదు. చెయ్యి పట్టుకు లాగి పక్కన కూర్చోబెట్టుకుంది. గడ్డంపట్టుకుని, వంచుకున్న తలను పైకెత్తింది. కళ్ళల్లోకి చూస్తూ తల అడ్డంగా తిప్పింది.
"నీ మనస్సు చెప్పడానికి మార్గం ఇదనుకున్నావా?"
"నాకెవరిమీదా మనస్సూ లేదు. మనస్సు తెలియచెప్పవలసిన పనీ లేదు."
మాట అనేసేక గాని గుర్తు రాలేదు. తన విషయం సుశీలకు ఎంత తెలుసో ఏమోగాని తాను బయట పడిపోయింది. అభిమానపడి గమ్మున లేచింది. సుశీల మళ్ళీ చేయి పట్టుకుంది.
"వదులు."
"కూర్చో. నీతో మాట చెప్పాలి."
"ఏమీ చెప్పనక్కర్లేదు. అతణ్ణిచూస్తే ఒక్కొక్కమాటు పీక పిసికెయ్యాలనిపిస్తుంది. నీకేం తెలుసు. వట్టి దొంగవేషం. ఏమీ ఎరగనట్లుంటాడు. మోసగాడు. వట్టిమోసం."—అంటూ భాగ్యలక్ష్మి ఏడ్చేసింది.
ఆమె ఆవేశం, ఆ వేగం చూసి సుశీల జాలిపడింది. వీపు నిమురుతూ తొందరపడవద్దని సముదాయించింది.
"నీ అభిప్రాయం ఆయనెరుగునా?"
ఆ సానుభూతికి భాగ్యలక్ష్మి పెంకెతనం, పెడసరితనం అన్నీ ఎగిరి పోయేయి. తాను అతి నిగూఢంగా దాచుకుంటున్న అంతరాంతరాల ఆశల్ని బయటపెట్టేస్తున్నానన్న ఆలోచనకూడా ‘లేకుండా’ తెలుసునన్నట్లు తల తిప్పింది.
ఆమె కిష్టం వుంది. ఆయన కామె మీద మనస్సు లేదు – అనే అభిప్రాయానికి వచ్చి చిన్నప్పుడు హైస్కూలులో తెలుగు మేష్టారు చదువుతూండిన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొంది. "యాం చింతయామి సతతం మయి సావిరక్తా, సాప్యన్యమిచ్ఛతి…." ఇల్లాంటి ఘట్టాలు నిత్య జీవితంలో ఎదురవుతూండేవే. వానికి సమాధానం ఏం ఉంది? లేదు గనకనే భాగ్యలక్ష్మి ధూర్తపధ్ధతిలో ఎదుర్కొంటూంది. దాని వలన అనుకొన్న ఫలితాలు రావు సరికదా, వ్యతిరేక ఫలితాలనిస్తూందని నాలుగు రోజుల నాటి రామారావు మాటలు చూపుతున్నాయి.
"చదువుంది. రూపం వుంది. పరిచయంవుంది. అన్నింటికీ మించి ఆయనే కావాలంటున్నావు. ఈ స్థితి ఎందుకొచ్చింది?"
గతం తలుచుకొని భాగ్యలక్ష్మి ఏడ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో అణచిపెట్టుకొన్న ఆవేదన ఒక్కమారు కట్టలు తెంచుకుంది.
"అతనికి బోలెడు మంది. కాని, నాకాతడొక్కడే. అతడే కావాలనే కోరికను నేనెప్పుడూ అణచుకోలేకపోయేను. అలాగ విస్పష్టంగా చెప్పనూ లేకపోయేను. ఆ రోజుల్లో అక్కా అతనూ కలిసివుండేవారు. ఇంట్లోవున్నా కాలేజీకెళ్ళినా జంట విడేవారు కారు. అది చూస్తే వాళ్ళిద్దరి గొంతులూ పిసికెయ్యాలనిపించేది. అది మరొకర్ని పెళ్లి చేసుకొంటూందన్నప్పుడు అతని మొహం చూడాలి. వెంటనే దాని తల పగల కొట్టాలనిపించింది."
"ఓ యింట్లో వుండడం, కలిసి కాలేజీ కెళ్ళడం, రావడం, స్నేహంగా వుండడం – వీటికి నువ్వెంత విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావో తెలుసా?"
జాలి పడుతున్నట్లు భాగ్యలక్ష్మి ఆమె వంక చూసింది.
"ఇష్టంగా వుండడం వేరు. పెళ్లి చేసుకోడం వేరు."
"ఉహూ." అని సాగదీసుకొంది, భాగ్యలక్ష్మి.
"ఆయన మీద ఆ మమకారమే వుంటే పెళ్లి చేసుకోడానికి దానికి అడ్డేముంది?"
"మా అమ్మ, పెద్దమ్మ, నాయనమ్మ అంతా ససేమిరా అన్నారు."
"అయితే మాత్రం?"
"ఐ. పి. యస్. వాడిని చూసే సరికి అదీ ఐసయిపోయింది."
సుశీల నమ్మలేదు.
"ఆయన్ని ప్రేమించి పెళ్ళిచేసుకొందని విన్నాను."
"ఎవ్వడూ లేనప్పుడు రామారావు పనికొచ్చేడు. అల్లాగని మరెవ్వరినీ ప్రేమించ కూడదేమిటి?"—అంది భాగ్యలక్ష్మి కసిగా.
సుశీల వెంటనే ఏమీ అనలేదు.
"నువ్వే మీ అక్క స్థితిలో వుంటే ఏం చేసే దానివి?"
"అంటే"
"మరొకరిని పెళ్ళాడనంటావా?"
భాగ్యలక్ష్మి ఆలోచనలో పడింది.
"నేనతని మీద ఆశ వదులుకోలేకుండా వున్నాను. పెళ్ళి అయిపోయివుంటే ఏమి చేసే దానివంటావేమో. ఒక్కొక్కప్పుడు భయంకరమైన ఆలోచనలు కలుగుతుంటాయి."
"అందరూ ఒక్కలా వుండరు నిజమే. కాని మగవాడు తనకు చనువైన ఆడుదాన్ని అంత సులభంగా మరిచి పోలేడు. కాని, ఆడది అల్లా కాదు. ఒక్క గంటలో గతాన్ని పక్కకు నెట్టెయ్యగలదు. ఎప్పుడేనా ఈ విషయం ఆలోచించేవా?"
"చూసేను కాదా!"
"మరి నువ్వు కావాలనుకొన్న మగవాణ్ణి నీవేపు తెచ్చుకోడానికి నువ్వు అనుసరిస్తున్న ఈ పద్ధతేమిటి?"
భాగ్యలక్ష్మి చుర్రుమనేలా చూసింది.
"అతని పక్కలో చేరమనా?"
సుశీల తల తిప్పింది.
"నీకు అభ్యంతరం ఏపాటిదుందో నాకు తెలియదు. అయితే నా వుద్దేశ్యం అది కాదు."
"నా నియమాలు నాకున్నాయి."
"అవసరమే. కాని, నా ప్రశ్న నియమం, నిగ్రహం గురించి కాదు. ఆయనతో నువ్వు వ్యవహిరిస్తున్న తీరు గురించి నే చెప్తున్నా. చీటికీ, మాటికీ ఆయనని సూటి పోటీ మాటలంటున్నావు, కజ్జా పెట్టుకుంటున్నావు, మొన్నటికి మొన్న నీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చేవు. ఏమన్నావో తెలియదు. కాని, ఆయన చాల బాధ పడ్డట్లనిపించింది. ఏదో ఆని వుంటావు. అదేం పధ్ధతి?"
భాగ్యలక్ష్మి ఒక్క నిముషం వూరుకొంది.
"కోపం తెచ్చుకోకు. అతడు ఎవరితోనన్నా మాట్లాడితే, ఎవరినన్నా ముట్టుకొంటే…."
సుశీలకు అర్థం అయింది. ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసుకు చూసింది. భాగ్యలక్ష్మి అపరాధం చేసినట్లు తల వంచుకుంది.
"నా మెదడులో శూలాలు గుచ్చినంత బాధ. అతడొక్కడి విషయంలోనే నన్ను నేను నిభాయించుకోలేను."
సుశీల ఆమె తల మీద చెయ్యి వేసి జాలిగా నిమిరింది.
"పిచ్చిదానా!"
"ఇటువంటి బాధ నా కొక్కర్తికేనా. అందరికీ వుంటుందా? జీవితం మీద విరక్తి కలుగుతుంటుంది. నేనెందుకీ వుద్యోగం చేస్తున్నానో తెలుసా? ముఖ్యంగా అతని మాటకోసం. అమ్మ పెద్దమ్మ తిట్టేరు. నాన్న వద్దన్నారు. పోయి ఎం.ఎస్‌సి., చదువుకోమన్నారు. నేనే ఒప్పుకోలేదు. అతనికి దగ్గరగా వుండడం కోసం. అతను ఆడది వుద్యోగం చేసుకోవాలంటాడు. ఆ మాట కోసం. అతనది గుర్తించాలని నా ఆశ. కాని ఎదురు వెక్కిరించేడు. కాని నేను మానలేదు. మానను. కోపం మాత్రం వచ్చింది. గయ్ మంటున్నాను."
"గయ్ మంటావు సరే. కాని దాని ఫలితం ఎల్లావుంటుందో ఎప్పుడేనా ఆలోచించేవా? గయ్ మనే ఆడదాన్ని చూస్తే మగాడికి తన మగతనం గుర్తుండదు."
ఆ మాట అర్థం ఏమిటాయని భాగ్యలక్ష్మి సుశీల ముఖంలోకి గుచ్చి చూసింది.
"ఆడదాని దగ్గరకు వచ్చేసరికి మగవాడు చాల ఇన్ఫీరియారిటీ ఫీలవుతాడు. ఒక్కమాట, ఒక్కచూపు, ఒక ఆదరంతో ఆడది మగవాణ్ని కుంగదియ్యగలదు. కుంగి పోయినవాణ్ని ఉద్ధరించనూగలదు. దూరం తరిమెయ్యగలదు."
"నేనల్లా చేసేనంటావు."
"అది నువ్వాలోచించుకో. ఏది ముందో, ఏది వెనకో తెలియదు. చెఖోవ్ కథ 'కిస్' చదివేవా? దాంట్లో రియా బోవిష్ పాత్ర గుర్తుందా? రావి శాస్త్రిగారి అల్ప జీవిలో సుబ్బయ్య? ఆడది మగవాడిలో ఎటువంటి ఉత్తేజం కలిగించ గలదో అవి చెప్తాయి…."
ఈ సాహిత్య చర్చ తన కెల్లా నప్పుతుందో ఆలోచిస్తూంది భాగ్యలక్ష్మి.
"నీ జెలసీకి అర్థం వుందా?"
"లేదంటావు…."
"వుందా? ఎప్పుడన్నా ఆయన…."
భాగ్యలక్ష్మి చర్రుమంది.
"ముట్టుకుంటే చంపేస్తాను."
సుశీల నవ్వింది.
"మరి పేచీయే లేదు. నీ ఏడుపెందుకు?"
"అర్థం లేనిదే….కానీ…."
మాట పూర్తిచేయకుండానే భాగ్యలక్ష్మి లేచింది.
ఇరవైయారో ప్రకరణం
కాస్త పెద్దదిగా వున్న వూళ్ళో నల్లా తెలుగు దేశం అంతటా తల ఎత్తిన కమిటీ కాలేజీలూ, హైస్కూళ్ళలో ఎక్కడన్నా కాస్త జాగా దొరక్కపోతుందాయని బయలుదేరిన రామారావు వారం నాటికి నరసాపురం రేవులో తేలేడు. మొట్టమొదటి రేవు నావలో గోదావరి డెల్టాలో అడుగు పెట్టాలని తెల్లవారగట్ల నాలుగున్నరకే రేవులోకి వచ్చేడు. రాత్రి పడుకున్న చోట దోమలు. ఉక్క. వానిని మించి ఆలోచనలు. రాత్రి తెల్లవారూ నిద్రే లేదు. అలసటగా వుంది. కాని బయలు దేరేడు.
రేవులో ఒక పక్కగా వున్న పాకలో మసి బారిన లాంతరు ముందు కూర్చుని రేవు చీట్లు అమ్ముతున్నారు. రేవు దగ్గర లైట్లు లేవు. చీకటి పాకవేపుగా నాలుగడుగులు వేసే సరికి పెద్ద కంకరబండ కొట్టుకొని తూలిపోయేడు. కాలిన జోడు ఉండడంచేత కాలివేళ్ళకు తగలలేదు. తూలి చేతిలోని సూట్ కేసు మీద ఆనుకోవడంచేత మొగం పగలలేదు. రాతికి కొట్టుకొని మోకాలి మేడక కొట్టుకుపోయింది. ప్ర్రాణం జిలార్చుకుపోయింది.
కంకర రాళ్ళు రేవులో పరిచేరు. ఏటి గట్టు రివిట్ చేసేరు. మిగిలిపోయిన రాళ్ళన్నీ గట్టుమీద చెల్లా చెదురుగా పడేసి వున్నాయి. పట్టణంలో రోడ్ల మీది లైట్ల వెలుతురులోంచి వచ్చిన కళ్ళకి అక్కడి చీకటి మరింత దట్టం. ఏమీ కనబడదు.
ప్రయాణీకులెవ్వరో తూలిపడిన చప్పుడు విని పాక దగ్గరలో వున్న రేవు పడవ కళాసీ జాగ్రత్త చెప్పేడు.
"జాగ్రత్త బాబూ! రాళ్ళు."
దెబ్బ తగిలిం తర్వాత చేసిన ఆ హెచ్చరికకి రామారావు ఒళ్ళు రగిలి పోయింది. మోకాలు పట్టుకొని ఆ రాయిమీదనే కూర్చుండిపోయాడు.
"ఓ లైటు ఇక్కడ తగలేస్తే మా కాళ్ళు విరగవు. మీ దరిద్రం పెరగదు."
పడవ ఆసామీ ఆ మాటకు కోపం తెచ్చుకోలేదు.
"మీ దొక్క రోజు పని. మాది రోజూ, రోజంతా పని. లైటుంటే మాకూ బాగే బాబూ!"
అదీ నిజమే. దెబ్బ తగిలిన బాధలో ఎవరినో తిట్టెయ్యాలనిపించింది. పొరుగూరు. పళ్ళు కొరుక్కుని వూరుకున్నాడు.
"బాగా తగిలిందేటండి." అంటూ కళాసీ దగ్గరకు వస్తూ పరామర్శించేడు.
"కాలు విరగలేదు…." అంటూ రామారావు రాయిని పట్టుకొని లేచేడు.
"పెట్టె ఇల్లా ఇవ్వండి. పడవలో పెడతా. నెమ్మదిగా వెళ్ళి టిక్కెట్టు తెచ్చుకోండి. దారిలో దుంగలున్నాయి."
"రక్షించేవు." అన్నాడు వెక్కిరింతగా "ఇల్లా ఎందరికి చెప్తావు. ఆ రాళ్ళూ, దుంగలూ తీసేస్తే మాకూ, నీకూ కూడ క్షేమమే కదా."
అతడేం సమాధానం ఇవ్వలేదు.
రామారావు కుంటుకుంటూ వెళ్ళి టిక్కట్టు తీసుకున్నాడు. తీసుకుంటూ తన మనస్సులోని అక్కసు వెళ్ళగక్కేడు.
"ఇంత డబ్బు వసూలు చేస్తున్నారు. రేవులో రెండు లైట్లు ఎందుకు వెయ్యరు?"
గుమాస్తా ఏదో గొణిగేడు. మాట తెలియలేదు. మోకాలు సలుపుతూంటే రామారావు చుర్రుమన్నాడు.
"గొణుగుతావేం. మాట సరిగ్గా చెప్పు."
గుమాస్తా ఇల్లాంటి వాళ్ళ నెందర్నో చూసేడు. ఎందరో అతడినదే ప్రశ్న వేసేవుంటారు. అనేక మందికి చెప్పగా చెప్పగా అతనికి రాజాలాంటి సమాధానం ఒకటి దొరికింది. దానికి ఎక్కడా తిరుగులేదు.
"ఇంట్లో పెళ్ళాన్ననుకున్నావా, కోప్పడుతున్నావు. నన్నడుగుతావేం. పోయి కంట్రాక్టరు నడుగు."
అంత బాధలోనూ రామారావుకు నవ్వొచ్చింది.
"నీలాంటి పెళ్ళాం ఇంట్లో వుంటే జీవితంలో ఆడదాని వాంఛే కాదు. అసలు జీవితం మీదనే వాంఛ పోతుంది. ఆ కంట్రాక్టరుకూ అదే అనిపించి వుంటుంది. నిన్నిక్కడికి తోలేడు."
తిరుగులేదనుకున్న తనమాటకి సమాధానం వచ్చేసరికి గుమాస్తా తెల్లబోయేడు.
"ప్రతివాడికీ గుమాస్తాగాడే లోకువ."
తన అసలు ప్రశ్నకు సమాధానం రానేలేదు. వస్తే మాత్రం తానేం చెయ్యగలడు? ఏమీలేదని రామారావుకు తెలుసు. కంట్రాక్టరు ఒక్కడేనా? ఈ రేవు పాట ఈవేళే కొత్తగా ప్రారంభం కాలేదు. పట్టణంలోకి కర్రెంటు వచ్చికూడా చాలాయేళ్ళయింది. కంట్రాక్టర్లు మారేరు. గవర్నమెంట్లూ మారేయి. మునిసిపాలిటీ ఎన్నో పాతకూసాలు విడిచింది. ప్రతి ఒక్కరికీ రేవు పాట సంగతే పట్టింది. ప్రయాణీకుల సమస్య ఎవరికీ పట్టలేదు. కనీసం రేవులో లైట్లు కూడా లేవు. ఆ మాట ఎవరికీ తోచలేదనలేరు. చాల మంది గుర్తుచేసి వుంటారు. కాని దాని ఖర్చు ఎవరు భరించాలో తేలి వుండదు. మునిసిపాల్టీయా? కంట్రాక్టరా? పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్‌మెంటా?
పాక వద్ద గుమాస్తా కంఠం విన్నాక గట్టుకింద రేవులోంచి కళాసీ కంఠం వినిపించింది.
"పడవ తోసేస్తున్నాం, రాండి, బాబూ."
తన ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చెయ్యకుండానే రామారావు కుంటుకుంటూ రేవులోకి నడిచేడు. పాకలో గుమాస్తా సాధింపు వినిపిస్తోంది.
"ఈ మగాడొచ్చాడిన్నాళ్ళకి. కంట్రాక్టరేడిట కంట్రాక్టరు."
పడవలో కూర్చున్నాక కళాసీ చెప్పిన మాటల్ని పట్టి ఒకటి అర్థం అయింది. రేవు కేవు వసూలు చేసే హక్కు ఎవరిదో తెలుస్తూనే వుంది. కాని లైట్లు వేయవలసిన బాధ్యత యింకా ఎవరిదో తేలలేదు.
"మీరడిగింది పాకలో గుమాస్తా గారిని. ఆ గుడ్డి దీపం ముందు కూర్చుని చీట్లుకోయడం ఆయనకి మాత్రం సరదా యేటండి."
కాలికి తగిలిన దెబ్బ చిమచిమ లాడుతూంటే మనస్సు సమాధాన పడలేకుండా వుంది. ప్రజలలో వున్న పిరికితనం, సివిక్‌సెన్సు లేకపోవడం చూసుకొని అడ్డమైన గాడిద కొడుకులూ జనాన్నీ, దేశాన్నీ పీల్చేస్తున్నారన్నాడు.
"మనకంటే కోడీ, మేకా నయం. గొంతు కోస్తూంటే అరుస్తాయి. పారిపోవడానికి గిజాయించుకుంటాయి. మనం అదీ చెయ్యం." అన్నాడు.
"అసలు రేవు పాడినోడు రేవు సాయలకి రాగా నేనెన్నడూ సూడలేదండి. వచ్చేదల్లా ఆరు పంపే గుమాస్తా. ఆయనకి తోడుగా రౌడీసుగాళ్ళని ఏర్పాటు చేస్తారు. మీ అదురుట్టం బాగుంది. ఆ నంజకొడుకక్కడ నేడు. నేకుంటే పెద్ద గొడవయిపోయేది."
ఇరవైయేడో ప్రకరణం
పడవ దిగి బస్సు వద్దకు నడుస్తూంటే చటుక్కున గుర్తు వచ్చింది. రేపే బలరామ్ పెళ్ళి. ఇక్కడే సెంట్రల్ డెల్టాలో వూరు. పేరు జ్ఞాపకం వుంది. ముంగండ. కమ్యూనిస్టు సాహిత్యం ద్వారా పరిచితమైన వూరు. కాని, పెళ్ళివారి పేరు గుర్తు లేదు. శుభలేఖ చూసినప్పుడు వెళ్ళ గలుగుతానని గట్టిగా అనుకోలేదు. ఉద్యోగాన్వేషణలో ఏమూల వుండేదీ నిశ్చయం లేదు. ఆ రోజుకి గ్రీటింగ్స్ పంపి వూరుకుందామనుకున్నాడు.
కాని, ఈవేళ ఆ వూరికి దగ్గరలోకి వచ్చామనుకున్నప్పుడు తాను జయప్రదతో మాట్లాడడం అవసరమనుకొన్నది కూడా గుర్తు వచ్చింది. వూళ్ళంబడి వెంటబడి చెప్పడం మర్యాదా అనిపించక పోలేదు. కాని, ఈపాటికి సత్యనారాయణ హనుమంతరావు గారితో మాట్లాడి వుంటాడు. గతంలో హనుమంతరావే అటువంటి ఆలోచన తెచ్చి వుండడం చేత ఇప్పుడాయన అంగీకరించక పోవడం వుండదని రామారావు అభిప్రాయం.
కాని, అసలు విషయం ఆమె ఆస్తి మీదనే తానీ మేడలన్నీ కట్టాలి. ఆ మాట ఆమెకు తానే చెప్పాలి. తండ్రి చెప్పి ఒప్పించడానికి ముందు అందులోవున్న అసలు మెలిక చెప్పేసి, ఆమె అన్నీ యెరిగి ఒప్పుకోవడమో, ఒప్పుకోక పోవడమో తేల్చుకొనేలాచెయ్యాలి. కనక ముంగండలో ఆగాలనే నిర్ణయానికి వచ్చేసేడు.
కండక్టరునడిగేడు.
"ముంగండ ఎక్కడ?"
"మన బస్సు ఆ వూరు మీదుగానే వెడుతుంది. మీరెక్కడికి వెళ్ళాలి."
"ఆ వూరే వెళ్ళాలి."
"ఎక్కండి."
అంతలో అనుమానం. పెళ్ళివారిపేరూ, ఇంటిపేరూ తెలియకుండా ఎవరింటికని వెళ్ళడం. వూరు చిన్నదైతే ఫర్వాలేదు.
"ఊరు పెద్దదేనా?"
"నూరిళ్ళుంటాయి."
అయితే ఫర్వాలేదు. పట్టుకోవచ్చు. ఒకవేళ పట్టుకోలేకపోతే పలాయన మార్గం వుంటుందా? మళ్ళీ ప్రశ్న.
"దీని తరువాత ఆ వూరు మీదుగా వెళ్ళే బస్సు ఎన్నిగంటలకి?"
కండక్టరు చిరాకు పడ్డాడు.
"నాకు తెలియదు."
తోడి ప్రయాణీకుడొకడు చెప్పేడు.
"ఆవూరు మీదుగా అమలాపురం పోయే బస్సులు గంటకీ అరగంటకీ చాలానే వున్నాయి."
"ఇహనేం. ఇల్లు దొరక్కపోతే, కలుసుకోవలసిన మనిషి రాకపోతే తరవాతి బస్సు ఎక్కేద్దాం." అనుకున్నాడు.
కొబ్బరి తోటల మధ్యనుంచి, పంట కాలవలు దాటుకుంటూ బస్సు పోతూంది. తోటల మధ్యనే యిళ్ళు. ఇళ్ళ గుమ్మాలలో కాలవలు. కాలవలమీద కొబ్బరి బొందలు రెండూ మూడూ చేర్చివేసిన వంతెనలు. ఏటిగట్టు దారిపొడుగునా దృశ్యాలు మనో రంజకంగా వున్నాయి. రోడ్డు ప్రక్కనే చెట్లకింద పచ్చగా ముగ్గిన అరటి గెలలూ ఇన్ని సోడాలూ పెట్టుకొని చిన్నచిన్న పందిరి దుకాణాలూ, టీ కొట్లూ.
వంటచేలు, చెరుకు తోటలు, మళ్ళీ కొబ్బరి తోటలు—ఇంత పుష్కలంగా పండుతున్న దేశంలో దరిద్రం, తిండిలేక మాడడం. బీదరికం, చదువు సంధ్యలు లేకపోవడం. చదువుకొని, పదిమందికి చెప్పడానికి తయారయిన తాను చదువు చెప్పించుకొనే వాళ్ళని వెతుక్కుంటూ రోడ్లు పట్టి తిరగవలసి రావడం.
కాలవ అంచునే ప్రయాణం చేస్తూ బస్సు చెట్ల నీడ పొదలలో మిలమిల లాడుతున్న చిన్న చిన్న పల్లెలు దాటింది. వంతెనలు, లాకులు, సీమచింత తోపులు దాటింది. ఎదురుగా గోదావరి. దానిమీద అక్విడక్టు కట్టి నీరు పారిస్తున్నారు. అక్విడక్టు మీద కాలవ పక్కనే విశాలమైన మోటారు రోడ్డు. కాలవలో పడవలు, రోడ్డుమీద కార్లు. రిక్షాలు, మనుష్యులు. ఆ ఉదయకాలపు నులివెచ్చని సూర్యకిరణాల బంగారు పూతలో ప్రకృతి బహు రమ్యంగా వుంది.
"ఈ వూరు నేమంటారు?"
"ఈ గోదావరి పాయమీద కట్టిన అక్విడక్టుకి ఆ కొసన, ఈ కొసన వున్న వూళ్ళని గన్నవరమే అంటారు. ఈ దిగువ వూరికి డొక్కా శీతమ్మగారి ద్వారా జిల్లాలుదాటి పేరుంది."
ఆమె దాతృత్వం కథలు విన్న రామారావు ఆమె వుండిన యిల్లేనా కనిపిస్తుందేమో నన్నట్లు తల బయటకుపెట్టి చూడసాగేడు.
"తల బయటకు పెట్టకండి."—అని హెచ్చరించి కండక్టరు 'రైట్' అన్నాడు.
బస్సు మళ్ళీ కదిలింది.
ఇరవైయెనిమిదో ప్రకరణం
బస్సు ముంగండ వద్ద ఆగింది. రోడ్డు పొడుగునా దుకాణాలు. పాకలూ, పందిళ్ళలో నైతేనేం కాఫీ దుకాణాలు. పళ్ళకొట్లు, సైకిలు షాపులు, రెండో మూడో బట్టలకొట్లు, మందుల షాపులు. చిల్లర కొట్లు—ఆ సందడి చూసి రామారావు సందేహిస్తున్నాడు. ఇది చిన్న వూరేమిటని అతని అనుమానం.
"ఇదే ముంగండ. దిగుతామన్నారు?"
తోడివాని హెచ్చరిక వినగానే రామారావు సూట్‌కేసు అందుకొని దిగేసేడు.
బస్సు నిష్క్రమించేక ఒక్క నిమషం నిలబడి ఇంకేమిటి చెయ్యడం అన్నట్లు ఆలోచించేడు. ఎదురుగా హోటలులోని రేడియోలోంచి ఎవరో గాయకుడు తేలు కుట్టినట్లు అరుపుల సంగీతం వినిపిస్తున్నాడు. ఆ బాధ వినగలమా అని సందేహిస్తూనే, సాహసంచేసి పాకలో ప్రవేశించేడు.
సెర్వరు కాఫీ తెచ్చేలోపున పక్కనున్న ఆసామితో పరిచయం చేసుకున్నాడు. కప్పు క్రిందపెట్టే వేళకి కావలసిన సమాచారం సంపాదించేడు.—ఆ రోజున ఆ వూళ్ళో మూడు నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.
"మగ పెళ్ళి వారు కృష్ణాజిల్లానుంచి వస్తున్నారు"
"పట్టాభిరామయ్యగారింటి కన్నమాట"
"వారిల్లు…."
"చూపిస్తారా" అని రామారావు అడగలేక పోయేడు. ఆయన కూడ పని మానుకువచ్చి చూపించడానికి సిద్ధంగాలేడు.
"చూడండి. ఈ పక్కనే ఉన్న వీధి. దీనిని రాజవీధి అంటారు. తిన్నగా వెళ్ళండి. కొంత దూరం వెళ్ళేక కుడియెడమలకి అడ్డవీధి కనబడుతుంది. ఎడమ చేతికి తిరిగి కొద్ది దూరం నడుస్తే పెద్ద చెరువు. పావంచాల రేవు. దానికివతలే దగ్గర్లో పెళ్ళిపందిరి, హడావిడి తెలుస్తూనే ఉంటుంది"
ముంగండ చెరువు మాట వినిపించేక రామారావు తన పని మరిచిపోయేడు.
"హరిజనులని నీళ్ళు ముట్టుకో నివ్వరంటారు, ఆ చెరువులోనేనా?"
ఆ ప్రశ్న ఆయనకి కొత్తగా గాని, అవమానంగాగాని తోచలేదు. నిజానికి కంఠంలో గర్వం ఛాయగా వినిపించింది కూడాను.
"ఆ."
"ఇప్పటికీ."
"ఒకప్పుడు మా వూరు చదువులకి ప్రసిద్ధి. ప్రస్తుతం వానితో పాటు మా భుజకీర్తులలో రెండోది ఇప్పుడు మీరు చెప్పిందేనండి." అన్నారు వేరెవరో.
మొదటి ఆయనకు కోపం వచ్చింది.
"మీ కమ్యూనిస్టులు వచ్చేక మడీ, ఆచారం, పెద్దవాళ్ళంటే మర్యాదా అన్నీ తగలపెట్టేరుగా. చూడు. మాదిగ రత్తిగాడి కొడుకు సైకిలు మీద ఎంత దర్జాగా పోతున్నాడో వూళ్ళోకి."
తానక్కడి ఆచారాలు, అలవాట్ల మంచిచెడ్డల చర్చకు రాలేదని రామారావుకి గుర్తొచ్చింది. మెల్లిగా మాట తప్పించడానికి ప్రయత్నించేడు.
"పెళ్ళికూతురు తండ్రిగారి పేరు ఏమిటన్నారు?"
"పట్టాభిరామయ్య గారు."
అంతలో రోడ్డు మీద సైకిలు వేసుకు వెడుతున్న ఒకరిని చప్పట్లు కొట్టి పిలిచేడు.
"ఆయన పెళ్ళికూతురు పింతండ్రి."
ఇద్దరూ రోడ్డు మీదికి వచ్చేరు.
"శీతారాముడూ. పెళ్ళిపనుల హడావిడిలో వున్నట్లున్నావు. చూడు, వీరు మీ ఇంటికే వస్తున్నారు."
శీతారామయ్య ఎంతో వినయంగా నమస్కరించి, చాల ఆప్యాయంగా ఆహ్వానించేడు.
"ఇప్పుడే బస్సులో దిగేరా. దయచేయండి. ఇంటికి వెడదాం."
సూట్ కేస్ సైకిల్ కేరియరు మీద పెట్టించి. క్లిప్పు బిగించేడు.
"పడదులెండి. ఇల్లాంటి చిల్లర సామానులు ఇంటికి చేరెయ్యడానికే ఈ గార్ధభ రాజం."
రామారావు నవ్వేడు. పక్క పక్కనే నడుస్తున్నారిద్దరూ.
"మగపెళ్ళివారు వచ్చేరాండి."
"సాయంకాలానికి వస్తారు. ఉదయ ఘడియల్లో కదా పెళ్ళి."
మగపెళ్ళివారు రానిదే వారి తరఫు మనిషిగా తాను అప్పుడే పెళ్ళికి రావడం అసందర్భంగా కనిపించింది. కాని, అంతలో తాను వచ్చింది ఆడపెళ్ళివారింటి మనిషి కోసం అనుకొని సర్దుకున్నాడు. అయినా సందేహం. జయప్రదను వెతుక్కుంటూ వచ్చేనంటే ఏమనుకుంటారో. తనకు ఆహ్వానం పెళ్ళికొడుకు నుంచి గాని పెళ్ళికూతురు వారికి తన పేరు కూడా తెలియదు. నిలబడ్డాడు.
"నాకు అమలాపురంలో పనుంది. అది పూర్తిచేసుకొని పెళ్ళివారు వచ్చే వేళకి వచ్చేస్తా."
సీతారామయ్య ఒప్పుకోలేదు.
"రాండి. స్నానం, భోజనం చేసి వెడుదురుగాని. ప్రతి గంటకీ ఏదో బస్సు ఉంటుంది. లేకుంటే ఏ రిక్షాయో చేసుకు వెళ్ళొచ్చు."
తప్పనిసరిగా రామారావు నడుస్తున్నాడు. అనేక ప్రశ్నలూ, కథోపకథనాలూ మధ్య అసలు ప్రశ్న జార్చేడు.
"జయప్రద మీ పినతల్లి కూతురనుకుంటాను. వచ్చిందనుకుంటాను."
"ఔను. ఆమెనేం ఎరుగుదురు?"
"మా చెల్లెలికి క్లాస్ మేటు. స్నేహితురాలు. మా యింటికి తరుచు వస్తుంటుంది. బాగా ఎరుగుదును."
"అయితే మరింకేం. మీకు సందేహం ఏమిటి?"
పెళ్ళి ఇల్లు చేరగానే సీతారామయ్య అరుగుమీద కుర్చీ వేసి రామారావును కూర్చుండబెట్టేడు.
"జయప్రదను ఒక్కమారు…."
"పిలుస్తా. ఏ పనిలో వుందో. పెళ్ళి యిల్లు కద."
"అందుకే నేనిక్కడ ఉండడం మీకు అదనపు పని, రెండోది అమలాపురంలో నా పనీ నిలిచిపోతుంది. జయప్రదతో చెప్పేసి వెడితే నే వేళకి రాగలిగినా, రాలేకపోయినా ఆమె నా హాజరు చెప్పేస్తుంది."
"మళ్ళీ అదేమిటి? వుండండి. ఆమె ఏం చేస్తుందో చూసి, చెప్పి వస్తా."
"ప్లీజ్."
శీతారామయ్య లోపలికి వెళ్ళేసరికి తన అక్క రమణమ్మతో జయప్రద మాట్లాడుతూంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.
"జయా! బెజవాడలో రామారావుగారట. ఎవరే?"
"అదేమిటోయ్! ఆ మహా పట్టణంలో ఆ పేరు గలవారు కనీసం వెయ్యిమందికి తక్కువుండరు. అందులో నేనే పదిమంది వరకూ ఎరిగి ఉంటా. ఏం. వారింటిపేరు."
"తెలియదు."
"ఫో. డి. ఎల్. ఓ. (డెడ్ లెటర్ ఆఫీసు)కి రవాణా చెయ్యి. "
"నిన్ను ఎరుగుదురుట. వచ్చేరు. నీతో చెప్పమన్నారు."
"ఎందుకుట? అంది జయప్రద అనుమానిస్తూ.—"రావే, అక్కా చూద్దాం."
"ఆయన బస్సు దిగి మన ఇల్లు వాకబు చేస్తూంటే తీసుకోచ్చేను. నీ పేరు చెప్పేరు. ఓ మారు పిలవమన్నారు."
"ఆయన వొస్తారా?"
"చూడరాదా పోయి." అంది రమణమ్మ
"మనిషి ఎల్లా ఉంటారు?"
"పాతికేళ్లుంటాయి. పొడగరి. కాలు కుంటుతున్నారు."
స్త్రీలు ఇద్దరూ ముందు సావిట్లోకి వచ్చి కిటికీలోంచి చూసేరు.
జయప్రద ఆశ్చర్యపడింది. "ఆయనే" అంటూ గబగబ గుమ్మం వేపు నడిచింది. "మా మేస్టా"రంది శీతారామయ్య కోసం.
"ఎంతసేపయింది వచ్చి? ఎక్కడినుంచి వస్తున్నారు? రామారావుగారంటే ఎవరా అనిపించింది. మీరిక్కడికి…."
రామారావు కుర్చీలోంచి లేచేడు.
"నేనూ అనుకోలేదు. మొన్న, నిన్న నర్సాపురంలో వున్నా. ఈవేళ అమలాపురం వెడుతూంటే జ్ఞాపకం వచ్చింది. బలరామ్ పెళ్ళి ముంగండలో ఈ వేళనే కదా అని. కాని బయలుదేరేటప్పుడు అనుకోలేదేమో శుభలేఖ చూసుకోలేదు; కాని ముంగండ పేరు గుర్తుంది. దారిలో వుంది వచ్చాం. సంతోషిస్తాడు. కనిపించి పోదామని దిగా. తీరా చేస్తే ఎవరింటికెళ్ళాలో తెలియదు. అప్పుడు నీ పేరు గుర్తువచ్చింది."
అనాహుతంగా. హఠాత్తుగా, ఇక్కడ కొచ్చేడేమిటనుకొంటుందేమోనన్నట్లు రామారావు మాటలు దొర్లించేస్తున్నాడు.
రమణమ్మ తమ్మునితో వాళ్ళ బాంధవ్యం చెప్పింది.
"జయ మగడు"
"అక్కా! వీరే రామారావుగారు. ఇందాకా నా క్లాస్ మేట్ అన్నానే ఆమె అన్నగారు. మా మేస్టారు." అని జయప్రద పరిచయం చేసింది.
క్షణంలో ఇంట్లోకి ఉప్పందింది. అతిథి మాత్రుడుగా వచ్చినవాడు ఇంటల్లుడంతవాడు. ఆయనను కూర్చోబెట్టిన కుర్చీ సావిట్లోకి మారింది. ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు. ఇద్దర్నీ పక్క పక్కన చూసి ఈడూజోడూ కుదిరిందని మెచ్చుకున్నారు. పెళ్ళి అడ్డు తీరకపోయినా భార్య కాగల పడుచుకోసం అతడు వెతుక్కుంటూ రావడం, ఇద్దరూ అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూండడం కొత్తగా వున్నా, అందరికీ ముచ్చటగా వుంది.
పెళ్ళికూతురు తండ్రి చిన్న అబద్ధం ఆడేసి రామారావు అనాహుతంగా వచ్చేనేయని చిన్నపుచ్చుకోనక్కర్లేకుండా ప్రయత్నించేడు.
"మీకు శుభలేఖ పోస్టు చేసేను. అందే వుంటుంది."
అది అబద్ధమని రామారావుకూ తెలుసు. అక్కడి వారెవ్వరికీ తన పేరన్నా తెలియదు. కాని ఆ ప్రయత్నం ఎందుకో గ్రహించి తానూ అబద్ధాన్ని బలపరచడానికి ప్రయత్నించేడు.
"కాలేజీ ఎడ్రసుకి వ్రాసి వుంటారు."
దారి దొరికిందనిపించి వెంకటరామయ్య "ఔనౌను" అన్నాడు.
"మీ ఇంటి ఎడ్రసు సరిగ్గా తెలియదు. వచ్చి పిలవడానికి గాని, ఎడ్రసు తెలుసుకొని వ్రాసేందుకుగాని వ్యవధి లేదు. కాలేజీకి వ్రాసి పడేయించేను."
"నేనప్పుడే వారం రోజులవుతూందండి బెజవాడ వదిలి."
"మరిహనేం. మా లేఖ అందినా రెండు మూడు రోజుల క్రితమే అంది వుంటుంది….పోనీలేండి. దేవుడు చెయ్యట్టుకు తీసుకొచ్చినట్లు వచ్చేరు. చాల సంతోషం. మగపెళ్ళి వారి తరఫు కాదు మీరు. మా తరఫునే వుండిపోవాలి." అన్నాడాయన.
"జయా వారి సంగతేదో నువ్వే చూసుకోవాలి." అని హాస్యమాడేడు.
"రమణా! వారికి కాఫీ, టిఫిన్ సంగతి చూడండి," అని పురమాయించేడు.
"శీతారామ్! మేష్టారింటి వీధిగది వాడుకోవచ్చునన్నారు. వీరికి బస అక్కడియ్యి." అని ఆదేశించేడు.
వెంకటరామయ్య సెలవు తీసుకొని తన పనిమీద వెళ్ళిపోయేడు. ఆయన భార్యవచ్చి, పలకరించి, కుశలప్రశ్నలు వేసింది. తాను మరో మారు జరగవలసిన మర్యాదలన్నింటినీ పురమాయించింది.
"సిగ్గుపడకేం బాబూ! మీరూ మా పిల్లల వంటివారే. ఇల్లు కొత్తయినా మా జయ ఉంది."
తమ వివాహం జరగకపోయినా జరిగిపోయినట్లే అందరూ వ్యవహరిస్తున్నారు. తాను వచ్చింది ఒకందుకు. అందులో తమ పెళ్ళి జరక్కుండా నిలిచిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాని, జరుగుతున్నది వేరు. బయటపడి సర్దుకొనేదెట్లో తెలియడం లేదు. అతనిమాట వినిపించుకొనేవారు లేరు. తిని వచ్చేనన్నా మరోమారు టిఫిన్ తినక తప్పలేదు. కాఫీ తాగక తప్పలేదు. నడి వేసవిలా వున్నా వేడినీళ్ళు పోసుకోక తప్పలేదు. అమలాపురం మరునాటికి వాయిదా వెయ్యక తప్పలేదు. తనకిచ్చిన గదిలో బట్టలు మార్చుకొనడం పూర్తి చేసేసరికి చాకలిని వెంటబెట్టుకొని జయప్రద వచ్చింది.
"ఉతికే బట్టలు చాకలికి వెయ్యండి."
ఆమెకు సరాసరి సమాధానం ఇవ్వక రామారావు అంగలార్చేడు.
"నేరకపోయి వచ్చేననిపిస్తూంది, జయా…."
జయప్రద నవ్వింది.
"రోమియో పాత్ర ఏ రూపంలోనూ మంచిది కాదు. గుర్తుంచుకోండి."
"ఆ పాత్ర విప్పెయ్యడానికే నీతో మాట్లాడాలని వచ్చేను."
"ఏమిటా అర్జంటు!"
"అర్జంటు. చాలా అర్జంటే."
"ఆ హడావిడిలోనే కాలు విరుచుకొన్నారంటే అదేదో చాలా అర్జంటు మాటే అయివుంటుంది. ముందు బట్టలు చాకలికి వెయ్యండి. తరవాత డాక్టరు వద్దకు నడవండి."
"ఇదంత పెద్ద దెబ్బ కాదు. దీనికి డాక్టరు పనేం లేదు."
"అది చెప్పవలసింది మీరు కాదు, డాక్టరు."
"ఈ పల్లెటూళ్ళో డాక్టరెక్కడ దొరుకుతాడుగాని, మధ్యాహ్నం అమలాపురం వెళ్ళినప్పుడు డాక్టరు సర్టిఫికెట్ సంపాదించి నీకు పోస్టు చేస్తా."
"మరి అర్జంటు మాటేమవుతుంది."
"డాక్టరు సర్టిఫై చేస్తేగాని మాట వినిపించుకోవేమిటి కర్మ."
జయప్రద నవ్వింది.
"ఇక్కడా డాక్టర్లున్నారు. నేను తీసుకువెడతాగా."
"తప్పదంటావు."
"ఇంటికొచ్చిన అతిథి కుంటుతూంటే మా పిన్నీ వాళ్ళూ ఏమంటారండీ."
"అదొకటా."
ఇరవై తొమ్మిదో ప్రకరణం
మందు కోసం మరెక్కడికో వెళ్ళవలసిన పనిలేదన్నాక రామారావు తృప్తి పడ్డాడు.
"మేస్టారి కొడుకు డాక్టరు. ఆయన వుద్యోగం కోసం ఎదురుచూస్తూ ఇంట్లోనే వున్నారు." అంది జయప్రద.
"నాకు సహపాఠేనన్నమాట."
జయప్రద ఆ సమయాన ఇంట్లోనే ఉన్న డాక్టరుకు రామారావును పరిచయం చేసింది. అదోదెబ్బ కాదన్న మాట తీసుకొని వెళ్ళిపోయింది.
ఇంచుమించు ఒకే దశలో ఉన్న ఆ యువకులిద్దరూ త్వరలోనే స్నేహితులయిపోయారు. చదువుకున్న పడుచును పెళ్ళాడబోతున్నందుకు రామారావును డాక్టరు వేణుగోపాలరావు అభినందించేడు.
"మీరు అదృష్టవంతులు మేస్టారూ! ఈ కరువు రోజులూ, పల్లెటూరి పెత్తందారుల అధికారాలూ సాగుతుండగా ఎంత కష్టపడ్డా, ఒక్క రెక్క మీద సంసారం నడిచే దారి కనబడ్డంలేదు. రెండోవారు కూడా కాస్త తోడుండాలి."
"మాబోటిగాళ్ళ విషయంలో మీరు చెప్పింది నిజమే. కాని, నిత్య పంట వాళ్ళుకదా, డాక్టర్లు! మీకూనా?"
"మీకూనా! ఏం ప్రశ్న వేశారు, మేస్టారూ! నన్ను చూడండి. కట్నం తీసుకుని కాని మెడిసిన్ గట్టెక్కించలేకపోయా. ఆ కట్నం కోసం, చదువు మొహం ఎరగని, కేవల భారత నారీమణిని చేసుకొన్నా. నేనేదో కొండ తవ్వి గాదెల కెత్తుతానని ఆమె భ్రమ. నోట్లో వేలెట్టుకుని చూస్తూంది. ఇద్దరం పోగడి హైస్కూలు మేస్టరీతో నాలుగురాళ్ళు తెస్తున్న మా నాన్నగారి చెరో భుజం మీద కూర్చున్నాం."
ఆత్మగ్లానితో వేణుగోపాలరావు కంఠం రుద్ధమయింది. ఆ వ్యధకు రామారావు వద్ద ఓదార్పు మాటకూడా లేకపోయింది. ఒక్క క్షణం ఆగి వేణుగోపాలరావు తన కథ సాగించేడు.
"హౌస్ సర్జెన్ పూర్తి చేసేసరికి చైనా యుద్ధం వచ్చింది. సైన్యాలలోకి భర్తీ అయ్యే డాక్టర్లకి ప్రత్యేక సౌకర్యాలిస్తామన్నారు. వెంటనే వుద్యోగం, యుద్ధంలో సర్వీసు చేసినంతకాలం అన్నేళ్ళూ డబుల్ ఇంక్రిమెంట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లో సీట్ రిజర్వేషన్లు, ఎన్ని వాగ్దానాలు? నేను సర్వీసునుంచి రిలీవ్ అయి ఏడాది దాటింది. ప్రమోషన్ల మాట దేవుడెరుగు, అసలు అప్పాయింట్ మెంటే లేదు. ముంగండ హైద్రాబాదుల మధ్య తిరిగేందుకు ఎక్కడి డబ్బూ చాలడం లేదు." అన్నాడు, నిరుత్సాహంగా.
"వుద్యోగం కోసం గవర్నమెంటుని ప్రాధేయపడాలా, డాక్టరు గారూ," అన్నాడు పరీక్ష పేసయి బయటపడడం తడువుగా బెజవాడ వీధుల్లో వెలుస్తున్న క్లినిక్ లను తలుచుకొని, రామారావు.
వేణుగోపాలరావు నవ్వేడు. ఆ నవ్వులో ఆనందం కాదు కనబడుతున్నది, ఆవేశం.
"మనదేశం ఈవేళ ఉన్న పరిస్థితిలో పెట్టుబడి లేకుండా ఏ వృత్తీ ప్రారంభం చేయలేము. మీరు తప్పుపట్టుకోకపొతే ఒక్కటడుగుతా. మీకు వుద్యోగం లేదు. ట్యుటోరియల్ స్కూలు ప్రారంభించి మీ జీవితం గడుపుకోగలరా?"
క్రితంరోజునే నరసాపురంలో లక్ష్మీనరసింహంగారితో జరిగిన చర్చ గుర్తొచ్చింది. కనీసం పదిహేనువేలు చేతబట్టుకోకపోతే నెలకో నాలుగువందలు తెచ్చుకోడం, పోటీలు సర్దుకోడం సాధ్యంకాదని ఆయన లెక్క చూపించేరు.
అవి గుర్తు తెచ్చుకొన్నాక డాక్టర్ల ప్రాథమిక ఖర్చులు వగైరాలు గుర్తు వచ్చేయి. ఇంక వాదన అనవసరం. అంగీకరించేడు.
"నిజమేలెండి."
"మీరేమనుకుంటున్నారో తెలీదు. మీకింకా ఏమాశలున్నాయో అర్ధం కాదు. ఇంకా ఈ సంఘం మనని బతకనియ్యదు. దీనికి శస్త్రచికిత్స జరగాలి. మేమంతా దేశాన్ని వుద్ధరించగలమని శత్రువును ఎదుర్కోవాలని చైనా యుద్ధంలోకి వెళ్ళేం. దానికి ఆనాడు సి. పి. ఐ. లో నడిచిన వాదప్రతివాదాలు కూడా కొంత కారణమే లెండి. నాకు మార్క్సిస్టుల వాదమే కరక్టు అనిపిస్తూంది. చెప్పొద్దూ."
"ఎందుచేత?"
"చైనా వాళ్ళొస్తే ఏమయీది? ఈ భటాచోర్ లందర్నీ తుడిచి పెట్టేసేవాళ్ళు. దేశంలో వామరం వొదిలిపోయీది. అప్పుడు అందరికీ తిండీ, బట్టా అందించగల ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకొనేవాళ్ళం."
కలలలో తేలిపోతూ డాక్టరు చెయ్యి దాటిపోయిన అవకాశాన్ని తలుచుకొని అనుతాపం తెలుపుతూంటే రామారావు దిగ్భ్రమ చెందేడు.
"మనల్ని అందర్నీ వుద్ధరించే భారం తమమీద వుందనుకొనే తెల్లవాళ్ళు మన దేశాన్ని రెండువందలేళ్ళు పీక్కుతిన్నారు, డాక్టరు గారూ!"
"చైనా అల్లా చెయ్యదు. కమ్యూనిస్టులలో వాళ్ళు తప్ప పుట్టేరు. వాళ్ళకి సామ్రాజ్య కాంక్ష లేదు."
"మీ విశ్వాసాన్ని భగ్నం చేయను. కాని కమ్యూనిజం, స్వాతంత్ర్యం వంటివి ఎగుమతి చేయగల వస్తువులు కావు అంటారు మరిచిపోకండి."
"సాయం చెయ్యడం దండయాత్ర చెయ్యడం కాదు."
"లే ఆక్రమణ మనకి సహాయం కోసమే నన్నమాట."
"సందేహం ఏముంది? మన దేశంలో జనం విప్లవానికి తయారుగానే వున్నారు. గువేరాలాంటి కార్యవాదో, మావోవంటి ప్రవక్తో పుట్టి ముందుకు వస్తే తప్ప జనంలోని మత్తు వదలదు. నిర్మాణం అంటూ కూర్చోండి. పుణ్యకాలం వెళ్ళిపోతుంది. పార్టీలంటూ భజన చెయ్యండి. వాళ్ళు మీ నెత్తిన చెయ్యి పెట్టేస్తారు….అని మనకి ఓ వూపు ఇవ్వాలనే వాళ్ళు ఆ మంచు కొండల్లోకి వచ్చేరుగాని…."
రామారావు నోరు తెరుచుక్కూర్చుండిపోయేడు. డాక్టరు వుత్సాహంగా చెప్పుకు పోతున్నాడు.
"మీరు రివెల్యూషన్ ఇన్ ది చదివేరా? చాల గొప్ప పుస్తకం. లెనిన్ కాలం నాటికీ నేటికీ ప్రపంచం చాలా మారిపోయింది. ఆయన రివెల్యూషన్ గురించి చెప్పిన మాటలు అమెరికను సామ్రాజ్యవాదమూ, ఆటంబాంబూ వచ్చిన ఈనాటికి కాలదోషం పట్టిపోయాయి."
"మీ మాటలు వింటూంటే అసలు కమ్యూనిజమే ‘ఔటాఫ్ డేట్’ కాలేదు గదా అనిపిస్తూంది, డాక్టరుగారూ!"
ఆ కంఠస్వరంలోని హేళనను గాక, ఆ వాక్యార్ధాన్ని మాత్రమే డాక్టరు అందుకున్నాడు.
"మీరూ అన్నారూ ఆ మాట! నలుగురూ చంపేస్తారని గాని, నాకూ ఆ అనుమానం లేకపోలేదు సార్!"
ఈ మారు ఎగతాళి వదలి రామారావు ఆసక్తితోనే అడిగేడు.
"ఎందుచేత నంటారు?"
"లేకపోతే కమ్యూనిజానికి పుట్టినిల్లు, పెట్టనికోట అని చెప్పుకొనే సోవియటు యూనియను భిలాయ్ మొదలైన పరిశ్రమలనిచ్చి భారతదేశం లోని బూర్జువా ప్రభుత్వానికి ప్రాణం పోస్తుందా?"
"ఒకటి."
"బూర్జువా భారతదేశం, నియంతృత్వపు పాకిస్తానూ కొట్టుకుంటూంటే అడ్డుపడి తాష్కెంటు సంధి కుదిర్చింది. యుద్ధం కొనసాగి రెండూ బలహీనపడితే రెండు దేశాలలో విప్లవం వచ్చేది. ఆ అవకాశాన్ని చైనా గుర్తించింది. సోవియటు భగ్నం చేసింది."
"రెండు"
"మన దేశంలో ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్న ప్రభుత్వంతో భాయీ భాయీ కలుపుతూంది. నిజమైన కమ్యూనిస్టు దేశం చైనాతో పేచీ పెట్టుకొని దానికి సహాయం మానేసింది."
"మూడు. చాలు. మీరు తిరుగులేని వుదాహరణలు మూడిచ్చేరు కాని."
"మూడేమిటి ముప్ఫయి చెప్తా. కమ్యూనిజానికి సోవియట్ చేస్తున్న ద్రోహం వుందే సార్! మీకు వినగల ఓపిక వుంటే…."
అటువంటి వోపిక లేదని రామారావే ఒప్పేసుకున్నాడు. కాని వాదం మానలేదు.
"అయితే, అసలు విషయం ఒకటుంది కదా. సామ్రాజ్యవాదాన్ని నాశనం చెయ్యవలసిందే. కాని, ఆ దేశాల్లో ప్రజలున్నారు. సామ్రాజ్యవాదుల వద్ద అణుబాంబులున్నాయి, సోషలిస్టు దేశాలకీ ఉన్నాయి. వీళ్ళ దేశాల్లోనూ ప్రజలున్నారు. ఇప్పుడు ప్రజల విషయం, ఆలోచించడం అంటూ ఒకటుంటుందా? లేక ఆటం బాంబుల్ని సద్వినియోగం చెయ్యడం వరకేనా మన పూచీ…."
"ఆటంబాంబు వట్టి కాగితం పులి."—అని డాక్టరు చప్పరించేసేడు.
"మావో మంత్రం తాయెత్తులా పని చేస్తుందని మీకు నమ్మకమేమో, నాకు లేదు సుమండి. కాని, ప్రాణి అజేయం. దానిని నిర్మూలించలేరు. అనుమానం ఎందుకు. రేడియో ధార్మిక శక్తిని నిగ్రహించి ప్రాణి మళ్ళీ పెరుగుతుంది. అయితే అది మానవ రూపిగా వుండలేదు. దానికి ఆకలి దప్పులు, ఎండవానలు వుండకపోతాయేమో, కాని కలిమి లేముల బెడద వుండకపోవచ్చుననుకుంటా."
రామారావు తన్ను ఎగతాళి పట్టిస్తున్నాడనిపించి డాక్టరు తగ్గేడు.
"ఇవన్నీ వాదనలతో తేలేవి కావు. నేను ఏడాది నుంచి వాదించేను. మీరు నాలుగైదేళ్ళ నుంచి నోరెట్టుకు వాదిస్తున్నారు. ఫలితం ఏమిటి? ఇద్దరం బతకడం ఎల్లాగని తిరుగుతూనే వున్నాం. లాభం లేదు, సర్! లాభం లేదు. తుపాకీ ఒక్కటే దీనికి మందు. దేశ భక్తి! వట్టి హంబగ్!"
ముప్ఫయ్యో ప్రకరణం
సాయంకాలం అయింది. చల్లబడింది. పెళ్ళివారి యిల్లు హడావిడిగా వుంది. చీకటి పడే వేళకి రాగల పెళ్ళివారి కోసం, తెల్లవారే ముందు జరగగల పెళ్ళికోసం అవసరమైన దానికన్న ఎక్కువే హడావిడి పడుతున్నారు. రావలసిన బంధువులింకా రాలేదేమని కంగారు పడుతున్నారు.
జయప్రద నెమ్మదిగా పెదతల్లి కూతురు పక్క చేరింది. ఆమెను చూడగానే రమణమ్మకు రామారావు మాట జ్ఞాపకం వచ్చింది.
"మరచేపోయేను జయా! ఆయన సంగతి ఎవరన్నా చూస్తున్నారో, లేదో, కాస్త నువ్వేనా శ్రద్ధ తీసుకో! అప్రతిష్ఠ కూడాను. కాస్త కాఫీ, ఫలహారం పట్టుకెళ్ళి ఇచ్చిరా."
"తరవాయిలన్నీ పూర్తయాయి. నువ్వేమీ కంగారుపడకు" అని జయప్రద దిలాసా ఇచ్చింది.
రమణమ్మ కళ్ళలో కొంటెతనం పొటమరించింది.
"ఆయన సంగతేదో నీమీదే వదిలేస్తున్నా. ఎరగని చోటూ, కొత్త మనుష్యులూ, కాలు ఎల్లా వుంది."
"ఏం లేదు. వేణుగోపాలరావు గారు ఏదో రాసేరు! తగ్గింది."
జయప్రద ఏదో చెప్పదలచి తటపటాయిస్తున్నదని రమణమ్మ గ్రహించింది.
"ఏమిటి విశేషం?"
"విశేషం ఏమీ లేదు. అల్లా గన్నారం అక్వీడక్టు మీదికి వెళ్ళొస్తాం."
పెళ్ళి కావలసిన జంట. అల్లా విహారాలు జరపడం ఎంతవరకు వుచితమో – రమణమ్మ ఒక్క నిముషం తటపటాయించింది. మళ్ళీ అంతలోనే సర్దుకొంది.
"చీకటి పడకుండానే వచ్చెయ్యండి. పెళ్ళివారు వస్తారు. కాస్త నువ్వేనా చేతికి ఆసరా వుండకపోతే ఎల్లాగ?"
మర్యాదల నతిక్రమించ వద్దన్నమాటనే మరొకలా చెప్పిందని జయప్రద గ్రహించింది.
"సరే"
ముప్ఫయ్యొకటో ప్రకరణం
పెద్ద చెరువును ఆనుకొనివున్న విశాలమైన బయలులో హైస్కూలు భవనాలున్నాయి. వాని ముందు గచ్చు చేసిన ఎత్తయిన అరుగు వుంది.
"ఇక్కడ కూర్చుందాం. ఇప్పుడు అక్విడక్టు చూడటానికంటూ వెడితే వేళకి తిరిగిరాలేం." అంటూ జయప్రద శుభ్రంగా వున్న ఆ ప్రదేశానికి దారి తీసింది.
రామారావు జేబురుమాలు తీసి అరుగు మీద కొంతమేర దులిపేడు. దానిని ఆమె కోసం పరిచేడు. ఆమెకు ఎదురుగా కొద్ది దూరంలో తాను కూర్చున్నాడు.
"మీరు రావడం చాల మంచిపని చేసేరు. మా అక్క, పెద్ది అంతా చాలా సంతోషపడ్డారు.
"అసలు వచ్చే స్థితి లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడవలసి వచ్చింది. దానిని వాయిదా వెయ్యడం సాధ్యం కాలేదు. వచ్చేసేను."
పెళ్లి తరవాయి కాక పూర్వమే తన వరుడు తన సలహా కావాలంటూ వూళ్ళవెంట వచ్చేడు. ఆమె మనస్సు మహోన్నత శిఖరాలనెక్కింది. చిరునవ్వుతో —
"ఏమిటా విషయం."—అంది.
"నా వుద్యోగం పోయింది."
"అయ్యో."
"ఎక్కడేనా ఏ చిన్న వుద్యోగమేనా దొరక్కపోతుందాయని తిరుగుతూ ఇక్కడికొచ్చేను."
ఉత్సాహమంతా చప్పబడిపోయి జయప్రద సన్నగా అడిగింది.
"ఎక్కడేనా…."
రామారావు తల తిప్పేడు.
"ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా, బి.ఏ. ఈ వేళ ఎవరికీ అక్కర్లేదు."
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళుతుండవలసిన వయస్సులో వారిద్దరూ ప్రపంచం అంతా విరిగి మీద పడిపోయినట్లు బరువుగా, నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుండి పోయేరు.
"ఆ రోజున నిష్కారణం చదువు మానుకొని వుద్యోగంలో చేరేనే అనిపిస్తూంది."
"పోనీ ఇప్పుడైతే ఏమయింది? మీరూ యునివర్సిటీలో చేరండి."
"నాకూ ఆ ఆలోచనే కలిగిందనుకో. కానీ…."
"ఇంక కానీ వద్దు. ఏమీ వద్దు. నాన్న నన్నూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కి వెళ్ళమంటున్నారు."
"తప్పకుండా వెళ్ళు. చదువు. నువ్వు సందేహించనక్కర్లేదు."
"మీరు చదివితే నేనూ చదువుతా. ఇంతవరకు చదవ వద్దనుకున్నా."
"ఆ ఆలోచన ఎందుకొచ్చింది. చదివించే వాళ్ళుండగా, ఆ అవకాశం వదులుకోడం!"
"ఏ బి.యిడి., యో చేద్దామనుకున్నా."
"పాడు బి.యిడి. గతి లేని నాబోటి గాళ్ళకది."
"సరే. మీరు చెప్పినట్లే. అయితే ఒక షరతు. మీరు చేరితే."
"నువ్వు చెప్పేది బాగానే వుంది. నేను చేరే మార్గం వుండాలి కదా. ఆ ఆశతోనే ఇన్నాళ్ళూ…."
"ఔననుకోండి."
"ఆ వుద్యోగం పోవడంతో పై చదువు ఆశా పోయింది."
"వున్నా జరగదుకదా."
"అదీ నిజమే."
"అందుచేత వుద్యోగం పోవడం ఒక విధంగా మంచిది."
"డబ్బున్నప్పుడంతే. కాని…."
సంభాషణ ఎంతసేపూ సుళ్ళు తిరుగుతూంది. తన మనస్సులోని మాట చెప్పలేకుండా వున్నాడు. అతని ఆలోచనలు జయప్రద కర్ధమయ్యే స్థితి లేదు. కొద్దిసేపు ఆలోచించేడు.
"నాకు వచ్చిన గోల్డు మెడల్సు అన్నం పెట్టలేవు."
అది కొత్త మాట కాదు. జయప్రద ఏమీ అనలేదు.
"నాకా ఆస్తేమీ లేదు."
ఆ విషయం ఆమెకు తెలుసు.
"ఇంకిప్పుడు నీ ఆసరాతో నా కాళ్ళ బురద వదుల్చుకోడం ఓ దారి."
జయప్రదకు అదేమిటో అర్ధం కాలేదు. "చెప్పండి."
రామారావు చెప్పలేకపోయేడు. సత్యనారాయణ యిచ్చిన సలహాను ఆమె ముందర వొప్పుకోడానికి సిగ్గుగా వుంది. ఈ వారం రోజులూ చేసిన వుద్యోగ ప్రయత్నాలు మరోదారి లేదనిపిస్తున్నాయి. సిగ్గయినా బయట పడక తప్పదు.
"నేను, నువ్వు కూడ యూనివర్సిటీలో చేరుదాం."
అతని ఆలోచన ఏమిటో తెలియకపోయినా అతని నిర్ణయం ఆమెకు ఇష్టమే.
"అదే నే చెప్పేదీ…."
"కాని…."
ఆ తటపటాయింపేమిటో అర్ధం గాక అతని ముఖంలోకి చూసింది.
"డబ్బేది?….కట్నం వద్దన్నా. కుటుంబం ఏర్పాటుకికూడా పైవారి సాయం తీసుకోనన్నా. ఇప్పుడదంతా వట్టి బూకరింపేననిపిస్తూంది. నువ్వు బాగా ఆలోచించుకో. మీ వాళ్ళతో కూడ ఆలోచించు. నాకు వెంటనే సమాధానం ఇవ్వనక్కర్లేదు."
"చెప్పండి. మీరు చెప్పే విషయం గురించి ఎవ్వరితో ఆలోచించనక్కర్లేదు!"
ఆ మాటకు నవ్వు వచ్చినా రామారావు తేల్చేసేడు.
"హడావిడి పడకు. తాపీగా ఆలోచించుకొని మరీ చెప్పు. నా పథకం ఇది…."
అతడు తన ఆలోచనలు వివరించేడు. శ్రద్ధగా వింది. ఆ పథకంలో కీలకాంశం తమ వివాహం జరగడం అనేంత వరకే ఆమెకు అర్ధం అయింది. ఆమెకది యిష్టమే.
"బాగానే వుంది."
కాని, తన పధకం నీతి బద్ధం కాదనే సందేహం రామారావు మనస్సును కెక్కరిస్తూంది.
"తొందరపడకు. మాములుగా డిమాండు చేసి పుచ్చుకొనే కట్నం కూడా ఆడపిల్ల సొత్తుగానే వుంటుంది. ముందే అన్యధా నిర్ణయం జరుగుతే తప్ప. ఇక్కడ నాకేమీ అక్కర్లేదంటూనే, మీ నాన్నగారు నీకిచ్చే భూమిని అమ్మేసి చదువుకోవాలనుకొంటున్నా."
"దానిలో నా ఖర్చు కూడా కలిసే వుంటూంది కదా."
"నిజం చెప్పాలంటే భార్యకి అన్నం పెట్టలేని వాడికి పెళ్లి అనవసరం. కాని నేను పెళ్ళికి సిద్ధపడుతున్నా. అంతేకాదు. సామెత చెప్పినట్లు నేను పొట్టుతెస్తా, నువ్వు పప్పులు పట్టుకురా. రెండూ కలిపి వూదుకు తిందామంటున్నా. బాగుంది కాదూ!"
"మీరు అల్లా అనుకోడం మంచిది కాదేమో. పరిస్థితుల్ని పట్టి సర్దుకొంటాంగాని, సూత్రాలు పట్టుక్కూర్చుంటే పనులు జరుగుతాయా."
"ఆ సర్దుకొందామన్న ఆలోచన ఫలితమే నా ప్రతిపాదన. పరిస్థితులంటూ యదార్ధాన్ని విస్మరించరాదు. భార్య పోషణ భారం ఎత్తుకోలేనివాడు పెళ్ళి పేరెత్త కూడదు. అది ప్రపంచ న్యాయం."
ఇంత సంకోచం, ఇంత వ్యధ. పెళ్ళి చేసుకోడం ఏం సుఖం అనిపించింది.
"అయితే ఓ పని చేద్దాం. చదువు పూర్తి అయ్యే వరకూ ఇప్పటి లాగే వుండొచ్చు." అంది.
భూమి అమ్మడం, దానితో బతకడం సమస్య వచ్చింది కనక వెనక తీస్తూందనుకొన్నాడు.
"అదే ఆలోచించ మనేది."
"మీ ఆలోచనలను మీరు సిద్ధం చేసుకోండి. ఇంత సంకోచం, తటపటాయింపు."
రామారావు తల వొంచుకున్నాడు.
"ఈ ఆలోచన నిదివరకే మీ నాన్నగారు సూచించేరు. డబ్బిస్తాను. పోయి చదువుకోమన్నారు. కాదన్నాను. మా సత్యనారాయణ మామ అదే విషయాన్ని కొంచెం సవిరించి మీ నాన్నకు చెప్తానన్నాడు. మార్పల్లా నీ డబ్బుతో చదువుకోవడం. పెళ్ళి కాకుండా నీ డబ్బు వాడుకొనే హక్కు నాకు ఎక్కడుంది? అందుకోసం పెళ్ళి. నువ్వు పెళ్ళి చేసుకొనేది నీ మీద బతకవలసినవాడిని. అందుకే తొందర పడవద్దనడం. ఆలోచించమనడం. నీకు చెప్పాలనుకున్నదిదే. నా అభిప్రాయం నేనే చెప్పి నీ ఆలోచనకు వ్యవధి నివ్వాలని."
ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. జయప్రదే అంది.
"ఆలోచించవలసినది నాకేం కనబడదు."
"కాని, మీ నాన్నగారు, అమ్మగారు…."
"బహుశా ఏమీ అనకపోవచ్చు. ఆయన ఇస్తానన్న భూమి మాటల్లోనే వుంది. అందుచేత ఏం చేసినా ఆయనతో సంప్రదించవలసే వుంటుంది."
"ఔను. సందేహం ఏం వుంది?"
"పైగా భూమి అమ్మితేగాని చదువులకి డబ్బు సమకూడదు. అమ్మడానికి ఆయన సహాయం అవసరం."
"ఆ విషయంలో నాకేమీ సందేహం లేదు. ఈ పాటికి మా మామయ్య మీ నాన్నగారితో మాట్లాడే వుంటాడు. అసలు పార్టీకి చెప్పకుండా వ్యవహారం దూరానే ఫైసలు చేయిస్తానేమోనని కంగారుపడి వచ్చేను, నీతో మాట్లాడడానికి."
"థేంక్సు."
ఒక్క నిముషం వూరుకొని రామారావు మళ్ళీ ప్రారంభించేడు.
"భూమి అమ్మేలోపున మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టనక్కర్లేదు. నా వద్ద పది పన్నెండు వందలుంది. దానితో నడుపుతూందాం."
అతని అమాయికత్వానికి జయప్రద నవ్వింది.
"ఏం. ఎందుకు?"
"భూములు అమ్మడానికి పెడితే, కుదిరిందా, బేరం ఆ రోజే కుదరవచ్చు. లేదా నెలలు, ఏళ్లు కూడ గడుస్తాయి."
రామారావు తెల్ల బోయేడు.
"అవసరానికి అమ్ముతున్నామని తోస్తే అయినకాడికి అడుగుతారు. తీరా కాలేజీలో చేరాక ఒకటి రెండు నెలలలో అమ్ముడవకపోతే…."
తనవద్దనున్న డబ్బు ఒకటి రెండు నెలలకు మించి చాలదంటున్నట్లు అర్ధం చేసుకున్నాడు.
"నిజమే."
"అంతే కాదు."
"చెప్పు."
జయప్రద చెప్పలేక తల వంచుకొంది.
"ఊ."
"అన్నిటికీ ముందు నాన్న ఈ వేళ పెళ్ళి తలపెట్టగల స్థితిలో లేరు."
"ఎందుకనుకున్నావు."
"కంట్రాక్టుల బిల్లులు రెండు మూడు లక్షల వరకూ రాలేదని కంగారు పడుతున్నారు."
ఓ నిమషం ఆలోచించి రామారావు మార్గాంతరం చూపించేడు.
"మీ వాళ్ళు ఒప్పుకుంటే, నీకు ఇష్టం అయితే రిజిస్ట్రారు ఆఫీసుకు వెడదాం."
"వాళ్ళు ఒప్పుకోరు."
"నీకు తెలుసా?"
"పెళ్ళి ఎల్లా చెయ్యాలి, ఎంత ఖర్చు చెయ్యాలి—అనే దాని మీద ఇంట్లో చర్చలు జరగడం నాకు తెలుసు."
ఇద్దరూ మరల ఆలోచనలో పడ్డారు.
"నేనొకటి చెప్పనా?" అంది జయప్రద.
"చెప్పు."
"నాకిష్టమే. మనమే సాహసిద్దాం."
"అంటే?"
ఒక్క నిమషం తటపటాయించి చెప్పేసింది.
"రిజిస్ట్రారాఫీసుకి మనమే వెడదాం."
"మీ వాళ్ళకి కోపం వస్తుంది."
"దానితో, ఖర్చుకి డబ్బు లేదని పెళ్ళి వాయిదా వేసే అవసరం వుండదు కదా."
అలా చెయ్యడంలో ఎన్ని బాధలున్నాయో ఆమెకు తెలిసినట్లు లేదనుకున్నాడు.
"మేము పెళ్ళి చేస్తామంటూంటే, మాకు చెప్పకుండా ఎందుకు చేసుకున్నారని కక్ష కడితే?"
"కట్టి ఏం చేస్తారేం?" అంది జయప్రద నిర్లక్ష్యంగా.
"నీ వయస్సెంతో ఎరుగుదువా?"
"ఇరవై."
"నువ్వు మైనరువనీ, నిన్ను మోసగించేననీ కోర్టు దాకా వెళ్ళకపోవచ్చునేమో కాని, జయా! నిజానికి అది నిన్ను మోసపుచ్చినట్లే అవుతుంది. ఉద్యోగం లేని ఈనాటి పరిస్థితిలో నీ మెడకు గుదిబండలా తగిలించి నీకూ, నీ భవిష్యత్తుకూ అపకారం చెయ్యడమే అవుతుంది."
జయప్రద ఆశ్చర్యంతో అతని ముఖం చూస్తూ కూర్చుండి పోయింది.
"నీ చదువు చెడుతుంది."
"ఈ స్థితిలో నా చదువంత ముఖ్యం కాదు."
రామారావుకది నచ్చలేదు. తల తిప్పేడు.
"ఒద్దు. నీక్కూడా ఈ బాధలెందుకు?"
"మీ చదువుకూ, భవిష్యత్తుకు అదొక్కటే మార్గం."
"మీ నాన్న కక్ష కడితే అది మార్గమే కాదు."
అర్థం అయి జయప్రద తెల్లబోయింది.
"ఆస్తి కోసం నువ్వు నాకు హాస్టేజీవన్నమాట. వద్దు వదిలెయ్యి."
జయప్రదకు కష్టమనిపించింది. ఆస్తితో వస్తే పెళ్ళి చేసుకొంటాడు. లేకపోతే లేదు—అన్నమాట. అదేదో స్పష్టం చేసుకోదలచింది.
"ఆయనకుగాని, మరొకరికిగాని కోపం వస్తే రానివ్వండి. ఆస్తి ఇవ్వరు. అంతేనా? మనమిద్దరం ఏదో పని చేసుకుని బతకలేకపోతామా?"
"మనమిద్దరం కలిసి చెయ్యగలది మీ నాన్నగారిని బ్లాక్ మెయిల్ చెయ్యడం, వద్దు. నాకది ఇష్టం లేదు. నువ్వు పెద్దగా ఆలోచించకు. కడుపు నిండని చోట ప్రేమలూ, ఆప్యాయతలూ నిలబడవు. నిన్నూ, నీ అభిమానాన్నీ తక్కువ చేస్తున్నానుకోకు. మనుష్యుని సాధారణ స్థితి అంతే. ఆ ఆలోచన వదిలెయ్యి. మా మామయ్య వెళ్ళి మీ నాన్నగారిని అడిగి వుంటారు కదా. ఏమనుకున్నారో తెలుస్తుంది. అల్లా కాదు. ఇప్పుడేమిటన్నారా, పోయి చదువుకో. అప్పటికి…."
జయప్రదకు కోపం, దుఃఖం వచ్చింది. "అంటే…." ఆమె పెదవులు వణికేయి. "నాలుగెకరాల భూమి ఇచ్చి చేస్తే పెళ్ళి. లేకపోతే వద్దు. అనేనా మీ అభిప్రాయం?"
రామారావు తెల్లబోయేడు.
"నా వుద్దేశం అది కాకపోయినా, ఆ అర్ధం వచ్చే అవకాశం వుంది" అన్నాడు.
"సరి. ఇంక చెప్పనక్కర్లేదు."
ఇద్దరూ లేచేరు. ఇద్దరి మనస్సులలో ఒకే మాట మెదిలింది.
"ముందే తేలిపోవడం మంచిదే అయింది."
కాని ఆ మాటలో తేలిన విషయాలు మాత్రం వేరు.
ముప్ఫయి రెండో ప్రకరణం
రిక్షా దిగుతూనే హనుమంతరావు వేసిన మొదటి ప్రశ్న కూతుర్ని గురించి.
"జయ ఏదీ. కనబడదు."
"అల్లా షికారు కెళ్ళేరు, కాబోయే దంపతులు," అంది రమణమ్మ చిరునవ్వుతో.
హనుమంతరావు తెల్లబోయి భార్య ముఖం వంక చూసేడు.
"కాబోయే దంపతులేమిటి? ఎవరు?" అంది నరసమ్మ చిర చిర లాడుతూ.
"అతడిక్కడికి ఎప్పుడొచ్చేడు?" అన్నాడు హనుమంతరావు. ఎందుకొచ్చేడనబోయిన వాడే, సర్దుకొన్నాడు.
"పొద్దుట."
"ఎంతసేపయింది వెళ్ళి?"
"ఎటుకేసి వేళ్ళే" రన్నది తరువాతి ప్రశ్న.
ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లున్న ఆ దంపతుల కంఠ స్వరాలు విని, ఆ ప్రశ్నలు చూసి రమణమ్మ తాను పొరపాటు చెయ్యలేదు గదా యనుకొంది.
"త్వరగానే రమ్మన్నా. వస్తూంటారు. అల్లా గన్నారం అక్విడక్టు మీదికి పోయి వస్తామన్నారు."
హనుమంతరావు ఏమీ అనలేదు. అనలేడు కూడా. ఈ కాబోయే అల్లుని మంచితనం గురించీ, తన కూతరు అదృష్టం గురించీ నిన్నటి వరకూ బంధువులందరి వద్దా పదే పదే ప్రశంసించిన వాడే. ఈవేళ ఏమనగలడు? అతని అయిష్టం ఏమిటో రమణమ్మకి అర్ధం కాలేదు. ఆమె ప్రశ్న కిచ్చిన సమాధానం చిత్రంగా అనిపించింది.
"ప్రదానం జరిగిందనుకో. అది పెళ్ళి జరిగినట్లు లెక్కా."
"ఆ అబ్బాయి…."
"ఇంతవరకు పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చేడు. చూశా, మరి లాభం లేదు. దాని పరీక్షలయ్యాయి. ఇంక ఆపడం లేదు. అర్ధం లేదు. వేరే సంబంధాలు చూస్తున్నా."
రమణమ్మ ఆశ్చర్యపడింది.
"మీరా దృష్టిలో వున్నట్లు వారిద్దరికీ కూడా తెలియదనుకుంటా."
నాలుగైదెకరాల సుక్షేత్ర ఖండ్రికతో వస్తున్న గ్రాడ్యుయేట్ పిల్ల చెయ్యి జారిపోతుందేమోనన్న భయం పట్టుకొన్నవాడు ఆ సంగతి తెలియనిస్తాడా?" అన్నాడు, హనుమంతరావు కసీ, హేళనా మేళవించి.
రమణమ్మ ఆశ్చర్యంగా చూసింది.
"ఆయనగారికి వుద్యోగం పోయింది, తెలుసా?"—అన్నాడు హనుమంతరావు.
"ఎప్పుడు?"
"ఈ మధ్యనే."
"పాపం."
"పాపం ఎందుకు? ఎన్నికల్లో కాంగ్రెసుకి వ్యతిరేకంగా పంచె ఎగ్గట్టి పరవళ్ళు తొక్కినప్పుడు ఎరగడా?"
రమణమ్మ ఏమీ అనలేదు. హనుమంతరావే సాగించేడు.
"ఇప్పుడు తినడానికి మెతుకు లేదు. కనక వెంటనే పెళ్ళి చేసుకుని నా మెడ మీద సవారీ చెయ్యాలని చూస్తున్నాడు….నేను మొయ్యడానికి ఒప్పుకొంటే."
జయప్రద మాటల్ని విన్నాకా, ప్రత్యక్షంగా మనిషిని చూసేకా రమణమ్మకు రామారావు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. హనుమంతరావు మాటలు దానిని తొలగించలేకపోయాయి.
"జయప్రద ఎరుగునా, బాబాయ్."
"దానికేం తెలుస్తుందే, చిన్నపిల్ల" అంది పక్కనేవున్న నరసమ్మ.
"అదేమిటి పిన్నీ. ఇరవయ్యేళ్ళ పిల్ల. చదువు సంధ్యలున్నది. దానికి తెలియదంటావేమిటి?"
"ఏళ్ళు రావచ్చు. మనం ఆగమన్నా రోజులు ఆగవు కనక. తెలివుంటే చదువూ వస్తుంది. ప్రపంచ ఙ్ఞానం అన్నది బజారులో దొరికే వస్తువేనా కాదే." అన్నాడు, హనుమంతరావు.
ఒక్క నిముషం ఆగి మళ్ళీ అన్నాడు.
"తాను పెళ్ళికి సిధ్ధంగా వున్నట్లు కబురు చేసేడు. ఏమిటా, ఇల్లా కళ కుదిరిందని కదలేసే సరికి అసలు సంగతి బయటపడింది."
"పిల్ల పేరన పెట్టే భూమిని అమ్మేసి దానితో మళ్ళీ చదువు వెలిగిస్తాడట. అదీ సంబడం." అంది చిరాకుగా నరసమ్మ.
"ఇది వరకే ఇతగాడితో లాభం లేదని, ఇతర సంబంధాలు ఆలోచిస్తున్నా. ఇప్పుడీ కొత్త ఎత్తు తెలిశాక, మరో అమాయకప్పక్షిని పట్టుకోరా బాబూ, అని చెప్పేశా."
"నీ ఆలోచన ఆయన దాకా వచ్చివుంటే ఇల్లా ఎందుకొస్తాడు?"
"కాకపోతే ఎందుకొచ్చేడంటావు?"
రమణమ్మ ఈ దురభిప్రాయాన్ని సవరించే అవకాశం ఇంకా వున్నదనుకొంది.
"కానీ బాబాయ్. నువ్వే చదివించినట్లవుతుంది, తప్పేమిటి?"
ఆమె మనస్సులో తన మేనకోడలికి చేస్తున్న సంబంధం మెదులుతూంది. కాని, హనుమంతరావు ఒప్పుకోలేదు.
"కట్నం, గిట్నం తీసుకోనని బోడి గొప్పలెందుకు?"
"ఏవో పిచ్చి భ్రమలుంటాయి, కుర్రవాళ్ళకి. వాటిని మనం నిలతియ్యాలా? వున్నదంతా వూడ్చి పెట్టి, దొరికినచోటనల్లా తెచ్చి చదువుకొని సంపాదించుకొనే వాళ్ళ కోసం పరిగెత్తాలనుకోమూ? కట్నం వద్దన్నాడు గనక నువ్వు ఇవ్వగల సాయం సున్న చుట్టాలా?"
"ఏమిటంతల్లా వాదిస్తున్నావు,"
"నువ్వు తొందరపడుతున్నావేమోనని. జయ మనస్సు తెలుసుకోనిదే ఏ నిర్ణయం చెయ్యకు బాబాయ్."
హనుమంతరావు ఆమె అఙ్ఞానానికి జాలిపడ్డాడు.
"నాలుగెకరాల భూమీ, పాతిక ముప్ఫయివేల బంగారంతో పిల్లనిస్తూ మన సాయం వుంటే గాని పొయ్యిలో పిల్లి లేవని సంబంధం ప్రారబ్ధమా! ఇది కాస్తా కరిగించేసి చదువుతే మాత్రం బయట పడతాడనే నమ్మకం ఏమిటి?"
ముప్ఫయిమూడో ప్రకరణం
చల్లగాలికి తిరిగివచ్చిన జయప్రద వేళ్ళేటప్పటి వుత్సాహంతో తిరిగి రాలేదని రమణమ్మ గ్రహించింది. పినతండ్రి, పినతల్లి ఆలోచనలు ఆమె దాకా అందేయా అనిపించింది.
"ఏం అల్లా వున్నావు?"
"ఎల్లా వున్నాను. బాగానే వున్నానే."
అంతలో ఇంట్లోంచి తల్లి గొంతుక వినబడ్డంచేత మారు ప్రశ్నకు అవకాశం లేకుండా తప్పించుకొంది.
"ఇంతసేపు ఎక్కడి కెళ్ళేవే?"—అని అడుగుతుందామె.
"వెళ్ళు. మీ అమ్మ పిలుస్తూంది. దొడ్లోకి పోయి, మొహం కడుక్కుని మరీ కనిపించు."
అదేమిటన్నట్లు జయప్రద అక్కగారి మొహం చూసింది.
"వీళ్ళెప్పుడొచ్చారు."
"మీరు అల్లా వెళ్ళేరు. వాళ్ళూ వచ్చేరు."
"ఉహూ."
"మీ అమ్మకి కనిపించిరా, పనుంది."
జయప్రద తల వూపింది.
"చీకట్లో, పొరుగూళ్ళో రోడ్ల వెంట షికార్లేమిటే—" అని నరసమ్మ కోప్పడింది.
"రోడ్లంబడి తిరగలేదమ్మా. హైస్కూల్ గ్రౌండ్సులో కాస్సేపు కూర్చుని వచ్చేం."
"అల్లాగే కూర్చుని వస్తూండు. పెళ్ళి కావలసిన దానివి." అంటూ నరసమ్మ రుసరుసలాడింది.
"ఊ. వదిలెయ్యే….ఇల్లా రామ్మా" అని తండ్రి పిలుస్తూంటే అటు వెళ్ళింది.
"అతడిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేడో తెలుసా?"
జయప్రద వూరుకుంది.
"రెండు మూడేళ్ళయి పెళ్ళి మాట అనుకున్నా గంట దూరంలో వున్న మన వూరెప్పుడూ రాలేదు. కాని, పిలుపూ గిలుపూ లేకుండా రెండు జిల్లాల అవతల ఎవరింట్లోనో పెళ్ళవుతూంటే ఎందుకు వచ్చినట్లు?"
"చెప్పేరు."
"చెప్తాడు. నా దగ్గిర ఆటలు సాగలేదు. నిన్ను లాయమారుదామనుకుని వచ్చేడు."
జయప్రద ఏమీ అనలేదు.
"నిన్ను పట్టుకుని వూరేగితే నలుగురూ జంట కుదిరిందని పేరెట్టేస్తారు. బంధుకూటం యావత్తూ తధాస్తంటారు. అప్పుడే మీ రమణక్క బోల్తా పడింది. కాదనేందుకు వీలు లేకుండా కట్టుదిట్టం చేసుకొనేందుకు వేసిన ఎత్తు."
ఆ మాటలలో జయప్రదకు బేసబబు కనిపించలేదు. చెప్పిన పధ్ధతి తేడా అంతే. కాని రమణమ్మ ఆ ఆలోచన తప్పు సుమా అంటూంటే తెల్లబోయింది.
భోజనానంతరం అన్ని పనులు తెముల్చుకొని, రమణమ్మ జయప్రదను చిక్కించుకుంది. రామారావుతో సంభాషణనంతనూ తెలుసుకుంది.
"దురుద్దేశంతో నిన్ను చేత చిక్కించుకొని, మీ నాన్నని నొక్కదలచుకొన్నవాడైతే నీ సూచనను వెంటనే ఒప్పేసుకొనేవాడు. రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాట్లు గప్ చిప్ గా జరిగించేసేవాడు."
కాని, జయప్రద మనస్సులో గట్టి అనుమానం పాదుకొంది.
"ఆయనకు కావలిసింది ఆస్తి. మనిషి కాదు. మనుష్యుల స్వభావాలు బయటపడడానికి ఇటువంటి ఘట్టాలే సాయపడతాయి. స్వభావం తెలిసింది. చాలు."
"ఏమ్మాటే అది. చేతిలోంచి కానీ ఖర్చు చేయనక్కర్లేకుండా అతడే మనని కూడా భుజాన వేసుకుంటే అందరం అభినందిస్తాం. అతని ఆదర్శాలకి మీ నాన్నలాగే జోహారులర్పిస్తాం. ఓహో, ఆహా అంటాం. కాని…."
"ఏమిటా కాని…." అని జయప్రద రొక్కించింది.
"కాకపోతే ఏమిటే. నిజం చెప్తే నిష్ఠూరమేగాని, నిన్నీ పళాన పెళ్ళి చేసుకోడం అతనికి అదనం బరువు. ఆ బరువు తగ్గించడానికి నువ్వు చేసే సాయం ఏమిటే?"
"పెళ్ళి అనేది మనిషి కోసమా, డబ్బుకోసమా"
"తర్కానికి మంచి విషయమే. కాని, అన్ని సందర్భాలలోనూ ఈ తర్కం సరిపడదు. కడుపు నిండని చోట ప్రేమా, ఆప్యాయతా నిలబడవన్నాడన్నావు. చాలా తెలివైన మాట."
జయప్రద ఒక నిముషం ఆగింది.
"నేనూ వుద్యోగం చేస్తానన్నాను."
"ఇదివరకే వున్న అతని వుద్యోగం సౌరభ్యం అల్లా వుంది. ఇంక నీది తరవాయి. పోనీ ఒకవేళ ఇద్దరికీ వుద్యోగాలు వుంటాయనే అనుకున్నా మూడేసి నెలలక్కూడా జీతాలందని ఈ గవర్నమెంటులో మీరేం తింటారు?"
"అయితే ఈ చదువులెందుకేం? భూమీ, నగలూ అమ్ముకొని…." అంది జయప్రద ఏడుపు మొహంతో.
"ఏభయ్యేళ్ళ క్రితం లోయర్ సెకండరీ పెద్ద చదువు. నలభయ్యేళ్ళ క్రితం స్కూల్ ఫైనలు. ముప్ఫయ్యేళ్ళ క్రితం బి.ఏ. ఈ వేళ పోస్టుగ్రాడ్యుయేషన్ కూడా కాదు. ఫారిన్ డిగ్రీ. ఈ పోటీలో కూర్చోడానికి లేదని మావారు పై చదువుకంటూ ఇంగ్లండు పరుగెత్తేరు. పరిశ్రమలు పెరగని దేశంలో డిగ్రీలు పెంచుకుంటూ పోడం తప్ప పోటీలో నిలబడే దారి లేదన్నారు. ఇంగ్లాండు చూసి రావడానికి తయారు చేసిన సిధ్ధాంతం అనుకున్నా. కాని, రామారావు స్థితి చూసేక నిజమే అనిపిస్తూంది."
జయప్రద ఆలోచనలో పడింది. రమణమ్మ మాట మార్చింది.
"ఇది మీరు ప్రేమించుకొని, చేసుకొన్న నిర్ణయం అనుకొంటాను."
ప్రేమించుకోడం అన్న మాటకు జయప్రద మనస్సు ఒప్పలేదు.
"ఇద్దరికీ ఇష్టం అయింది."
రమణమ్మ చెల్లెలు వంక నిరసనగా చూసింది.
"ఇష్టం అంటే వేరే పిల్లా! రోగిష్టి కాకుండా వుండి, సుమారుగా పర్వాలేదులే అనుకునేటట్లుంటే మొగుడూ పెళ్ళాలాట ఆడుకొనేందుకు ఇష్టంగానే వుంటుంది. కానీ, ప్రేమ వేరు…."
"నాకేం తెలియదు." అని జయప్రద విసురుకుంది.
"తెలియదని నాకూ అర్ధం అయింది. వరదిట్టం వుంది. ఏ మాత్రమో చదువుంది. సంపాదించుకొంటున్నాడు. అన్నింటికీ ముఖ్యం పెద్ద బాధ్యతలుండవు. అంచేత నీకిష్టంగానే వుంటుంది. కట్నం ఇవ్వక్కర్లేదు. ప్రదానంలో పంచెల చాపు కూడా వద్దన్నాడు. అది మీ నాన్నకు నచ్చింది."
"మా నాన్న ఆయన్ని ఎరగనే ఎరగడు. కట్నం ఇస్తాననే అన్నాడు. లోపం చేయాలనుకోలేదు…."
"అంటే నువ్వే ఏరికోరి తెచ్చుకున్న వరుణ్ణి అర్ధంలేని అనుమానాలతో చెండనాడుకొంటున్నావన్నమాట."
"లేనిపోని మెలిక వేస్తున్నది నేను కాదు."
"నువ్వే చెప్పినట్లు విని పెళ్ళికి సిధ్ధపడి వుంటే ఏమయ్యేది? కోపం కొద్దీ మీ నాన్న ఆస్తి ఇవ్వడు. చదువుకి సాయం చెయ్యడు. ఆయనకా వుద్యోగం లేదు. ఏం తింటారు? ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఆయన ఎరుగును. నిన్ను కూడా బురదలో దింపడం ఇష్టం లేదన్నమాట నిజమే. ఆయన చాల తెలివిగలవాడు…."
"నీవన్నీ….ఔనుగాని, పోయి చదువుకో, చదువు ముగిసేక నీకింకా ఈ దృష్టి వుంటే అప్పుడాలోచిద్దాం. ఇప్పుడు మీ నాన్న మాట వినుకోమని ఎందుకంటారు?"
"అదన్నమాట అపరాధం." రమణమ్మ జాలిపడుతున్నట్లు చూసింది. "రెండేళ్ళకి నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. తాను? ఇంతకంటె పెరగకపోవచ్చు. నీ దృష్టి మారవచ్చు. డబ్బులో తక్కువ. చదువులో తక్కువ. వీడు మొగుడేమిటనిపించడం సహజం. నిన్ను బంధించి వుంచడం అన్యాయం అనుకున్నాడని దాని అర్ధం…."
"ఇదంతా నీ వూహ. అంతే." అంది, జయప్రద దృఢంగా. రమణమ్మ కాదనలేదు.
"నీ మనస్సు నిరుకు చేసుకొన్నావు. మంచిదయింది. తరవాత బాధ పడనక్కరలేకుండా."
ముప్ఫయినాలుగో ప్రకరణం
పక్కవాటా తలుపు తీసిన చప్పుడయి, సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుశీలా, భాగ్యలక్ష్మీ వులికి పడ్డారు.
"చూడు ఎవరో." అంటూ లేచి, సుశీల అరుగుమీది లైటు వేసింది.
"రామం వస్తాడా?" అంటూ భాగ్యలక్ష్మి తలుపు తీసింది.
వీధిలో లైటు వెలగగానే లోపలివాళ్ళ ఆదుర్దా అర్థమయింది, రామారావు.
"నేనేనండి" అన్నాడు.
సుశీలా, భాగ్యలక్ష్మీ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళు అరుగు మీదికి వచ్చేసరికే అతడు గదిలోంచి కుశలప్రశ్నలు వేస్తున్నాడు.
"అంతా బాగున్నారా?"
"ఇప్పుడెందుకొచ్చేవు?"
సుశీల ప్రశ్నకు రామారావు వెనుతిరిగి చూసేడు. ఆ ప్రశ్న అతని కర్ధం కాలేదు. తప్పుగా వినిపించినట్లు తోచింది.
"రావడం అయితే జనతాలోనే వచ్చేను. ఎప్పటిలాగే అది ఒక జీవితకాలం లేటు. మళ్ళీ ఎక్కడ వెళ్ళగలమని వస్తూ, వస్తూ ఆత్మారాముణ్ణి శాంతపరచే వచ్చేను."
"హోటల్లో భోజనం చేసి వస్తున్నావా?" భాగ్యలక్ష్మి మాటలో వ్యక్తం అవుతున్న భయాన్నిగాని, ఆశ్చర్యాన్నిగాని అతడు గుర్తించలేదు.
"మనకోసం వంటలు వండించి, పళ్ళేలు కూడా పరిచి వుంచేరు. బాబూ! ఆకలేస్తూండి వుంటుంది. మళ్ళీ ప్రాణం కడబట్టగలదు. దయచేసి నాలుగు మెతుకులు కొరికి వెళ్ళండి—అంటూ దారికాచి, మైకుల్లో ఆహ్వానిస్తూంటే తోసేసుకు రమ్మంటావా? మంచిదానివి కదూ, సిధ్ధాన్నం కాలదన్నుకు వస్తే మళ్ళీ అన్నం పుడుతుందా?"
అతడు మామూలుగానే మాట్లాడేస్తున్నాడు. కాని, మనస్సులోని ఉద్విగ్నతను మాటల ప్రవాహం మాటున కప్పిపుచ్చుకుంటున్నట్లు కనబడింది. ఎందుకా ఉద్విగ్నత? విషయం ఎరిగి మొండితనం, నిర్లక్ష్యం చూపుతున్నాడా? సుశీల మెదడులో ఎన్నో ఆలోచనలు.
"ఈ వారం పదిరోజుల్లో పోలీస్ సి.ఐ. ప్రతిరోజూ మీరు వచ్చేరాయని మనుష్యుల్ని పంపుతూనే వున్నాడు."
"మనం ఇంకా వుద్యోగం వెలిగిస్తున్నామన్న భ్రమలో వున్నాడేమో మహానుభావుడు. మనం ఇప్పుడు స్వేచ్ఛా జీవులం అని చెప్పక పోయేరా. ఈమారు మరొకర్ని వెతుక్కున్నేమో పాపం."
"ఆయన ఎరుగును"—అంది భాగ్యలక్ష్మి.
"మన సిఫార్సులు వినే అభాజనుడున్నాడని భ్రమపడుతూండి వుంటాడు, అయితే."
అతని బేఫర్వా ధోరణి చూస్తే తమది వట్టి అనుమానమేమోనని ఇద్దరికీ ఒక్క క్షణం అనిపించింది.
"ఆయనకు మీతో పనేమిటి?"
"ఆయనకా? ఓ సుపుత్రుడున్నాడు. నాన్నగారి వుద్యోగం ధర్మమాయని వాడు వట్టి వెధవాయిలా తయారయాడు. స్కూలు ఫైనలులో మూడుమాట్లు డింకీలు కొట్టేక మూడువేలు తనవి కావనుకున్నాడు. వాడు గట్టెక్కేడు. వాళ్ళ నాన్నకి, అంటే సి.ఐ. గారికి దేశప్రజల ఆరోగ్యం గురించీ, వంతెనలు, రోడ్లు మొదలైనవి దేశంలో వృధ్ధి పొందడంలేదే అనీ తపన పట్టుకొంది. ఇప్పుడా సుపుత్రుడికి మెడిసిన్‌లోనో, ఇంజనీరింగ్‌లోనో సీటు కావాలని నా సలహాలు అడిగేడు. అది గాకుంటే ఆ పెద్దమనిషికి మనలాంటి దిగంబర సన్యాసితో పనే లేదు."
"ఏమీ కాదు."—అంది సుశీల.
"నీ మీద వారంటు వుందిట తెలుసా?" అంది భాగ్యలక్ష్మి.
రామారావు తెల్లబోయేడు. ఆమె ముఖం వంక చూసేడు. సుశీలను చూసేడు. నమ్మకం కుదరలేదు, నవ్వేడు.
"ఎవరండీ, మనల్ని అరెస్టు చేయ్యాలనుకునే మూర్ఖుడు. ఎందుకోసం? మన ప్రభుత్వం ఎంత పనికిమాలినదైనా, అంత తుగ్లక్ ప్రభుత్వం అనుకోను. నన్ను అరెస్టు చెయ్యడం తప్ప వాళ్ళకి మరో…."
"నిజమే…." సుశీల ఎంత దృఢంగా చెప్పినా అతని కది విశ్వసనీయం అనిపించలేదు.
"పోనీలెద్దురూ, ఉద్యోగం ఎల్లాగూ లేకుండా చేశాం కదా. కొన్ని రోజులు మన ఖర్చుల మీద అన్నం, బస చూపిద్దామనుకున్నారేమో, పాపం. వాళ్ళ సత్సంకల్పాన్ని మనం ఎందుకు వద్దనాలి."
అతనిని కంగారు పెట్టకుండా అసలు విషయం చెప్పాలన్న వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. అతడు వారి మాటలు చెవి చొరనివ్వడంలేదు. అక్కడే అరుగుమీది గదిలో అతన్ని నిలబెట్టి వుంచడం న్యాయంగా తోచలేదు.
"నడవండి లోపలికి."
ముగ్గురూ లోపలి గదిలోకి నడిచేరు.
"మీ హడావిడి నాకు అర్ధం కావడంలేదు. చెప్పండి. నా మీద వారంటు ఏమిటో."
"పిల్లలు ఒక్కళ్ళున్నారు, తలుపులు తీసి వున్నాయి, చూసొస్తా. భాగ్యలక్ష్మీ, నువ్వు చెప్తూండు, వస్తా."
సుశీల తన వాటావేపు హడావిడిగా వెళ్ళింది.
"నారాయణగారిని అరెస్టు చేశారు. తెలుసా?"
"తెలియదు. పాలవాళ్ళ సమ్మెలోనా?"
"ఔను. హోటలువాళ్ళ పాల వేన్ తగలపెట్టి, డ్రైవరు బుర్ర పగలకొట్టేరని ఆయన మీద కేసు పెడుతున్నారు."
"అన్నంతపనీ చేశారన్నమాట."
"అదెంతవరకు నిజమో, నిజమే అయితే ఆ పని చేసిందెవరో," అంది భాగ్యలక్ష్మి.
"అయితే ఆ పనికి నేను సలహాదారుణ్ణా, సహాయకుణ్ణా? నా పాత్ర ఏమిటి?" అన్నాడు, రామారావు హాస్యం ఎగతాళీ జతకలుపుతూ.
అతనికి తన స్థితి ఏమీ గ్రహింపు లేదని భాగ్యలక్ష్మి అర్ధంచేసుకొంది.
"అడిషనల్ తాసీల్దారు చెంపలు వాయగొట్టేసినందుకుట."
చటుక్కున పంచదార కార్డుల కోసం వెళ్ళిన నాటి ఘట్టాలు గుర్తు వచ్చేయి. ఆ రాత్రే తాను ప్రయాణం అయి వెళ్ళిపోయేడు. తన గొడవల్లో తిరుగుతూ ఆ మాటే మరిచిపోయేడు.
"ఆంతవరకు రాలేదులే," అన్నాడు పరధ్యానంగా, 'ఏం? ఎవరు చెప్పేరు?"
"ఎవరు చెప్పడం ఏమిటి? ఊరంతా చెప్పుకుంటూంటే."
రామారావు ఆ మాటకు పకపక నవ్వేడు. భాగ్యలక్ష్మి గదిమింది.
"ఏమిటా నవ్వు? నువ్వు వచ్చినట్లు వూరంతా తెలియాలేమిటి?"
"అదొకటా. నేనిప్పుడు 'అండర్ గ్రౌండ్' కావాలేమిటి ఖర్మ."
భాగ్యలక్ష్మి నిస్పృహ కనబరచింది. "నవ్వకోయ్ బాబూ!"
"ఇంత గొప్ప జోక్ చెప్పి నవ్వవద్దంటే ఎల్లా భాగ్యం! అడిషనల్ తహశీల్దారు చెంపలు వాయగొట్టడం న్యాయమేనన్న సహృదయత ప్రజలలో వుందన్నమాట. ఔనుగాని, నారాయణ గారు ఎవరి బుర్రో పగలేశారన్న వార్త కూడా అటువంటి సద్భావ ఫలితమే కాదుకద?"
"అది చూసిన వాళ్ళు లేరు. కాని నువ్వు పంచదార కార్డు కోసం వెళ్ళడం, తాశీల్దారును కొట్టడం, ఫోన్ తెంపెయ్యడం, ఆఫీసు తగలపెట్టి అందర్ని చంపేస్తానని బెదిరించడం, వూరంతా గుబ్బుగా చెప్పుకుంటూంది."
"అబ్బో, నా వీరకృత్యాల గాధ ఇంత వుందన్నమాటే మరచిపోయాను సుమా." అని మరల నవ్వు ప్రారంభించేడు.
"ఇల్లాంటి కథలు కల్పించుకోగల ఇమేజినేషన్ ప్రజల్లో బ్రహ్మాండంగా వుంది. ఆ రోజున తాశీల్దారు పనికి సాయం చేశాగాని అడ్డం పెట్టలేదు. మిగిలిన కథలా, ఓస్!"
"అబధ్ధం అయితేనేం, చూసినట్లు కథల్లా చెప్పుకుంటూంటే."
"పోలీసాడు ఎందుకో వస్తే మీరీ భ్రమలు పెంచుకున్నారనుకుంటా."
"కాదు రామం. నిజమే. నీ మీద వారంటుందన్నాడట ఎస్.ఐ. నాన్న చెప్పేడు."
రామారావు ఆశ్చర్యంతో ఆమె మఖం వంక చూసేడు. వారంటు వార్త కన్న ఆమె 'రామం’ అని ఆప్యాయంగా పిలవడం అతనికి ఆశ్చర్యంగా వుంది. ఆ పిలుపు ఆమె నోట వచ్చి రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్ళూ ఆమె తనతో 'కంయ్' మంటుందేగాని సౌమ్యంగా మాట్లాడడం లేదు. దానికి కారణంగా తాను అనుకొంటున్నది వట్టి భ్రమ యేమోననిపించిన సమయాలు కూడా వున్నాయి. జయప్రదతో తనకు సంబంధం తెగిపోయిన వార్త ఆమె దాకా వచ్చిందా అప్పుడే—అనిపించింది.
"థేంక్స్. కూర్చో, స్నానం చేసి వస్తా."
భాగ్యలక్ష్మి చటుక్కున అతని భుజం పట్టుకుంది.
"వెళ్ళిపో. నేను చెప్తున్నది నిజమే. తాశీల్దారుకోసం పోలీసాళ్ళు నీమీద కారాలు నూరుతున్నారు. "
"తాశీల్దారుకు నూరే ఓపిక లేదా."
"నిజం, రామం."
"మీ నాన్న చెప్పేరా?"
ఆమె తల తిప్పింది.
"జనానికి కార్డులిప్పించినందుకే?"
మళ్ళీ తల తిప్పింది.
"ఉహూ"—అతడాలోచనలో పడ్డాడు.
"నువ్వు తప్పించుకు తిరుగుతున్నావని పోలీసులు అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకొచ్చేవు?"
తాను ఓ.వి. (ఔటాఫ్ వ్యూ) అన్నమాట వింటే మళ్ళీ నవ్వొచ్చింది.
"ఎందుకేమిటి? నేనెందుకు యు.జి. కావాలి. అయి చేసేదేమిటి?"
భాగ్యలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. కమ్యూనిస్టులు పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతారని ఆమె వింది. దానినే యు.జి. కావడం అంటారని తెలుసు. అండర్‌గ్రౌండ్ కమ్యూనిస్టుల అద్భుత సాహస గాథలు ఆమె ఎన్నో వింది. అన్నీ నమ్మింది కూడా. రామారావు కమ్యూనిస్టని అందరూ అంటారు. నగరంలో ప్రచారం అవుతున్న సాహస గాధలు విన్నాక అతడు అండర్‌గ్రౌండ్ కావడం తధ్యమేననుకొంది. ఆమె గర్వపడింది. అటువంటిదిప్పుడు ఇంటికి వచ్చేసేడు, పోలీసులకి ఎందుకు కనుమరుగు కావాలంటున్నాడు. అతనిని పట్టుకొని జైలులో పడేసి హింసలు పెడతారని ఆమె భయం.
ఏం చెప్పలేక పోయింది. తల తిప్పుకుంది. ఆమె ఏడుస్తూందని గ్రహించేడు.
"ఎందుకు ఏడుస్తావు?"
భాగ్యలక్ష్మి మాట్లాడలేదు. తల తనవేపు తిప్పుకోబోయేడు, అతని ప్రయత్నం సాగకుండా ఆమె అతనికి జేరబడిపోయి, భుజం మీద తల దాచుకుంది. చేయగలది లేక రామారావామెను పొదివి పట్టుకున్నాడు. ఆమె కన్నీళ్ళు చొక్కాలోంచి ఇంకి ఒంటికి వెచ్చగా తగులుతూంటే జాలి వేసింది. వీపు నిమిరేడు, జాకెట్ హుక్కులు చేతికి తగులుతున్నాయి. ఆమె మరింత కరుచుకుపోతూంది. ఏడుస్తూనే ఒక చేయి అతని నడుము చుట్టూ వేసింది.
"నువ్వు వెళ్ళిపో, దొరక్కు."
రామారావు ఆమెను ముద్దు పెట్టుకొన్నాడు. చెక్కిళ్ళు నిమిరి చిరునవ్వుతో ఎగతాళి చేసేడు.
"నేను దొరికితేనేం, భాగ్యం,"
ఆ ప్రశ్న "నీకేం" అన్నట్లు వినిపించి భాగ్యలక్ష్మి వొణికింది, గద్గద కంఠంతో.
"ఎక్స్‌క్యూజ్ మీ" అంది.
"ఏమీ ఫర్వాలేదోయ్."
అతను కౌగలించుకుని ముద్దు పెట్టుకొంటూంటే నాలుగురోజులనాడు తన ముందర చేసిన ప్రతిజ్ఞ భాగ్యలక్ష్మికి గుర్తేలేదని అటు వస్తున్న సుశీల గ్రహించి వెనక్కి తప్పుకుంది. నవ్వుకుంది.
ముప్ఫయ్యయిదో ప్రకరణం
స్నానం చేసి బట్టలు మార్చుకు వచ్చి భాగ్యలక్ష్మి పక్కనే మంచం మీద కూర్చుని రామారావు ఆమె అభ్యర్ధనను పెక్కు కోణాల నించి నిరాకరించేడు.
"నేనెందుకు అండర్ గ్రౌండ్ కావాలి?"
"అయి ఏం చెయ్యాలి?"
"యు.జి. కావడం ఫేషనా?"
"సులభమా?"
"అవసరమా?"
"ప్రజలకేమన్నా సాయం చేస్తే, చేస్తూంటే మనకి రక్షణ ఇస్తారు కాని, నాకెందుకు ఇస్తారు? ఇవ్వాలి?"
"ఏ పనీ చెయ్యకుండా, పోలీసాళ్ళు నన్ను పట్టుకుంటామంటున్నారు నన్ను కాస్త దాచండంటే దాస్తారా? అదంత సులభమనుకున్నావా?"
"వట్టినే కూర్చుంటే తిండి ఎల్లాగ? వీధిలోకెళ్ళను. నాకింత అన్నం మీరే పెట్టాలంటే అర్ధం ఏమిటి?"
అతనిలో సహజంగా వున్న మొండి పట్టుదలే ఈ నిరాకరణకు కారణం అనుకుంటున్న భాగ్యలక్ష్మి అతనిననేక కోణాలనుంచి ఒప్పించడానికి ప్రయత్నించింది.
"మీ పార్టీ మీకు సాయపడదా? ఇల్లాంటప్పుడు వాళ్ళు నిన్ను నీ మానాన వదిలేయవలసిందేనా?"
రామారావు నవ్వేడు.
"నేను పార్టీ సభ్యుడిని కాను."
"అడిషనల్ తాసీల్దారును రెండేసేవంటే అతని మీద కోపమా నీకు, జనం…."
రామారావు నవ్వేడు.
"నేనెవరినీ కొట్టలేదు మొర్రో అంటే నువ్వే నమ్మడంలేదే. ఇంక కోర్టుని నమ్మించడం ఎల్లాగ?"
భాగ్యలక్ష్మి వూరుకొంది.
"చూడు భాగ్యలక్ష్మీ! ప్రజలలో పనిచేస్తున్న వాడూ, అతడు బయట వుండకపోతే పనులు చెడతాయన్న వాడూ యు.జి. కావడం అవసరం. ఒకప్పుడు అటువంటి వాళ్ళు కూడా రహస్యంగా వుండడంకన్న అరెస్టు కావడం వల్లనే పని ఎక్కువ జరుగుతుంది. ఇంక నా మాట అంటావూ, నన్ను అరెస్టే చేస్తే…."
"ఇంకా సందేహమే?"
"రహస్యంగా వుండి నేను చేసేది లేదు. కేసు పెట్టనీ. ఈ గాడిద కొడుకులు ఆఫీసుల్లో పంది కొక్కుల్లా చేరి ఎల్లా దోచుకుంటున్నారో, జనాన్ని ఎల్లా హింస పెడుతున్నారో, వాళ్ళకి పోలీసులూ, ప్రభుత్వమూ ఎల్లా సాయపడుతున్నారో కడిగేస్తా. దిక్కుమాలిన ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు దేశాన్ని అగ్నిగుండం చేసి పెడుతున్నారు. తమకు తగులుతూందని దొంగ ఏడుపులేడుస్తున్నారు. ఈ దొంగ ఏడుపులు మాని జనం సంగతి పట్టించుకోకపోతే నిజంగానే ఏడవవలసి వస్తుందని వాళ్ళకి తెలియాలి."
ముందు గదిలో బూట్ల చప్పుడు విని ఇద్దరూ లేచి అటు వచ్చే సరికి వెనక వసారాలో పోలీసువాడు ఎవరినో అటకాయిస్తున్నాడు.
"ఉండవమ్మా. లోపల పళ్ళ గంప ఏం లేదు."
"లే. నే వెళ్ళాలి." సుశీల గొంతుక.
ఎదురుగా వచ్చిన పోలీసాఫిసరును రామారావు,
"ఎవరు కావాలి?"
"మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా."
"ఎందుకో అడగవచ్చునా?"
దానికి సమాధానం ఇవ్వకుండా సబినస్పెక్టరు ఎదురు ప్రశ్న వేశాడు.
"ఆమె ఎవరు? ఇక్కడెందుకుంది?"
సబినస్పెక్టరు ఆలోచనా ధోరణి అర్ధం అయిందనుకున్నాడు. తనను అరెస్టు చేయడమేకాదు. సాధ్యమైతే అవమానించడం కూడా వుద్దేశం అన్నమాట. చటుక్కున అనేసేడు.
"నా భార్య."
భాగ్యలక్ష్మి వులికి పడింది. ఇనస్పెక్టరు ముఖాన విషపు నవ్వు ఒక్కక్షణం కనబడింది.
"మీరు అవివాహితులనుకుంటాను."
"మీ దయవలన కొద్దిరోజుల క్రితమే ఆ ఆశ్రమం వదిలాను. మీరు మాత్రం ఎప్పటిలాగే తప్పుడు సమాచారంతో దేశ రక్షణ సాగిస్తున్నారు."
"ఉహూ. నడవండి. మా సమాచారం తప్పుడుదేమో అనుభవం మీద తెలుసుకొందురుగాని…."
"అదే అనుకొంటున్నాం." అన్నాడు రామారావు. "భాగ్యం గుడ్ బై. వుద్యోగం సద్యోగం లేని రోజుల్లో కాస్త జైలు ఎక్స్పీరియెన్సు సంపాదించడం ఎందుకేనా మంచిది…..ఛెస్ ఏడుపెందుకు? ఎస్. ఐ. ఏమనుకుంటారు. మన్ని ఏడిపించగలిగేమనుకోరూ. కళ్ళు తుడుచుకో. గుడ్ గరల్. సుశీలగారూ? మరి సెలవా? నారాయణగారిని చూస్తా లెండి. చెప్తా. అంతా బాగున్నారని."
ఇనస్పెక్టరు వెనక్కి తిరిగి పోలీసుకు సైగ చేశాడు.
"….కె.డి.గాళ్ళ కన్న తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఇది తరవాయిలన్నీ…."
"సందేహం ఎందుకు? యథా రాజా తధా ప్రజా—అన్నమాట. తక్తు మీద వున్నది పరమ లుచ్ఛాలయితే, దేశంలో పరమ హంసలవుతారా, ఇన్ స్పెక్టరుగారూ! భ్రమ. కేవలం భ్రమ."
—అంటూ రామారావు ముందుకు అడుగేసేడు.